ఓటర్ల జాబితాలో వారిదే పైచేయి

Womens Have Highest Number Of Votes In Andhra Pradesh Voter List - Sakshi

రాష్ట్రంలో  పురుష ఓటర్లు 2.01 కోట్లు కాగా మహిళా ఓటర్లు 2.05 కోట్లు 

పురుష ఓటర్ల కంటే అదనంగా 4,62,880 మంది మహిళా ఓటర్లు  

ప్రతి వేయి మంది పురుషులకు 1,026 మంది మహిళా ఓటర్లు

శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ మహిళలే అధికం 

రాష్ట్రంలో 4.07 కోట్లకు చేరిన మొత్తం ఓటర్లు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఓటర్లలో అతివలదే అగ్రస్థానం. రాష్ట్రంలో పురుష ఓటర్లు 2,01,34,664 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉండటం విశేషం. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,62,880 మంది అదనంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొంది. ఒక్క శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279. వీరిలో 4,071 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు కూడా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 43,45,322 మంది ఓటర్లు ఉన్నారు.

ఆ తర్వాత గుంటూరు జిల్లా 40,89,216 మంది, విశాఖపట్నం జిల్లా 37,19,438 మంది ఓటర్లతో నిలిచాయి. ఇక విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 19,02,077 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మందికి 743 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18–19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య 2,07,893గా ఉంది. 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్‌ కేంద్రం ఉండగా కొత్తగా 33 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్‌ స్టేషన్ల సంఖ్య 45,917 నుంచి 45,950కి చేరింది.  

13.85 లక్షలు పెరిగిన ఓటర్లు 
రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే అదనంగా 13,85,239 మంది ఓటర్లు పెరిగారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో 3,93,51,040 మంది ఉండగా స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)–22 నాటికి 4,07,36,279కి చేరింది. ఇందులో విదేశీ ఓటర్లు 7,033, సరీ్వస్‌ ఓటర్లు 67,935 మంది ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top