venkayya peta unanimous panchayat poll every time - Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు ఆ ఊరు దూరం

Feb 4 2021 7:56 AM | Updated on Feb 4 2021 12:56 PM

Venkayya Peta Opts Unanimous Panchayat Poll Every Time - Sakshi

సమస్యలు పరిష్కరించే వేదిక ఈ మందిరమే

అదో వసుధైక కుటుంబం. అర్ధ శతాబ్ద కాలంగా ఆపకుండా చైతన్య కాగడాలు వెలిగిస్తోంది. గ్రామ రాజకీయాలను నిప్పులతో కడుగుతూ స్వచ్ఛంగా ఉంచింది. రెండు వందల పైచిలుకు గడపలకు నాయకత్వాన్ని ఆస్తిగా పంచింది. పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలతో పని లేకుండా ప్రజాస్వామ్యాన్ని బతికిస్తోంది. తొమ్మిది వందల పైచిలుకు సభ్యులున్న ఆ ఉమ్మడి కుటుంబం పేరు వెంకయ్యపేట. పల్లె ఐకమత్యంగా ఉంటే ఏం సాధించగలదో చెప్పడానికి ఈ ఊరే ఉదాహరణ. సమస్యలుంటే అందరూ కలిసి గుడి వద్ద కూర్చుని పరిష్కరించుకుంటారు. డబ్బులొస్తే ఊరినెలా బాగు చేయాలా అని ఆలోచిస్తారు. ఇంత అందమైన మనుషులున్న ఆ ఊరి గురించి..

సాక్షి, జి.సిగడాం(శ్రీకాకుళం): మండలంలోని వెంకయ్య పేట పంచాయతీ ఎన్నికలకు ఎప్పటి నుంచో దూరంగా ఉంటోంది. ఇక్కడ ఎప్పుడూ ఏకగ్రీవమే. గ్రామంలో సుమారు 900 వరకు జనాభా ఉన్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులతో పాటు వివిధ రకాల పట్టభద్రులు ఈ గ్రామ కీర్తిని నలుదిశలా పెంచుతున్నారు. రాజకీయ రంగంలో మాత్రం ఈ గ్రామానిది ఓ ప్రత్యేక శైలి. పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ గ్రామంలో పంచాయతీ ఎన్నికలే జరగలేదు. పారీ్టలు ఏమైనా ఇక్కడ వర్గపోరు ఉండదు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా సంఘటితంగా ఉంటూ గ్రామ నేతను ఎన్నుకోవడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది.

ఊరిలో ఏమైనా స్వల్ప వివాదాలు తలెత్తితే గ్రామ పెద్దల సమక్షంలోనే అవి పరిష్కారానికి నోచుకుంటాయి. పోలీసు స్టేషన్‌లో గానీ, కోర్టులలో గానీ ఈ గ్రామానికి సంబంధించిన కేసులు మచ్చుకైనా కనిపించవు. పంచాయతీ సర్పంచ్‌గా ఎవరు ఎన్నికైనా గ్రామాభివృద్ధికి పాటుపడుతూ గ్రామానికి సరికొత్త రూపును సింగారించుకునేలా కృషి చేస్తుంటారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ గ్రామం ఇందిరమ్మ ఆదర్శ పంచాయతీగా ఎంపికైంది. అప్పటి నుంచి ఆ గ్రామ స్వరూపం మారింది. 200 పక్కా గృహాలు, 210 పింఛన్లతో పాటుగా పలు సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి. 

ఆవిర్భావం నుంచి నేటి వరకు..
పంచాయతీరాజ్‌ వ్యవస్థ ప్రారంభం నుంచి నేటి వరకు గ్రామ సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటి నుంచి ఆ రేళ్ల నారాయణప్పడు ఐదు సార్లు, బత్తుల లక్ష్మణరావు, శ్రవణం ఈశ్వరమ్మ, శ్రవణం పోలీసు, మావిడి శ్రీనివాసరావు, 2013లో మర్రిబందల లక్ష్మి (ఎస్సీ) ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా వరుసగా ఎన్నికయ్యారు.

అందరి సహకారంతో..
పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు నుంచి మా గ్రామంలో సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతోంది. నేటి వరకు పంచాయతీ ఎన్నికలకు ఓటింగ్‌ తెలీదు. 2009లో జిల్లాలోనే ఉత్తమ పంచాయతీగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను అందించింది. దీంతో ప్రతి వీధిలో సిమ్మెంటు రోడ్డు వేసుకున్నాం.     
 – మావిడి శ్రీను, మాజీ సర్పంచ్‌

ఐకమత్యంతో ఎన్నుకుంటాం 
గ్రామంలో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ఒకే వేదికపై కలుసుకుని గ్రామ సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామంలోని రిజర్వేషన్ల ప్రకారమే వ్యక్తులను ఎంపిక చేసుకుంటాం. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం. 
– డి.అమ్మారావు, రిటైర్డ్‌ ఉద్యోగి 

పెద్దలను గౌరవిస్తాం 
గ్రామంలో ఉన్న పెద్దలందరినీ గౌరవిస్తాం. ఎలాంటి వివాదాలకు వెళ్లం. ఏమైనా సమస్యలుంటే రామాలయం వద్దే పరిష్కరించుకుంటాం. రానున్న ఎన్నికల్లో ఏకగ్రీవంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం.
– ఎ.గొల్లాజీ, గ్రామస్తుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement