సీఎం జగన్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు

Union Minister Arjun Muda praises AP CM YS Jagan - Sakshi

రాష్ట్రంలో అమలవుతున్న పథకాల పరిశీలనకు త్వరలో 

పర్యటిస్తానన్న కేంద్రమంత్రి అర్జున్‌ ముండా  

కేంద్ర మంత్రిని కలిశాక వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు

సాక్షి, న్యూఢిల్లీ: గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా మెచ్చుకున్నారు. గిరిజనులపై సీఎం వైఎస్‌ జగన్‌కి ఉన్న నిబద్ధత, చిత్తశుద్ధిని ఆయన కొనియాడారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కుంభా రవిబాబు శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఏపీ ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించేందుకు పార్లమెంట్‌ సమావేశాల తర్వాత ఏపీకి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించగా.. త్వరలోనే రాష్ట్రానికి వస్తానని కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా చెప్పారని రవిబాబు మీడియాతో చెప్పారు.

ఏపీలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయాన్ని, గిరిజన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, గిరిజన ఆరోగ్యం, విద్య, నిరుద్యోగ నిర్మూలన వంటి కార్యక్రమాలను రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4,31,420 ఎకరాల ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలను పంపిణీ చేసిందని, గిరిజన ఉప ప్రణాళిక కింద 2020–21కి రూ.5,177 కోట్లు కేటాయించిందని, విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల, పాడేరులో వైఎస్సార్‌ గిరిజన వైద్య కళాశాల, ప్రతి ఐటీడీఏ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి తదితర సంస్థలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర మంత్రి వివరించినట్టు తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టులో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ, పునరావాస చర్యలనూ కేంద్ర మంత్రికి వివరించినట్లు రవిబాబు వెల్లడించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top