వద్దంటున్నా పెళ్లి సంబంధాలు.. సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య 

Village Secretariat employee commits suicide in Anakapalle District - Sakshi

సాక్షి, అనకాపల్లి: దేవరాపల్లికి చెందిన సచివాలయ ఉద్యోగి గొర్లె వరుణ్‌కుమార్‌(31) ఆత్మహత్య చేసుకున్నాడు. తాను వద్దని వారించినా కుటుంబీకులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపంతో వరుణ్‌కుమార్‌ దేవరాపల్లిలోని తన ఇంట్లో శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలివి. దేవరాపల్లికి చెందిన గొర్లె వరుణ్‌కుమార్‌ (31) ఇదే మండలంలోని వేచలం గ్రామ సచివాలయంలో జూనియర్‌ లైన్‌మేన్‌గా మూడేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.

తన కుమారుడికి వివాహం చేయాలన్న ఆలోచనతో తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు కరువునాయుడు, బంధువులు వరుణ్‌కుమార్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే కొంతకాలం పెళ్లి సంబంధాలు చూడొద్దని వరుణ్‌కుమార్‌ నిరాకరించాడు. అయినా కుటుంబసభ్యులు తనకు సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం స్నానం చేసి వస్తానని చెప్పి ఇంటి రెండో అంతస్తులో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. వరుణ్‌కుమార్‌ ఎంతసేపటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేశారు. అయితే అతను ఫోన్‌ ఎంతకీ తీయకపోవడంతో గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి శ్లాబ్‌ హుక్కుకి తాడుతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు.

చదవండి: (Bhimavaram: మసాజ్‌ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్‌)

ఊపిరి ఉందేమోనన్న ఆశతో తాడు తొలగించి కిందికి దించారు. అప్పటికే వరుణ్‌కుమార్‌ మృతి చెందాడని నిర్ధారించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. మృతుడి తల్లి పైడితల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ తాతారావు, ఎ.కోడూరు ఎస్‌ఐ లోకేశ్వరరావు మృతుడి ఇంటికి చేరుకొని విచారణ చేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతితో తల్లితో పాటు కుటుంబ సభ్యులు పుట్టెడు దుఖంలో మునిగిపోయారు. తోటి సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామస్తులు వరుణ్‌కుమార్‌ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పరామర్శ 
వరుణ్‌ కుమార్‌ మృతి చెందాడన్న విషయం తెలుసుకొని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లికి చేరుకొని మృతదేహం వద్ద నివాళులర్పించారు. మృతుడి తల్లి పైడితల్లమ్మ, మేనమామ అల్లు నాయుడు తదితర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. మృతదేహానికి అనకాపల్లిలో పోస్టుమార్టం నిర్వహించి త్వరగా పంపించాలని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్‌లో డిప్యూటీ సీఎం ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top