
తిరుపతిలో తెల్లవారుజామున మద్యం సేవిస్తూ కనిపించిన వ్యక్తితో మాట్లాడుతున్న భూమన అభినయ్‌రెడ్డి
తిరుపతిలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
నగరంలో ఎక్కడ చూసినా 24 గంటలూ మద్యం విక్రయాలే
విచ్చలవిడి విక్రయాలతో రోడ్ల పాలవుతున్న పేద కుటుంబాలు
నగరంలో మద్యం విక్రయాలు ఏవిధంగా జరుగుతున్నాయో పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డి
రైల్వేస్టేషన్ పక్కన ఉదయం 5 గంటలకే మద్యం విక్రయిస్తుండటాన్ని చూసి మండిపాటు
ఆ దుకాణంలోనే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి.. అక్కడే పగలగొట్టి నిరసన
తిరుపతి మంగళం: తిరుపతి పేరు చెప్పగానే.. ఆధ్యాత్మిక సౌరభాలే గుర్తొస్తాయి. భక్తుల గోవింద నామాలు చెవుల్లో మార్మోగుతాయి. నుదిటిన మూడు నామాలు ధరించి.. వేయి నామాల వాడిని కొలిచే భక్తులే అన్ని మూలలా కనిపిస్తారు. ఇదంతా ఏడాది క్రితం మాట. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు తిరుపతిలో ఏ మూలకు వెళ్లినా అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం షాపులు, బార్లన్నీ బార్లా తెరిచే ఉంటున్నాయి. వాటిలోంచి తూలుతూ.. తుళ్లుతూ.. పడుతూ.. లేస్తూ వచ్చేవారే కనిపిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి లీలామహల్ వద్ద బడి వైన్స్‌లో అర్ధరాత్రి 12.04 గంటలకు మద్యం విక్రయాలు దర్జాగా సాగిపోగా.. మందుబాబుల సందడి చేయడం కనిపించింది. ఐఎస్ మహల్ సమీపంలో హారిక బార్‌లో అర్ధరాత్రి 12.19 గంటలకు సైతం మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.
అర్ధరాత్రి 1.11 గంటలకు డీబీఆర్ రోడ్డులోని బడి వైన్స్‌లో అక్కడి సిబ్బంది యథేచ్ఛగా మద్యం అమ్ముతూ కనిపించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో నైన్ స్టార్ మద్యం షాపు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు సైతం తెరిచి ఉండగా.. అక్కడ దర్జాగా మద్యం సేవిస్తున్న వారే కంటపడ్డారు. ఉదయం 5.14 ఎమ్మార్ పల్లి వైకుంఠపురంలో విక్టరీ వైన్స్‌లో జంకు లేకుండా మద్యం విక్రయాలు చేస్తుండగా.. డీఆర్ మహల్ రోడ్డులోని టీవీఎస్ షోరూం ఎదురుగా గల çహరి వైన్స్లోను.. ఉదయం 5.37 గంటలకు కేకే మద్యం షాపులో మందుబాబులు తాపీగా మద్యం తాగుతూ కనిపించారు. ఉదయం 6 గంటలకు గ్రూప్ థియేటర్స్ సమీపంలోని ఎస్వీ బార్, 6.03 గంటలకు దేవేంద్ర థియేటర్ రోడ్డులోని విక్టరీ వైన్స్, 6.09 గంటలకు జయశ్యాం థియేటర్ రోడ్డులోని మద్యం దుకాణం, ఉదయం 6.13 గంటలకు జీవకోనలోని రాజీవ్‌గాంధీ కాలనీలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి.
మద్యానికి చిరునామాగా..
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నిద్ర లేవగానే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ఇక్కడి ప్రజలు మొక్కుతుంటారు. ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం లక్షలాది మంది భక్తులు తిరుపతి విచ్చేస్తుంటారు. అంతటి విశిష్టత కలిగిన నగరాన్ని కాస్తా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మద్యానికి చిరునామాగా మార్చేశారు. శ్రీవేంకటేశ్వరస్వామి నామస్మరణలతో మార్మోగాల్సిన ఆధ్యాత్మిక నగరం మందుబాబుల ఆగడాలు, రచ్చలతో దద్దరిల్లుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పవిత్ర క్షేత్రంలో 24 గంటలూ మద్యం విక్రయిస్తూ ఏరులై పారిస్తున్నారు.
తిరుపతి నగర ప్రజలతో పాటు శ్రీవారి భక్తులకు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్కపోవచ్చు కానీ.. చంద్రబాబు పుణ్యమా అని మద్యం మాత్రం నిత్యం దొరుకుతోంది. కూటమి పాలనతో మద్యం దుకాణాల్లో రేయింబవళ్లు మద్యం విక్రయాలు సాగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి, పార్టీ నాయకులు శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ తిరుపతి నగరంలో పర్యటన జరిపారు. ఏ మూలకు వెళ్లినా మద్యం షాపులు, బార్లలో మద్యం విక్రయాలు జరుపుతుండటాన్ని గమనించారు.
మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసన
ఆదివారం ఉదయం 5 గంటల నుంచే తిరుపతి రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న నైన్ స్టార్ లిక్కర్ షాపులో మద్యం విక్రయిస్తుండగా.. మహిళలు, పార్టీ శ్రేణులతో కలిసి ఆ షాపును భూమన అభినయ్‌రెడ్డి పరిశీలించారు. ఆ సమయంలో స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం ఆ షాపులో మద్యం సేవిస్తూ కనిపించగా.. ఎవరు మీరు అని అభినయ్ ప్రశ్నించారు. కొంతమంది హైదారాబాద్, కర్నూలు, వరంగల్ ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పారు. ‘శ్రీవారి మొక్కు కన్నా చంద్రన్న చుక్కే మీకు ముందుగా అందిస్తున్నారా?’ అని అభినయ్ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న నైన్ స్టార్ షాపులో పార్టీ శ్రేణులతో కలిసి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి అక్కడే పగులగొట్టి నిరసన తెలిపారు.
కూటమి పాలనలో విచ్చలవిడిగా మద్యం
ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తూ ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ఒక్క మద్యం దుకాణంలో కూడా నిబంధనలు పాటించడం లేదని, 24 గంటలూ మద్యం విక్రయిస్తున్నా ఎక్సైజ్, పోలీసు అధికారులు మద్యం దుకాణదారులకు కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక శోభను పెంపొందించాల్సింది పోయి మద్యాన్ని పొంగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఎక్కడ చూసినా మద్యం మత్తులో ప్రజలు తూలుతున్నారన్నారు. కూలీనాలి చేయగా వచ్చిన కాస్త డబ్బులను మద్యానికే తగలేస్తున్నారని, దాంతో పేద కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విచ్చలవిడి మద్యం అమ్మకాలపై ఎవరైనా ఎక్సైజ్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారి ఫోన్ నంబర్లను మద్యం దుకాణదారులకు ఇస్తున్నారన్నారు. దాంతో మద్యం దుకాణదారులు ఫిర్యాదు చేసిన వారి ఇంటిపైకి వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు.. ఆ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్‌సీపీ పాలనలో లిక్కర్ స్కామ్‌లు అంటూ అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నారని అభినయ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోన్‌రెడ్డిపై కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులే తప్ప వైఎస్సార్‌సీపీ పాలనలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదని స్పష్టం చేశారు. మద్యం విక్రయాలతో దోచుకోవడం, దాచుకోవడం చంద్రబాబు నైజమన్నారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో నిబంధనల ప్రకారమే మద్యం విక్రయాలు జరిగేలా అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితమైన చర్యలు చేపట్టారన్నారు. వైఎస్ జగన్‌ను రాజకీయంగా నిర్వీర్యం చేయాలన్న కుట్రలతో ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబు అరాచకాలను గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పే రోజలు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.