శ్రీరస్తు.. కల్యాణమస్తు

Wedding Season Start On 25th January - Sakshi

భీమవరం (ప్రకాశం చౌక్‌): ఈ ఏడాది శుభాకార్యాలకు మంచి తరుణం. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్‌ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్‌ నామ సంవత్సరం ప్రారంభమవుతుండడంతో అంతా శుభం కలగనుంది. అధిక సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు ఉండడంతో కల్యాణ నామ సంవత్సరంగా ఈ ఏడాదిని చెప్పవచ్చు. ఏప్రిల్‌ నెలలో గురుమూఢమి, జూలై నెలలో ఆషాఢం, అధిక శ్రావణం కావడంతో ఈ ఏడాది ఈ రెండు నెలల మినహా మిగిలిన 10 నెల ల్లో 104 పెళ్లి ముహూర్తులు ఉండడం విశేషం. గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. ఏడాదంతా భాజాభంత్రిల మోత మోగనున్నాయి. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు తదితర శుభకార్యలకూ మూహూర్తులు ఉన్నాయి.  

25 నుంచి ముహూర్తాలు ప్రారంభం 
ఈనెల 25 తేదీ నుంచి పెళ్లిళ్ల ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. ఈనెలలో 4, ఫిబ్రవరి 12, మార్చి 13, మే 16, జూన్‌ 7, ఆగస్టు 8, సెప్టెంబర్ 6, అక్టోబర్‌ 10, నవంబరు 14, డిసెంబర్‌లో 14 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్, జూలై నెలల్లో ముహూర్తాలు లేవు. 

జోరుగా వ్యాపారాలు 
జిల్లాలోని కల్యాణ మండపాలు, పంక్షన్‌ హాల్స్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. వీటిని పెళ్లిళ్లకు నెల నుంచి రెండు నెలల బుక్‌ చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారం జోరుగా సాగుతోంది. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం పట్టణాల్లోని సంపన్నులు తమ ఇంట పెళ్లిళ్లకు ఖరీధైన పంక్షన్‌ హాల్స్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. దుస్తులు, బంగారం, కిరణా  వ్యాపారాలకు మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. లైటింగ్, డైకరేషన్, షామియన, టైలర్స్, వాయిద్యా కళాకారులు, బ్రహ్మణులు, రజకులు, నాయీబ్రహ్మణులు, వంట మేస్త్రీలు, పువ్వులు, పెయింటర్స్, ఫొటోగ్రాఫర్స్, ట్రావెల్స్‌ తదితరులు అందరికీ మంచి ఉపాధి లభించనుంది.  

పుణ్య క్షేత్రాల్లో ముందస్తు రిజర్వేషన్లు 
జిల్లాలోని పలు పుణ్య క్షేత్రాల్లో వివాహాల నిర్వహణకు ముందుగా ఆలయ ప్రదేశాలను రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ద్వారాకతిరుమల, పశి్చమగోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాలు, భీమవరం, కాళ్లకూరు, తణుకు వెంకటేశ్వరస్వామి దేవస్థానాలు, భీమవరం భీమేశ్వరస్వామి, నర్సాపురం, ఆచంట, తాడేపల్లిగూడెం, యలమంచిలి, పెనుగొండ తదితర ప్రాంతాల్లో ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. మొక్కుబడి ఉన్నవారంతా ఆలయాల్లోనే పెళ్లిళ్లు నిర్వహిస్తుంటారు. 

ఈ ఏడాది ముహూర్తాలు ఎక్కువే 
గడిచిన మూడేళ్లతో పోల్చితే ఈఏడాది పెళ్లిళ్ల ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది రెండు నెలల మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లిళ్లూ, ఇతర శుభకార్యాలకు ఈ ఏడాదంతా శుభపరిణామమే. ప్రస్తుతం తెలుగు సంవత్సరాది శుభకృత్‌ నామ సంవత్సరం నడుస్తోంది. మార్చి నుంచి శోభకృత్‌ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ తెలుగు ఏడాది కూడా అన్ని శుభకార్యాలకూ అనువైనది.  
– లింగాల సూర్యప్రసాద్, ఘనపాఠి, భీమవరం పంచారామక్షేత్రం అస్థాన వేదపండితులు   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top