లలితా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ 

Vijayawada Durgamma As Lalita Tripura Sundari Devi - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజైన శుక్రవారం లలితాత్రిపుర సుందరీ అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చారు. చక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా భక్తులను అనుగ్రహించారు. శుక్రవారం కావడంతో లక్ష మందికి పైగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి పైన ఆది దంపతుల నగరోత్సవం శుక్రవారం వైభవంగా సాగింది. కాగా, ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఆరో రోజైన శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

రేపు మూలా నక్షత్రం.. 
ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రం మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి రూపంలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహించనున్నారు. ఆ రోజు ఆలయానికి 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో ఆ రోజు వీఐపీ దర్శనాలను అధికారులు రద్దు చేశారు. మూలానక్షత్రం రోజు వృద్ధులు, వికలాంగులు దర్శనాలకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాగా, మూలా నక్షత్రం సందర్భంగా ఆదివారం సీఎం వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top