breaking news
Vigilance Officers Inquiry
-
దుర్గగుడిలో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి,విజయవాడ/ఇంద్రకీలాద్రి: దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై గత నెలలో ఏసీబీ అధికారుల తనిఖీల నేపథ్యంలో ఇప్పుడు విజిలెన్స్ అధికారులూ తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఉదయం ప్రారంభమైన తనిఖీలు రాత్రి ఏడు గంటల వరకూ కొనసాగాయి. అన్నదాన, పరిపాలన విభాగంతో పాటు ప్రోవిజన్స్ స్టోర్స్‌లోనూ తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ అధికారులు మూడు బృందాలుగా విడిపోయి విచారణ చేశారు. తొలుత అన్నదాన విభాగానికి వెళ్లిన అధికారులు.. ఏఈవో వెంకటరెడ్డిని రికార్డులు, బిల్లులపై ఆరా తీశారు. గత నెలలో మంజూరైన బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లింపులపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గతేడాది అన్నదానం టెండర్లపై వివరాలు సేకరించినట్టు సమాచారం. సెక్యూరిటీ టెండర్లలో జరిగిన అవకతవకలపైనా విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. సస్పెన్షన్‌కు గురైన టెండర్ల విభాగం సూపరింటెండెంట్ రవిప్రసాద్ స్టేట్‌మెంట్‌నూ రికార్డు చేసినట్టు తెలిసింది. దుర్గగుడిలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లపై విధులు నిర్వహిస్తున్నారంటూ గతంలో విజిలెన్స్ విచారణ జరిగింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఈవో ఎంవీ సురేష్‌బాబును ప్రశ్నించినట్టు తెలిసింది. సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌కు పంపామని, ఆ వివరాలు వచ్చాక తగు చర్యలు తీసుకుంటామని ఈవో చెప్పినట్టు తెలిసింది. సస్పెండ్ అయిన వారే విధుల్లో.. అయితే విజిలెన్స్ అధికారులు తనిఖీల నిమిత్తం బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు వద్ద ఉన్న కార్యాలయానికి వెళ్లిన క్రమంలో గతంలో సస్పెండ్ అయిన వారిలో కొంతమంది విధులు నిర్వహిస్తూ కనిపించడంతో విస్మయానికి గురయ్యారు. -
డీసీసీబీపై ముప్పేట దాడి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో జరిగిన అడ్డగోలు వ్యవహారాలపై హైదరాబాద్ నుంచి వచ్చిన ఆప్కాబ్, నాబార్డు అధికారులు విచారణ జరిపారు. వీరితో పాటు సమాంతరంగా విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేసినట్టు తెలిసింది. వారికి అందిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు కూడా నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆ నివేదికను నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. బీసీసీబీపై ఆప్కాబ్, నాబార్డుకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లడంతో దాని ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హోదా లో పనిచేస్తున్న ఇద్దరు ఆప్కాబ్ అధికారులు, నాబార్డు నుంచి ఒక ప్రతినిధి సంయుక్తంగా ఇక్కడికొచ్చి విచారణ చేశారు. దీంతో పలు అడ్డగోలు వ్యవహారాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా డీసీసీబీ సీఈఓపైనే విచారణలో ఎక్కువగా దృష్టి సారించినట్టు తెలిసింది. ఆయనపైనే ఆరోపణలు ఉన్నట్టు భోగట్టా. ఈ మేరకు నివేదిక తయారు చేసి, బాధ్యులైన వారిపై చర్యలకు సిఫారసు చేసినట్టు సమాచా రం. విచారణ, అందులో తేలిన విషయాలు బయటికి పొక్కనివ్వకుండా డీసీసీబీ అధికారు లు జాగ్రత్త పడ్డారు. ఏ ఒక్కరూ నోరు మెదపకుండా గట్టి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. నివేదిక తొక్కిపెట్టేందుకు యత్నాలు విచారణ నివేదికను తొక్కి పెట్టేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. జిల్లాకు చెందిన ఒక మంత్రి జోక్యం చేసుకుని, రాజధాని స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఇదే విషయమై ఓ ఆప్కాబ్ అధికారిని ‘సాక్షి’ వివరణ కోరగా విచారణ జరగడం వాస్తవమేనన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు విచారణ చేసి, నివేదిక సంబంధిత ఉన్నతాధికారులకు ఇప్పటికే అందజేశారని చెప్పారు.