వాసన్న చొరవ.. నాలుగేళ్ల నిరీక్షణకు తెర..!

Young Woman Joined job With Sanction of Supernumerary Post Ongole - Sakshi

సూపర్‌న్యూమరీ పోస్టు మంజూరుతో ఉద్యోగంలో చేరిన యువతి 

సాక్షి, ఒంగోలు: రేయింబవళ్లు కష్టపడి చదివి సాధించిన ఉద్యోగం ఓ చిన్న సాంకేతిక కారణంతో ఆ యువతికి అందకుండా పోయింది. కోర్టు ఆదేశించినా అధికారులు పోస్టు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించడంతో ఆ యువతి ఉద్యోగంలో చేరింది. వివరాల్లోకి వెళితే..జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామం యానాది సామాజిక వర్గానికి చెందిన పొట్లూరి హనుమంతరావు, లలితమ్మలకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్దమ్మాయి అంజలి డీఈడీ పూర్తి చేసిం 2018లో డీఎస్సీ రాయగా మంచి మార్కులతో 3726 ర్యాంకు సాధించింది.

ఈ డీఎస్సీలో ఎస్టీ యానాది ఉప కులానికి 8 తెలుగు మీడియం పోస్టులను కేటాయించారు. ఈ క్రమంలో 2020లో డీఎస్పీ 2018 పోస్టులకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలంటూ విద్యాశాఖ మెరిట్‌లో ఉన్నటువంటి అభ్యర్థులకు మెసేజ్‌లు పంపింది. అయితే ఫోన్‌ ప్రాబ్లం కారణంగా ఆ సమాచారాన్ని అంజలి అందుకోలేకపోయింది. దీంతో ఈమె కంటే ఎక్కువ ర్యాంకులు వచ్చిన అదే సామాజికవర్గానికి చెందిన మరో ఇద్దరు మహిళలు ఉద్యోగాలు సాధించారు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న అంజలి అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైకోర్టు సింగిల్‌ బెంచ్, డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

చదవండి👉🏾:  (మంచి విజన్‌ ఉన్న యువ సీఎం జగన్‌: కుమార మంగళం బిర్లా)

పూర్వాపరాలను పరిశీలించిన డివిజన్‌ బెంచ్‌ అంజలికి పోస్టు కేటాయించాలని, ఒకవేళ పోస్టు ఏదీ ఖాళీగా లేకపోతే సూపర్‌న్యూమరీ పోస్టు అయినా కేటాయించాలంటూ పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే పాతికేళ్ల క్రితమే సూపర్‌ న్యూమరీ పోస్టులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. దీంతో ఆమె విషయాన్ని పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, అప్పటి విద్యుత్‌ శాఖ మంత్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి అభ్యర్థించింది.

బాలినేని ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాసి పర్యవేక్షించారు. దీంతో అంజలికి గత నెల 10న సూపర్‌ న్యూమరీ పోస్టు మంజూరైంది. ఆమెకు గుడ్లూరు మండలం చేవూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పోస్టు కేటాయిస్తూ ఉత్తర్వులు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పి.జగన్నాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. తన ఉద్యోగం పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని పోస్టు మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top