ఈసీ డబుల్‌ గేమ్‌! | Twist In Andhra Pradesh Postal Ballot Counting Row, More Details Inside | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌.. ఈసీ డబుల్‌ గేమ్‌!

Published Thu, May 30 2024 4:23 PM

Twist In Andhra Pradesh Postal Ballot Counting Row

ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌.. ఈసీ డబుల్‌ గేమ్‌!

ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా ఇచ్చిన జారీ చేసి మెమో వెనక్కి

అంతకు ముందు.. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందన్న సీఈసీ

దేశంలో ఒకలా..  ఏపీలో మరోలా రూల్స్‌ను మార్చి మెమో ఇచ్చిన సీఈవో ఎంకే మీనా

వైఎస్సార్‌సీపీ అభ్యం‍తరాలు.. ఏపీ హైకోర్టులో పిటిషన్‌

ఒకవైపు ఏపీ సీఈవోకి అనుకూలంగా వివరణ ఇస్తూ.. మరోవైపు కోర్టు విచారణ టైంలో వివాదాస్పద మెమోను వెనక్కి తీసుకున్న సీఈసీ

విచారణ రేపటికి(మే 31 శుక్రవారం) వాయిదా

జూన్‌ 4న పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు విధానంపై రావాల్సిన స్పష్టత

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ఎన్నికల సంఘం డబుల్‌ గేమ్‌ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు గురువారం  తెలిపింది. ఈ మెమోలపై వైఎస్సార్‌సీపీ కోర్టుల్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌ విచారణలో ఉండగానే.. ఆ మెమోను ఎన్నికల సంఘం వెనక్కి తీసుకోవడం గమనార్హం. 

పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం చేసి, స్టాంప్‌ లేకపోయినా.. తన పేరు, డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాస్తే ఆమోదించాలని గతేడాది(2023) జూలై 19న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే మార్గదర్శకాలు అమలవుతున్నాయి. కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా జారీ చేసిన ఉత్తర్వులే రాజకీయ దుమారం రేపాయి.

ఏపీ సీఈవో ఇచ్చిన మెమో సారాంశం..
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు విషయంలో ఆర్‌ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దు. నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) నిర్దేశించిన అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు (స్పెసిమెన్‌) సేకరించి.. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆర్వోలకు పంపాలి. డిజిగ్నేషన్‌ పూర్తి వివరాలను చేతితో రాయకపోయినా సరే.. అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం ఉంటే చాలు!. ఆ సంతకంపై ఏమైనా అనుమానం వస్తే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ (ఆర్వో), జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉన్న సంబంధిత అటెస్టింగ్‌ అధికారి సంతకం (స్పెసిమెన్‌)తో సరిపోల్చుకుని పోస్టల్‌ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలి.

వైఎస్సార్‌సీపీ అభ్యంతరాలు ఏంటంటే..
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా ఈనెల 25న ఓ మెమో, 27న మరో మెమో జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఆర్‌ఓ సీల్ లేకున్నా ఓటును తిరస్కరించ వద్దంటూ వాటిల్లో పేర్కొన్నారాయన. అయితే ఈ మెమో పై వైఎఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త రూల్స్ ఇచ్చారని పేర్కొంది. దీనివల్ల కౌంటింగ్ సమయంలో ఘర్షణలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు అత్యవసరంగా విచారణ చేపట్టింది కూడా.

డబుల్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
ఈలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరారు. దీంతో సీఈసీ ఇవాళ స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై స్పష్టతనిచ్చారు. డిక్లరేషన్ పై సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు చేయాలని ఆదేశించింది. 

పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికలసంఘానికి ఏం చెప్పిందంటే.. ఫాం 13ఏపై అటెస్టేషన్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. అలాంటి ఓట్లను చెల్లుబాటు అయ్యేవిగా రిటర్నింగ్‌ అధికారులు గుర్తించాలి. ఆర్వో ధ్రువీకరణ తర్వాతే కదా అటెస్టేషన్‌ అధికారి ఫాం 13ఏపై సంతకం చేస్తారు. 

అయితే ఈ లోపు కేంద్ర ఎన్నికల సంఘం మరో ట్విస్ట్‌ ఇచ్చింది. ఏపీ సీఈవో ఇచ్చిన మెమోను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈసీ డబుల్‌ గేమ్‌తో.. జూన్‌ 4వ తేదీన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ఎలా జగరనుందా? అనే ఆసక్తి నెలకొంది. అయితే వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై కోర్టు విచారణ రేపటికి వాయిదా పడింది. కోర్టు గనుక తీర్పు ఇస్తే.. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

‘‘పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) 25న ఇచ్చిన మెమోలో కొంత భాగాన్ని ఉపసంహరించుకుంటున్నాం. 27వ తేదీనాటి మెమోను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం’’
:::ఏపీ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం 

సీఈసీని సైతం కలిసినా..
అటెస్టింగ్‌ అధికారుల స్పెసిమెన్‌ సం­తకాల సేకరణ గతేడాది జూలై 19న కేంద్ర ఎన్ని­కల సంఘం జారీచేసిన నిబంధనలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ అంటోంది. ఇది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో ఓట్ల తిరస్కరణకు కారణమవుతుందని.. పైగా తీవ్ర వివాదాలకు సైతం దారితీసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ఎస్‌. నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఒకలా.. రాష్ట్రంలో మరోలా ఉండేలా నిబంధనలను సడలిస్తూ ఏపీ సీఈవో మీనా  జారీచేసిన ఉత్తర్వులను తక్షణం సమీక్షించి.. సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఏపీ సీఈవోకు అనుకూలంగా సీఈసీ వ్యవహరిస్తూనే.. మరోవైపు ఆ వివాదాస్పద జీవో వెనక్కి తీసుకోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
 
Advertisement