శ్రీవారి ఆలయంలో ఆధునిక టెక్నాలజీతో ‘బూందీ పోటు’ 

TTD Temple Using New Technology For Boondi Making For Laddu At Tirupati - Sakshi

తిరుమల: తిరుమలలోని లడ్డూ ప్రసాదాల బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటోంది. థర్మోఫ్లూయిడ్‌ స్టవ్‌ల ఏర్పాటు ద్వారా నిప్పు లేకుండానే నెయ్యిని కరిగించి లడ్డూలు తయారు చేస్తోంది. మామూలు రోజుల్లో తిరుమలలో మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూలను శ్రీవారి పోటులో తయారు చేస్తారు. 2007లో బూందీ పోటును ఆలయం వెలుపలకు తరలించారు. అక్కడ బూందీ తయారు చేసి, అనంతరం దానిని ఆలయంలోకి తీసుకెళ్లి లడ్డూలు తయారు చేస్తున్నారు.

అదే సమయంలో పోటులోని నెయ్యి స్టవ్‌లను వేడిచేసేప్పుడు ఆవిరి కారణంగా చిమ్నీలో ఏర్పడిన తేటకు మంటలంటుకుని తరచూ అగ్ని ప్రమాదాలు జరిగేవి. టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డి బాధ్యతలు చేపట్టాక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన పోటును ఏర్పాటు చేశారు. చెన్నైలోని అడయార్‌ ఆనందభవన్‌ ఏర్పాటు చేసిన థర్మోఫ్లూయిడ్‌ స్టవ్‌లను గుర్తించారు. ఇక్కడ కూడా ప్రయోగాత్మకంగా రెండు స్టవ్‌లను ఏర్పాటు చేసి, పరిశీలించి ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు, ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌ రూ.15 కోట్లు ఇచ్చారు.  

ఎలా పనిచేస్తాయంటే.. 
తిరుమల పోటులో మొదటి దశలో 40 థర్మో స్టవ్‌లను ఏర్పాటుచేశారు. నెయ్యి తెట్టు, ఆవిర్లు అంటుకోకుండా ఎత్తయిన అత్యాధునిక భవనంలో చిమ్నీలను ఏర్పాటు చేసి.. గోడలకు స్టీల్‌ పలకలను అమర్చారు. వీటివల్ల ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునే వీలు కలిగింది. దశల వారీగా 20 స్టవ్‌ల చొప్పున పెంచుకుంటూ వెళతారు. ఎక్కడా అగ్గితో పనిలేకుండా ఈ స్టవ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక బిల్డింగ్‌లో థర్మోఫ్లూయిడ్‌ ట్యాంకును నిర్మించి అందులో ప్లూయిడ్‌ను నింపుతారు. దానిని బాయిలర్‌ ద్వారా వేడి చేస్తారు. అలా వేడెక్కిన ప్లూయిడ్‌ను ఉష్ట వాహక విధానంలో పైపుల ద్వారా స్టవ్‌లకు పంపుతారు. వాటిల్లో నింపిన నెయ్యిని పైపు నుంచి వచి్చన ఫ్లూయిడ్‌ వేడి చేస్తుంది. పైపుల్లో ఈ వేడి ఫ్లూయిడ్‌ నిరంతరం వచ్చి వెళుతుండటంతో నెయ్యి పూర్తి స్థాయిలో కరిగిపోతుంది. దీంతో బూందీని తయారు చేస్తారు. ఈ ఆధునిక బూందీ పోటును త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

అగ్ని ప్రమాదాల నివారణ 
పోటులో అగ్ని ప్రమాదాలు నివారించేలా ఆధునిక టెక్నాలజీతో థర్మోఫ్లూయిడ్‌ స్టవ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. ప్లూయిడ్‌ టెక్నాలజీ వినియోగంతో పూర్తి స్థాయిలో అగ్ని ప్రమాదాల నివారణ సాధ్యమవుతోంది.  
– ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈవో

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top