దుర్గగుడిలో విజిలెన్స్‌ తనిఖీలు

Vigilance‌ inspections at Durga temple - Sakshi

అన్నదానం, ప్రొవిజన్స్‌ టెండర్ల పరిశీలన

సాక్షి,విజయవాడ/ఇంద్రకీలాద్రి: దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై గత నెలలో ఏసీబీ అధికారుల తనిఖీల నేపథ్యంలో ఇప్పుడు విజిలెన్స్‌ అధికారులూ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం ప్రారంభమైన తనిఖీలు రాత్రి ఏడు గంటల వరకూ కొనసాగాయి. అన్నదాన, పరిపాలన విభాగంతో పాటు ప్రోవిజన్స్‌ స్టోర్స్‌లోనూ తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్‌ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేశారు. తొలుత అన్నదాన విభాగానికి వెళ్లిన అధికారులు.. ఏఈవో వెంకటరెడ్డిని రికార్డులు, బిల్లులపై ఆరా తీశారు. గత నెలలో మంజూరైన బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

గతేడాది అన్నదానం టెండర్లపై వివరాలు సేకరించినట్టు సమాచారం. సెక్యూరిటీ టెండర్లలో జరిగిన అవకతవకలపైనా విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. సస్పెన్షన్‌కు గురైన టెండర్ల విభాగం సూపరింటెండెంట్‌ రవిప్రసాద్‌  స్టేట్‌మెంట్‌నూ రికార్డు చేసినట్టు తెలిసింది. దుర్గగుడిలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లపై విధులు నిర్వహిస్తున్నారంటూ గతంలో విజిలెన్స్‌ విచారణ జరిగింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఈవో ఎంవీ సురేష్‌బాబును ప్రశ్నించినట్టు తెలిసింది. సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌కు పంపామని, ఆ వివరాలు వచ్చాక తగు చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పినట్టు తెలిసింది. 

సస్పెండ్‌ అయిన వారే విధుల్లో..
అయితే విజిలెన్స్‌ అధికారులు తనిఖీల నిమిత్తం బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న కార్యాలయానికి వెళ్లిన క్రమంలో గతంలో సస్పెండ్‌ అయిన వారిలో కొంతమంది విధులు నిర్వహిస్తూ కనిపించడంతో విస్మయానికి గురయ్యారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top