2 years YSJagan ane nenu: మానవీయ కోణంలో అభివృద్ధి అడుగులు | Sakshi
Sakshi News home page

2 years YSJagan ane nenu: మానవీయ కోణంలో అభివృద్ధి అడుగులు

Published Fri, May 28 2021 4:06 PM

Two Years Of YS Jagan Rule In AP: Development  - Sakshi

వెబ్‌డెస్క్‌: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రెండేళ్ల పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఓ వైపు భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. దావోస్‌, సింగపూర్‌ పర్యటనలు చేయకుండా... ఏపీలో ఉంటూనే భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. రాష్ట్ర యువతకు స్థానికంగా ఉపాధి లభించేలా మౌలిక రంగాల్లో కీలక మార్పులు చేపడుతున్నారు. 

అభివృద్ధికి అసలైన నిర్వచనం
అభివృద్ధికి అసలు సిసలైన నిర్వచనం ఇస్తోంది ఏపీ ప్రభుత్వం. నిన్నటి కంటే ఈరోజు బాగుండి, ఈ రోజు కంటే రేపు బాగుంటుందని సామాన్యుడు ఎప్పుడు భావిస్తాడో అదే అసలైన అభివృద్ధి అంటోంది. అంతకుముందున్న ప్రభుత్వం అభివృద్ధి అంటే భవంతులు, ఫ్లై ఓవర్లు, హైటెక్‌​ హంగులు అంటూ కలరింగ్‌ ఇస్తే.. అభివృద్ధికి మానవీయ కోణం జోడించి ముందుకు సాగుతోంది. సామాన్యులకు తమ బతుకుపై భరోసా కల్పించడమే అసలైన అభివృద్ధి అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 

పెట్టుబడుల వరద
ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఏపీకి రికార్డు స్థాయిలో రూ 6,234 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా కనీసం 39,578 మందికి ఉపాధి లభించనుంది. ఇవి కాకుండా రూ 31,668 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 117 కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ పెట్టుబడులు కూడా వస్తే ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లోకి 4,383 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్‌లో రూ. 2,000 కోట్లు, ఐటీలో రూ. 250 కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. 


వలసలు ఆపేయాలని
దేశంలోనే అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న రెండో రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పటికీ.... ఉపాధి కోసం ఇక్కడి మత్స్యకారులు గుజరాత్‌ వలస వెళ్లే దుస్థితి నెలకొంది. అలా వెళ్లిన వారు సముద్ర జలాల్లో సరిహద్దులు దాటి పాకిస్తాన్‌ నేవీకి చిక్కి ఎన్నో కష్టాలు పడేవారు. గతంలో ఏ ప్రభుత్వం వీరి బాగోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ మత్స్యకారుల సమస్యను పరిష్కరించేందుకు, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీర ప్రాంత అభివృద్ధిపై స్పెషల్‌ యాక‌్షన్‌ ప్లాన్‌ని సీఎం జగన్‌ సిద్ధం చేశారు. దీని ప్రకారం రూ. 1510 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నెలలో ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.

వీటికి తోడు రూ. 1,360 కోట్ల రూపాయల వ్యయంతో మరో నాలుగు షిప్పింగ్‌ హార్బర్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. అంతేకాదు వందకు పైగా అక్వాహబ్‌లు వాటికి అనుబంధంగా 120 రిటైల్‌షాపులు ఏర్పాటు చేయనున్నారు. కేవలం మౌలిక సదుపాయలు, మార్కెటింగ్‌లో మార్పులు చేస్తే సరిపోదని భావించిన ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నంలో ఫిషరీస్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధం అవుతోంది.

Advertisement
Advertisement