Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు | FactCheck: Yellow Media Poison Stories On Education In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: విద్యపై ఎల్లోమీడియా విషపు కథలు

Published Fri, Dec 29 2023 5:47 AM

Yellowmedia Poison Stories on Education - Sakshi

సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు అమ్మ.. ఆవు అనే పదాల దగ్గరే ఆగి­పోవాలి గాని.. ఇంగ్లిష్‌ నేర్చుకోవ­డమేంటి? ప్రభుత్వ బడుల్లోని విద్యా­ర్థులు చిరిగిన సంచీలో నాలుగు పుస్త­కాలు పట్టుకు­పోవాలే తప్ప.. కార్పొరేట్‌ పిల్లల్లా టై కట్టుకుని, బూట్లు వేసుకుని బడికి వెళ్లడమేంటి? మాలాంటి పెద్దల ఇంట్లో పిల్లలు వాడే ట్యాబ్‌లు.. డిజిటల్‌ విద్యను వారికి ఇవ్వడమేంటి? డబ్బున్న బాబులు మాత్రమే కొనుక్కునే ఐబీ కరిక్యులమ్‌ చదువులను ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నేర్పించడమేంటి? నిరుపేద కుటుంబాల్లో పుట్టిన పిల్ల­లకు అండగా నిలుస్తూ.. ప్రభుత్వం వారిని ప్రయోజకులుగా తీర్చి­దిద్దడం నేరమే అంటోంది ఎల్లో మీడియా. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్కరణలపై అవగాహనా రాహిత్యంతో తప్పుడు ప్రచారం చేస్తోంది. 

ఒకే తరహా సిలబస్‌ అమల్లో ఉన్నా..
పాఠశాలల్లో ఏ సిలబస్‌ అమల్లో ఉందో.. ఏ పాఠ్య ప్రణాళికను అమలు చేస్తున్నారో తెలుసుకోకుండా విషపు కథలు అల్లుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా సిలబస్‌ అమల్లో ఉంది. ఎన్‌సీఈఆర్‌టీ టెక్ట్స్‌బుక్స్‌ మాత్రమే చదువుతున్నారు. ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) సిలబస్‌ అమలు చేసే పాఠశాలల్లో కూడా ఇవే టెక్ట్స్‌బుక్స్‌ ఉంటాయి. స్టేట్‌ బోర్డు, సీబీఎస్‌ఈ, ఐబీల్లో బోధన, పరీక్ష విధానాలు మాత్రమే మారుతాయి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ను మారిస్తే దేశంతో పాటు రాష్ట్రంలోనూ మారతాయిగాని, బోర్డు అనుబంధాన్ని బట్టి పుస్తకాలు మారవు. 

వర్తమాన కార్యాచరణపై దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లోని పాఠ్య పుస్తకాలు వర్తమాన కార్యాచరణ ఆధారిత పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించి రూపొందించారు. కొత్త పాఠ్య పుస్తకాల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను పొందడం, పునాది అక్షరాస్యతను ప్రోత్సహించడం, పదజాలం, ద్విభాషా నిర్మాణం, క్యూఆర్‌ కోడ్స్‌తో శక్తివంతం చేయడం, గణితం, పర్యావరణ శాస్త్రంలో ప్రపంచ ప్రమాణాలను అందించడం వంటి విభిన్న దృక్కోణాలను ప్రోత్సహించేలా తయారు చేశారు. కాబట్టి పాఠ్యపుస్తకాలు మార­తాయి అనేది అపోహ మాత్రమే. మెరుగైన బోధన, అత్యున్నత మూల్యాంకనం అంశాల్లో మాత్రమే మార్పు ఉంటుంది. 

విద్యార్థికి ప్రపంచ పోకడలపై అవగాహన
రాష్ట్రంలో ప్రతి బిడ్డను ప్రపంచంతో పోటీపడేలా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాంతో వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు బోధనలో మార్పు తెచ్చింది. విద్యార్థి కేంద్రీకృత బోధనాభ్యసనం ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన, విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు అందించింది. డిజిటల్‌ మాధ్యమం ద్వారా బోధన అమలుచేస్తూ ఆశించిన ఫలితాలను సాధించింది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంచేందుకు ‘ఇఫ్లూ’ వంటి ప్రముఖ విద్యా సంస్థల సహకారంతో ఎస్‌సీఈఆర్‌టీ కృషి చేస్తోంది.

ప్రపంచంలో 11 వేల వర్సిటీలుఆమోదించిన టోఫెల్‌ 
విద్యార్థుల్లో ఆంగ్ల భాషా సామర్థ్యాలను కొలిచేందుకు నిర్వహించే ఓ ప్రామాణిక పరీక్ష. ప్రపంచంలో దాదాపు 90 దేశాల్లోని 11 వేల కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ పరీక్షను ఆమోదించాయి. ప్రపంచంలో ఎక్కడైనా రాణించాలంటే ఈ పరీక్షలో ఉతీర్ణత సాధించాలనే సదుద్దేశంతో 1947లో టోఫెల్‌ మొదలు పెట్టారు. ఇప్ప­టికీ ప్రపంచంలో అతిపెద్ద లాభాపేక్ష­లేని విద్యా పరీక్ష అంచనా సంస్థ అయిన ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

దీనిప్రకా­రం మన విద్యార్థుల్లో ఆంగ్ల కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను కొలవడానికి, విద్యార్థుల బలాలు, సవాళ్లను సూచిస్తూ.. వారు ఏ దశలో ఉన్నారో తెలుసుకోవచ్చు. టోఫెల్‌ జూనియర్‌ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసి, భవిష్యత్‌లో వారు టోఫెల్‌ పరీక్షను సునా­యాసంగా ఎదుర్కొనేలా సిద్ధం చేయ­డం దీని ముఖ్యోద్దేశం. ఈటీఎస్‌ సహకారంతో ఎస్‌సీఈఆర్‌టీ ప్రతినెలా టో­ఫెల్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ విడుదల చేస్తోంది.

లిక్విడ్‌ అనే సంస్థ ఉచితంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోంది. విద్యా­ర్థులు 9వ తరగతిలో టోఫెల్‌ జూనియర్‌ పరీక్షకు హాజరవుతారు. దానికోసం మూడో తరగతి నుంచే విద్యార్థులకు తర్ఫీదు ఇస్తు­న్నారు. దీనికి ప్రభుత్వంపై ఆర్థిక భారం లేదు. టోఫెల్‌ జూనియర్‌ పరీక్షకు హాజర­య్యే విద్యార్థుల­కు ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.

పిల్లలకు సమాజాన్ని అర్థం చేసుకునే విద్య
ప్రభుత్వం రాష్ట్రంలోని వెయ్యి పాఠశాలలను సీబీఎస్‌ఈకి అనుసంధానించింది. ఆయా పాఠ­శాలల్లో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యా­యులను నియమించింది. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న ప్రపంచ సంక్లిష్టతను అర్థం చేసుకు­నేందుకు వీలు కల్పించే విద్యనందించాలని నిర్ణ­యించింది. అందుకు అనుగుణంగా ఇంటర్నేష­నల్‌ బాకలారియెట్‌ (ఐబీ) కరిక్యులంపై దృష్టి సారించింది. విద్యార్థులలో ప్రస్తుతమున్న కంఠస్థం, ధారణ, పరీక్ష సమయంలో పునశ్చరణ వంటి వాటికి భిన్నంగా ప్రాబ్లెమ్‌ సాల్వింగ్, క్రిటికల్‌ థింకింగ్, లేటరల్‌ థింకింగ్, అప్లికేషన్‌ ఆఫ్‌ నాలెడ్జి ఫర్‌ లైఫ్‌ స్కిల్స్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ వంటివి అందిస్తోంది.

దీంతోపాటు సంగీతం, కళ, వ్యాపార పరిపాలన మొదలైన వాటికి సమాన ప్రాధాన్యతనిస్తూ, చక్కటి  పాఠ్యాంశాలను అందించే ఐబీ బోర్డు పాఠ్యాంశాలను మన విద్యా విధానంతో అనుసంధానించేందుకు సాధ్యాసా­ధ్యా­లను పరిశీలిస్తోంది. దీనికోసం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి.. 2025 నాటికి ఐబీ కరిక్యులంను మన పాఠ్యప్రణాళికలో భాగం చేసేందుకు అడుగులు వేస్తోంది. విద్యార్థుల్లో అభ్యసనా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యా­యులకు ట్యాబులను అందించింది.

ఈ సంవత్సరం ట్యాబ్‌లలో సమస్యలను పరిష్కరించే డౌట్‌ క్లియరెన్స్‌ యాప్, విదేశీ భాషలు నేర్చు­కునేందుకు డ్యుయోలింగో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసింది. వీటిపై సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతి డైట్‌లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరమ్మతులు వస్తే సచివాలయాల్లో వాటిని బాగుచేసి ఇస్తోంది. అంతేకాక తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యాన­ల్స్‌ను అమర్చి డిజిటల్‌ కంటెంట్‌ను అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి­లో సిలబస్‌లో భాగం కానున్న ఫ్యూచర్‌ స్కిల్‌ సబ్జెక్టులు బోధించేందుకు పలు సంస్థల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేసింది. 

Advertisement
Advertisement