
పురుగు మందు బాటిళ్లతో రాస్తారోకో చేస్తున్న పొగాకు రైతులు
పొగాకు కొనుగోలు చేయాలంటూ ధర్నా
పురుగు మందు బాటిళ్లతో హైవేపై రాస్తారోకో
యర్రగొండపాలెం: పొగాకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్‌కుంట వద్ద ఉన్న జీపీఐ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. పురుగు మందు బాటిళ్లు చేతపట్టుకొని జాతీయ రహదారిపై బైఠాయించారు. పుల్లలచెరువు మండలంలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన పొగాకు రైతులు కుంట వద్దకు చేరుకుని.. పొగాకు కొనుగోలు చేసే జీపీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
తమ కంపెనీతో ఒప్పందం చేసుకున్న రైతుల పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తామని, ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతుల నుంచి కొనేది లేదని జీపీఐ కంపెనీ సిబ్బంది రైతులకు తెలిపారు. పండించిన పంటలో కొంత భాగమే డెక్కన్ కంపెనీ కొనుగోలు చేసి మొహం చాటేసిందని రైతులు ఆరోపించారు. అప్పులు చేసి అధిక పెట్టుబడులు పెట్టి పొగాకు పండించామని, పంట చేతికి వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేస్తే చేసిన అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలని వారు ప్రశి్నంచారు.
పొగాకు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని పురుగుల మందు బాటిళ్లతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.దీంతో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి. డెక్కన్ కంపెనీతో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తమ వద్ద ఉన్న పొగాకు బేళ్లను వెంటనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.