breaking news
Tobacco .. farmers
-
రోడ్డెక్కిన పొగాకు రైతులు
యర్రగొండపాలెం: పొగాకు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్కుంట వద్ద ఉన్న జీపీఐ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. పురుగు మందు బాటిళ్లు చేతపట్టుకొని జాతీయ రహదారిపై బైఠాయించారు. పుల్లలచెరువు మండలంలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన పొగాకు రైతులు కుంట వద్దకు చేరుకుని.. పొగాకు కొనుగోలు చేసే జీపీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.తమ కంపెనీతో ఒప్పందం చేసుకున్న రైతుల పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తామని, ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతుల నుంచి కొనేది లేదని జీపీఐ కంపెనీ సిబ్బంది రైతులకు తెలిపారు. పండించిన పంటలో కొంత భాగమే డెక్కన్ కంపెనీ కొనుగోలు చేసి మొహం చాటేసిందని రైతులు ఆరోపించారు. అప్పులు చేసి అధిక పెట్టుబడులు పెట్టి పొగాకు పండించామని, పంట చేతికి వచ్చిన తరువాత కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేస్తే చేసిన అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలని వారు ప్రశి్నంచారు.పొగాకు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని పురుగుల మందు బాటిళ్లతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.దీంతో కొంతసేపు రాకపోకలు స్తంభించాయి. డెక్కన్ కంపెనీతో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తమ వద్ద ఉన్న పొగాకు బేళ్లను వెంటనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. -
గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్న పొగాకు రైతులు
కొండపి, న్యూస్‌లైన్: పొగాకు..రైతుల పాలిట పగాకుగా మారింది. ఏటా ఏదో ఒక విధంగా పొగాకు రైతులు నష్టాలు మూటగట్టుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అల్లాడుతున్నారు. కష్టించి పండించిన పంటను ఏదో ఒక రేటుకు వ్యాపారులకు విక్రయించి నిట్టూర్పు విడుస్తున్నారు. కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి మండలాల్లోని 41 గ్రామాలకు చెందిన రైతులు 2,140 బ్యారన్ల పరిధిలో 9.06 మిలియన్ కేజీల పొగాకుకు అనుమతివ్వగా 12.9 మిలియన్ కేజీలు పండించారు. ఒక్కో బ్యారన్‌కు 5 లక్షలకుపైగా ఖర్చు చేశారు. ప్రకృతి అనుకూలించి గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలో 90 శాతం బ్రైట్ ఎఫ్-1 రకం పొగాకు దిగుబడి వచ్చింది. క్యూరింగ్ చేసుకుని బేళ్లు కట్టుకున్నారు. వేలం ప్రారంభమైంది. కేజీకి 130 ఇస్తే రైతులకు గిట్టుబాటవుతుందని, ఈ రేటు ఇవ్వాలని రైతులు, రైతు నాయకులు బోర్డు అధికారుల సమక్షంలో వ్యాపారులను కోరారు. వేలం ప్రారంభమైన రెండు వారాల పాటు వచ్చిన పొగాకు బేళ్లలో ఎక్కువ శాతం కేజీ 126 కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రమేపీ మార్కెట్ పెరుగుతుందని అధికారులు చెబుతూ వచ్చారు. కానీ రోజులు గడిచేకొద్దీ మార్కెట్ పెరగలేదు సరికదా..మరింత తగ్గిపోతోంది. పది రోజులుగా 90 శాతం పొగాకు బేళ్లను కేజీ 116లకే కొంటున్నారు. వేలం కేంద్రం ప్రారంభించిన 36 రోజుల్లో కేజీకి 10 ధరను దిగకోశారు. మార్కెట్లో పోటీతత్వం లేకపోవడంతో గుత్తాధిపత్యం వహిస్తున్న ఐటీసీ ప్రారంభంలో 65 శాతం పొగాకు కొనుగోలు చేయగా..ప్రస్తుతం తన వాటాను 35 శాతానికి కుదించుకుంది. అదేమని రైతులు అడిగితే పొగాకులో దమ్ములేదని, తెల్లని పొగాకు తాము కొనలేమని ఐటీసీ వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారుల కుట్రే.. గతంలో పండిన పొగాకు రంగు లేదని..రంగు ఉన్న పొగాకును బాగా కొంటామని చెప్పుకుంటూ వచ్చిన వ్యాపారులు ఈ సంవత్సరం పొగాకు పంట మంచి రంగు రావడంతో చివరకు ఏదోక విధంగా వంకపెట్టి తక్కువ ధరకు దక్కించుకునేందుకు కుట్రపన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 కంపెనీలు పొగాకు కొనుగోలుకు రిజిస్ట్రేషన్ చేసుకోగా 13 కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. అందులో చాలా మంది వ్యాపారులు రోజుకు పట్టుమని పదిబేళ్లు సైతం కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. అదేమని అడిగే నాథుడే లేడు. వ్యాపారుల మాయాజాలంతో రైతులు ఈ ఏడాది కూడా పగాకు నష్టాలపాలయ్యేందుకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. అటు రైతు ప్రతినిధులు గానీ ప్రభుత్వం గానీ పొగాకు ధరల విషయం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. రైతులు సంఘటితంగా వ్యాపారులను ఎదుర్కొనే శక్తిలేక వారు కొన్న ధరలకే అమ్ముకొని బయటకు వస్తున్నారు. మరో పక్క అప్పులు సైతం రైతులను వేధిస్తున్నాయి. ఇప్పటికైనా పొగాకు బోర్డు స్పందించి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరీఘోరం చల్లా మధు, రైతు, నెన్నూరుపాడు మంచి రంగులు వచ్చిన పొగాకును సైతం తక్కువ రేట్లకే వ్యాపారులు కొంటున్నారు. అడిగేవారు లేరు. రాజన్న పాలనలో గిట్టుబాటు ధర దక్కింది. వ్యాపారులు సైతం ప్రభుత్వ ఒత్తిడితో కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చైర్మన్ చొరవ తీసుకోవాలి బొడ్డపాటి బ్రహ్మయ్య, చోడవరం, గ్రోయెర్స్ అసోసియేషన్ మెంబర్ బోర్డు చైర్మన్ చొరవ తీసుకుని వ్యాపారుల చేత ఇండెంట్ ప్రకారం కొనుగోలు చేయించాలి. చాలా మంది వ్యాపారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారే తప్ప పొగాకు కొనుగోలు చేయడం లేదు. దీని వలన వ్యాపారుల్లో పోటీతత్వం తగ్గిపోయి రైతు నష్టపోతున్నాడు. ఎక్కువ బేళ్లు నోబిడ్లు చేస్తున్నారు మేకల శేషారెడ్డి, రైతు, గుర్రపడియ తెచ్చిన పొగాకు బేళ్లలో సగం నోబిడ్లే అవుతున్నాయి. అదేమంటే పొగాాకు తెల్లగా ఉందని మరోసారి బేళ్లు తిరగకట్టుకుని తెచ్చుకోమంటున్నారు. ఒకసారి వెనక్కు తీసుకెళ్లి మళ్లీ తీసుకొస్తే బేలుకు 10 కేజీల పొగాకు కాటా తగ్గిపోతుంది. చెక్కుకు *1200 నష్టం వస్తుంది. వ్యాపారులు దగా చేస్తున్నారు యం మాలకొండారెడ్డి, రైతు, గుర్రపడియ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దగా చేస్తున్నారు. మార్కెట్‌ను పెరగనీయకుండా చేసి తక్కువ ధరలకే పొగాకు కొనుగోలు చేస్తున్నారు. బోర్డు అధికారులు సైతం మిన్నకుండి పోతున్నారు. రంగు పొగాకు కావాలన్న వ్యాపారులుకు కుంటిసాకు దొరక్క తెల్లగా ఉందని నాటకాలు ఆడుతున్నారు.