విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే విజయ్, సరస్వతి మనసులు కలిశాయి. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఏడాది పాటు కాపురం సజావుగానే సాగింది. పండంటి మగబిడ్డ కూడా పుట్టాడు. అప్పటి నుంచే కలతలు ప్రారంభమయ్యాయి. భార్య ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుందనే అనుమానం పెంచుకున్నాడు విజయ్. ఇటీవల ఆస్పత్రిలో డ్యూటీ ముగించుకుని బయటకు వస్తున్న భార్యపై కత్తితో దాడి చేసి చంపేశాడు.
గంపలగూడెంకు చెందిన యువతి గ్రామ సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తోంది. పెద్దాపురం గ్రామానికి చెందిన పవన్‌తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 15 రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. వేధింపులకు గురి చేస్తున్నారంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది.
ఇలా ప్రేమ వివాహం చేసుకున్న వారితో పాటు, పెద్దలు కుదిర్చిన దంపతుల్లోనూ అనేక కలతలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా కొత్త స్నేహాలు ఏర్పడుతూ, అవి ఆకర్షణగా మారి, సొంత మనుషుల ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడని పరిస్థితికి తీసుకొస్తున్నాయి.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మూడు ముళ్లు.. ఏడడుగులతో ఒక్కటైన బంధం జీవితాంతం కలిసుండాలనే ఆలోచన చేసే వారు తక్కువయ్యారు. విలువలు అంతరించిపోతున్నాయి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఆప్యాయతలు, అభిమానాలు కనిపించడం లేదు. నామాటే నెగ్గాలనే ఇగోలు పెరిగిపోవడంతో భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడుతున్నాయి. వాటికి స్మార్ట్‌ఫోన్‌లు తోడవడంతో అనుమానపు భూతం మరింత జటిలం అవుతోంది. వీటి మధ్య విడాకుల దారి పట్టే వారు కొందరైతే, క్రూరమైన ఆలోచనలతో ప్రాణాలను తీసేందుకు వెనుకాడని వారు మరికొందరు.
ఇగోలే కారణం..
దంపతుల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. ఎవరికి వారు తమమాటే నెగ్గాలనే పంతాలు పెరిగాయి. ఇద్దరూ సంపాదన పరులు అయినప్పుడు ఇలాంటి సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. చిన్న విషయాలను సైతం పెద్ద సమస్యను చేస్తున్నారు. ఎవరి చాటింగ్ వారిదే.. ఎవరి ఫోన్‌లాక్ వారిదే అన్నట్లు కాపురాలు సాగుతున్నాయి. దీంతో ఇంట్లో ఎవరితోనైనా భార్య ఫోన్ మాట్లాడితే భర్త అనుమానించే పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా భర్త మాట్లాడినా భార్య అనుమానిస్తోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లో దంపతుల మధ్య పెను వివాదాలు తెచ్చి పెడుతున్నట్లు ఇటీవల జరిగిన ఘటనలే చెబుతున్నాయి.
దాంపత్య మధురిమలేవి?
భార్యభర్తలు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఆప్యాయంగా మెలిగేది లేదు. డబ్బు సంపాదనే ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారింది. ఏదొక వ్యాపారం, ఉద్యోగం చేస్తూ భర్త రోజంతా పనిచేసి, ఇంటికి రాగానే భోజనం చేసి పడుకొవడం సాధారణంగా మారింది. మనసంతా డబ్బు సంపాదన పైనే ఉంటుంది. కొద్ది సమయం కూడా భార్యతో ఆప్యాయంగా మాట్లాడే పరిస్థితి ఉండటం లేదు. ఇంటి వచ్చిన తర్వాత కొద్దిపాటి సమయం ఉంటే ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. ఇలా దాంపత్య మధురిమలు అంతరించి పోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో భార్యభర్తల మధ్య రిలేషన్స్ దెబ్బతింటున్నాయి.
అనుమానాలే.. పెనుభూతాలుగా..
స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావంతో కొందరు కొత్త రిలేషన్స్‌ను వెతుక్కుంటూ పాశ్చాత్య ధోరణికి అలవాటు పడుతున్నారు. సోషల్ మీడియాలో చూస్తూ అలానే చేసేందుకు చూస్తున్నారు. అవే దంపతుల మధ్య కలహాలు రేపుతున్నాయి. అంతేకాదు అనుమానాలతో హత్యలు చేసేందుకు వెనుకాడటం లేదు. తన భార్య ఎవరితోనో ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతోంది.. తనను అసలు పట్టించుకోవడం లేదని అనుమానం పెంచుకునే భర్తలు కొందరైతే, తన భర్త బయట ఎవరితోనో రిలేషన్‌లో ఉన్నాడు. తనను పట్టించుకోవడం లేదనే సాకుతో వివాహేతర సంబంధాలు పెట్టుకునే మహిళలు మరికొందరు. ఇలా విలువలు లేని జీవితాలకు అలవాటు పడుతున్నారు.


