అబద్ధాల గురువు.. బాబుకు దరువు  | Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan And Sakshi Media | Sakshi
Sakshi News home page

అబద్ధాల గురువు.. బాబుకు దరువు 

Jan 9 2024 5:04 AM | Updated on Jan 9 2024 2:57 PM

Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan And Sakshi Media

(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : ‘ఈనాడు’కు 50 ఏళ్లు. రామోజీకైతే 87. కానీ ఏం లాభం? పత్రికేమో  అబద్ధాలకు కేరాఫ్‌. ఈయనేమో మోసాలకు గురువు. అయినా సిగ్గుండక్కర్లా? 17 ఏళ్లుగా తన ఇన్‌కమ్‌ ట్యాక్స్, మార్గదర్శి కేసుల్ని నానబెడుతూ... సాగదీస్తూ... కోర్టులకు అడ్డంపడుతూ వస్తున్న రామోజీ రావు... ‘సాక్షి’లో పెట్టుబడుల కేసుల్ని వాయిదాలతో నెట్టుకొచ్చేస్తున్నారని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై నిందలు వేయటమేంటి? మరీ ఇంత పచ్చి అబద్ధాలతో ఈ వయసులో ఏం సాధిస్తావయ్యా రామోజీరావ్‌!!. చంద్రబాబు కోసం మరీ ఇంత దిగజారిపోవాలా!?. 

అసలు ఈ కేసుల్లో వైఎస్‌ జగన్‌ తరఫున లాయర్లు ఎన్నడైనా కావాలని ఒక్క  వాయిదానైనా అడిగారా? ఒక్కసారైనా హాజరుకాకుండా ఉన్నారా? ఎందుకిన్ని అబద్ధాలు? ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు కోర్టు మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన తరఫు న్యాయవాదులు తప్పనిసరిగా ప్రతి వాయిదాకూ హాజరవుతున్నారు. రామోజీ కేసుల్లో కూడా హాజరయ్యేది లాయర్లేగా? మరెందుకు ఈ అరుపులు? ఎన్నికలు వస్తున్నాయనే కదా? గత ఎన్నికల ముందు కూడా ఇంతే. ఈ కేసులు నిరూపణ అయితే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శిక్ష పడుతుందని పదేపదే రాసి... జనాన్ని భయపెట్టాలని చూస్తే ఏమయింది? మీ అబద్ధాలను నమ్మబోమని మొహమ్మీద ఫెడేల్మని కొట్టి 151 సీట్లతో అఖండ విజయం కట్టబెట్టారు. అయినా బుద్ధి రాలేదా? ఇప్పుడూ అవే రాతలా? ఇంకెన్నాళ్లు రామోజీ!!.  

అసలు ఈ కేసులేంటి? ఎవరు వేసినవి? ఎప్పటివి?  
రాష్ట్రంలో ఎల్లో మీడియా అబద్ధాలకు అంతులేకుండా పోతోందని, రెండో కోణాన్ని చూపించే పత్రిక అత్యవసరమని భావించటంతో పుట్టుకొచ్చిన పత్రిక ‘సాక్షి’. పత్రిక భవిష్యత్తుపై నమ్మకం ఉండటంతోనే  పలువురు ఇన్వెస్టర్లు దీన్లో పెట్టుబడులు పెట్టారు. వారి నమ్మకం గెలిచింది. ‘సాక్షి’ ఒక మీడియా సంస్థగా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. తమ పెట్టుబడులు అనుకున్నదానికన్నా ఎక్కువ సక్సెస్‌ అయ్యాయని ఇన్వెస్టర్లు కూడా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు– రామోజీ మాత్రం దీన్ని తట్టుకోలేకపోతున్నారు. వాస్తవానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ ఏ కేసులూ లేవు. ఆ పార్టీని వీడటంతోనే కక్ష సాధింపులు మొదలయ్యాయి. తమకు రాజకీయ ప్రత్యర్థిగా అవతరించవచ్చనే భయంతో కాంగ్రెస్‌... టీడీపీతో చేతులు కలిపి మరీ కుట్రలకు దిగింది.  

ఇదీ.. బాబు–కాంగ్రెస్‌ కుట్రకు మూలం 
అసలు ‘సాక్షి’లోకి వచ్చిన పెట్టుబడులు పెట్టుబడులే కాదని... అదంతా ఆ సంస్థకు వచ్చిన ఆదాయమని, కాబట్టి దానిపై పన్ను కట్టాలంటూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఓ ఐటీ అధికారి ‘సాక్షి’కి అడ్డగోలు నోటీసులిచ్చారు. ఇదే... ఈ కేసుకు మూలం. తమకిలా ఉపకారం చేసినందుకు ఆ అధికారికి తాను అధికారంలోకి రాగానే చంద్రబాబు తగిన కానుక ఇచ్చుకున్నారు. ఏపీ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసి మరీ దానికి సీఈఓను చేశారు. ఈ నోటీసుల్ని ఓ పత్రిక ప్రచురిస్తే... ఆ పత్రిక కథనాన్ని జతచేసి కాంగ్రెస్‌ నేత శంకర్రావు హైకోర్టుకు లేఖ రాశారు.

దాన్ని పిటిషన్‌గా కోర్టు స్వీకరించింది. తమనూ చేర్చాలని టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతి కోరారు. కోర్టు చేర్చింది. నిజానికి అప్పటికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ కాదు. ఏ మంత్రితోనూ మాట్లాడింది లేదు. నాటి రాజధాని హైదరాబాద్‌లో కూడా ఉండేవారు కాదు. కాంగ్రెస్‌ బెదిరింపులకు లొంగకపోవటంతో ఎక్కడో బెంగళూరులో ఉన్న వైఎస్‌ జగన్‌పై కేసులు పడ్డాయి. కోర్టు తీర్పుతో దర్యాప్తు మొదలయింది.  


మూకుమ్మడి సోదాలతో భయోత్పాతం 
ఇక సీబీఐ దర్యాప్తు మొత్తాన్ని తనే నిర్దేశిస్తూ ఎల్లో మీడియా శివాలెత్తింది. నాటి దర్యాప్తు అధికారులు సైతం వందల బృందాలతో వైఎస్‌ జగన్‌ ఇల్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, ఇన్వెస్టర్ల ఇళ్లు సోదాలు చేసి భయోత్పాతం సృష్టించారు. చివరకు ఏమీ దొ­రక్క... ఐటీ అధికారి నోటీసులో ఏమయితే పేర్కొ­న్నారో... దాదాపుగా అవే అంశాలు పేర్కొం­­టూ 11 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈడీ కూడా సీబీఐని కాపీ చేసి... అది వేసిన 11 ఛార్జిషీట్లనూ తనూ యథాతథంగా వేసేసింది. అదీ కథ. అంటే అన్నిటికీ మూలం.. బాబు కోసం... ఓ అధికారి ఇచ్చిన ఐటీ నోటీసు.

కానీ చివరకు ఏమయిందో తెలుసా? ఆ ఐటీ నోటీసును ఐటీ ట్రిబ్యునల్‌ కొట్టేసింది. ఆ పెట్టుబడులన్నీ సక్రమమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో... తెలుగుదేశం– కాంగ్రెస్‌ అధిష్ఠానం కలిసి చేసిన కుట్ర స్పష్టంగా బయటపడింది. పెట్టుబడులు సక్రమమేనని ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునలే చెప్పినపుడు... దాని ఆధారంగా వేసిన ఛార్జిషీట్లు నిలబడతాయా? మరి ఈ కేసులో ఏం ఉందని రామోజీరావు దిగజారి రాస్తున్నారు? 

చంద్రబాబుకు జీవితాంతం జైలే... 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అంటూ సీమెన్స్‌ కంపెనీకి సంబంధం లేకుండానే ఆ కంపెనీతో నకిలీ ఒప్పందం చేసుకుని... ఏకంగా రూ.241 కోట్లను తన సొంత ఖా­తాల్లోకి మళ్లించేసుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు. ఈ కుంభకోణంలో ఇటీవలే 52 రోజులు జైల్లో ఉండి... ఆరోగ్యం బాగాలేదని, పరీక్షలు చేయించుకోవాలని చెప్పి బెయిలు తెచ్చుకున్నాడు. మరోవైపు విజయవాడలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను తమ భూముల మీదుగా మళ్లించి స్కామ్‌కు పాల్పడ్డారనే కేసు కూడా ఈయనపై ఉంది.

రాజధాని పేరిట దళితుల అసైన్డ్‌ భూములను అక్రమంగా హస్తగతం చేసుకున్న కేసు మరొకటి... ఫైబర్‌నెట్‌ పేరిట తన బినామీ సంస్థ టెరాసాఫ్ట్‌కు అడ్డగోలు కాంట్రాక్టు కట్టబెట్టి నిధులు కాజేసిన కేసు ఇంకొకటి. వీటిలో ఏ ఒక్కకేసు నిరూపణ అయినా... ఏడేళ్లకన్నా ఎక్కువే శిక్ష పడుతుంది. అంటే.. 73 ఏళ్ల చంద్రబాబు ఏ కేసులో నిజం నిరూపణ అయినా జీవితాంతం జైల్లోనే ఉంటారు. మరి ఈ నిజాన్ని మీ పత్రికలో చెప్పరెందుకు రామోజీ? ఎందుకంటే ఆయన మీ.. చంద్రబాబు కాబట్టి!!. అంతేగా? 

షేరు విలువపై మీరా.. మాట్లాడేది? 
‘సాక్షి’ మీడియా సంస్థ 10 రూపాయల విలువైన షేరును రూ.350 చొప్పున ఇన్వెస్టర్లకు విక్రయించిందని, ఇంత ప్రీమియం చెల్లించటమే కుంభకోణమని ప్రతిసారీ రామోజీరావు రాని ఆవేశాన్ని తెచ్చుకుని మరీ ఊగిపోతుంటారు. మరి ‘ఈనాడు’ పత్రిక తన 100 రూపాయల విలువైన షేరును ఏకంగా రూ.5,28.630 చొప్పున విక్రయించింది. పైపెచ్చు ఆ సమయంలో ‘ఈనాడు’ రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉంది. దీనికితోడు పనికిమాలిన పాత సినిమా రీళ్లను రూ.700 కోట్లుగా లెక్కగట్టి అమ్మేసింది.

ఇది అసలు ఏ స్థాయి కుంభకోణం? ‘ఈనాడు’ కన్నా మెరుగైన పత్రికను, మెరుగైన డిజైన్, ఆధునిక యంత్రాలతో తీసుకువచ్చినపుడు... షేరును రూ.350కి విక్రయించటం అక్రమమెలా అవుతుంది? పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లంతా సంతోషంగానే ఉన్నారుకదా? ఈ కేసులు గనక లేకుంటే ఏనాడో వారి వాటాలకు పెట్టుబడికన్నా ఎక్కువ విలువ వచ్చి ఉండేది. మరి ఈ వాస్తవాలన్నీ దాచి అబద్ధాల కథనాలెందుకు? ఎన్నికల సమయంలో ఏదో ఒకరకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై బురద జల్లాలనుకునే దౌర్భాగ్యపు రాతలు ఇంకెన్నాళ్లు?  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement