ఆ అవకాశం అందరికీ రాదు.. నాకు త్వరగా వరించిందనే చెప్పాలి

Tirupati SP Parameshwar Reddy Success Story - Sakshi

మిషినరీ, ప్రభుత్వ చదువులతోనే రాణింపు 

డాక్టర్‌ కలను కాదని.. డిగ్రీతో సరిపెట్టుకొని 

కళాశాల స్ఫూర్తితో గ్రూప్స్‌ వైపు అడుగులు 

పదేళ్ల సర్వీసులోనే సీఎం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ బాధ్యతలు 

సమాజ రుగ్మతలను నయం చేస్తూ ప్రత్యేక గుర్తింపు

ఓ మారుమూల పల్లె.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. తండ్రి ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి.. తల్లి గృహిణి.. ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు. నీళ్లు లేక ఊళ్లో అప్పటికే పొలాలు పండని దైన్యం. నాన్న ముగ్గురు బిడ్డలకూ ఒక్కటే మాట పదేపదే చెప్పారు. చదువు.. చదువు.. చదువు.. ఆ ముగ్గురికీ అదే తారకమంత్రమైంది. మిషినరీ, సర్కారు బడులు, కాలేజీల్లో చదువుకున్నప్పటికీ ముగ్గురూ గ్రూప్‌–1, 2 ఉద్యోగాలు సాధించారు. ఆ ముగ్గురిలో ఓ విద్యార్థి డాక్టర్‌ అవ్వాలనుకున్నారు.. ఇంటర్‌లో బైపీసీ తీసుకున్నారు.. కానీ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్‌కి డొనేషన్‌ కట్టాలి.. అంత సొమ్ము లేకపోవడంతో ఏమీ నిరుత్సాహపడలేదు.. చక్కగా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ వైపు చూడలేదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టం ఫలించి మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌–1 పరీక్షల్లో స్టేట్‌ 8వ ర్యాంక్‌ సాధించారు. డీఎస్పీ అయ్యారు.. సర్వీస్‌లోకి వచ్చిన కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఏకంగా ముఖ్యమంత్రి చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వరకు ఎదిగారు.. ఆయనెవరో కాదు.. తిరుపతి జిల్లా ఎస్పీ పోతన్నగారి పరమేశ్వరరెడ్డి. ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఆయన మాటల్లోనే..         – సాక్షి ప్రతినిధి, తిరుపతి

మాదో చిన్న పల్లెటూరు. ఐదు వందల గడపలు మాత్రమే ఉంటాయి. నాన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌సీఐ)లో చిరుద్యోగిగా పని చేశారు. అమ్మ గృహిణి. మేం ముగ్గురు పిల్లలం. అక్క శ్రీలక్ష్మి ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) అధికారి. చెల్లి నాగజ్యోతి గ్రూప్‌–2 ఆఫీసర్‌. వ్యవసాయ నేపథ్యంలో కలిగిన మా కుటుంబంలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివిన ప్రథమ వ్యక్తి మా నాన్నే. సాగునీరు సరిగా లేక, బీడు భూముల్లో వ్యవసాయం చేయలేక ఊళ్లో రైతుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తిగా ఆయన మాకె ప్పుడూ చదువు విలువను తెలియజేస్తూ ఉన్నత విద్య దిశగా నడిపించారు. 

కేజీ నుంచి డిగ్రీ వరకు మిషినరీ, సర్కారు కళాశాలలే..
ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అనంతపురం పట్టణంలోని సెయింట్‌ అగస్టీన్‌ స్కూల్లో విద్యనభ్యసించా. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్‌ఆర్‌జి హైస్కూల్‌లో, ఇంటర్‌లో బైపీసీ తీసుకుని శ్రీసత్యసాయిబాబా జూనియర్‌ కళాశాలలో చదివాను. ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఎంసెట్‌ రాసినా డొనేషన్‌తో చేరే ర్యాంక్‌ వచ్చింది. కానీ నాన్నకు ఆర్థిక భారం కాకూడదనుకున్నా. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీలో బీఎస్సీ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోసం వెంపర్లాడలేదు. డిగ్రీ పూర్తి కాగానే గ్రూప్స్‌కు సిద్ధమయ్యాను. 

స్ఫూర్తినిచ్చిన ఆర్ట్స్‌ కాలేజీ..
అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి ఇక్కడే చదువుకున్నారు. సంజీవరెడ్డి అయితే ఇక్కడ అధ్యాపకులుగా కూడా పనిచేశారు. డీజీపీలుగా పనిచేసిన జేవీరాముడు, అరవిందరావు కూడా ఇక్కడే చదివారు. ఇలా ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా దేశవ్యాప్తంగా సేవలు అందించారు. ఆ స్ఫూర్తితోనే కళాశాలలో డిగ్రీ చదువుతుండగానే గ్రూప్స్‌కు ప్రిపేర్‌ అయ్యాను. ఇక కళాశాలలో చదువుతున్న రోజుల్లో అనంతపురం ఎస్పీగా పనిచేసిన స్టీఫెన్‌ రవీంద్రకి పబ్లిక్‌లో ఉన్న క్రేజ్‌ చూసి పోలీసైతే బాగుండని అనుకున్నా. 

వైఎస్‌ను అలా చూస్తూ ఉండిపోయా..
2008లో గ్రూప్‌–1కి ఎంపికైన అభ్యర్థులను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆయనలోని రాజసం, ముఖంపై చిరునవ్వు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయా. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ప్రభుత్వోద్యోగం. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు, ఆయన్ను చూసిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. 

ఆయన ఆప్యాయతకు మారుపేరు
ముఖ్యమంత్రి సీఎస్‌ఓగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం అందరికీ రాదు. అరుదుగా వచ్చే ఈ అవకాశం నాకు త్వరగా వరించిందనే చెప్పాలి. తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఉద్యోగుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూస్తారు. 

ప్రశాంతత ముఖ్యం
విద్యార్థి దశ చాలా కీలకం. ఆ సమయంలో ప్రశాంతంగా..  ప్రణాళికా బద్ధంగా చదివితే ఉన్నత లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చు. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనో, లక్ష్యం గురితప్పిందనో నిరాశ చెందకూడదు. కనీస సౌకర్యాలు లేని గ్రామాల నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఎందరో గొప్ప వ్యక్తులే మనకు ఆదర్శం. 

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం(ఫైల్‌)

ఇష్టదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి 
మా కుటుంబానికి ఇష్టదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. నేడు అదే స్వామి వారి పాదాల చెంత జిల్లా ఎస్పీగా    పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీ వారి ఆశీస్సులతోనే నాకు ఈ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చిందనుకుంటున్నా.

కుటుంబ నేపథ్యం
పేరు: పోతన్నగారి పరమేశ్వరరెడ్డి 
పుట్టిన తేది: 30.07.1983 
తల్లిదండ్రులు: నాగలక్ష్మి, నారాయణరెడ్డి 
సొంతూరు: పులేటిపల్లె గ్రామం, సీకేపల్లి మండలం, అనంతపురం జిల్లా 
భార్య: సాయిప్రసన్న(ప్రకాశం జిల్లా) 
పిల్లలు: ధాత్రిసాయిరెడ్డి, వైభవ్‌ 
విద్యాభ్యాసం: డిగ్రీ 
హాబీలు: సినిమాలు చూడటం  
ఉద్యోగ ప్రస్థానం: 2008లో నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంక్‌ వచ్చింది. శిక్షణ పూర్తయిన తర్వాత 2011లో మొదటి పోస్టింగ్‌ కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీగా వచ్చింది. 

ఆ తర్వాత వరుసగా..  
గ్రేహౌండ్స్‌ కమాండర్‌ 
కరీంనగర్‌ జిల్లా జగిత్యాల డీఎస్పీ 
తెలంగాణాలో సీఐడీ డీఎస్‌పీ 
నెల్లూరు ఏసీబీ డీఎస్పీ 
2018: ఏఎస్పీగా పదోన్నతి. నెల్లూరులోనే అడ్మిన్‌ ఏఎస్పీగా బాధ్యతలు  
2019: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం ముఖ్య భద్రతాధికారిగా అవకాశం. రెండేళ్ల పాటు విధులు. 
2021: ఐపీఎస్‌కి ఎంపిక. 
2022: తిరుపతి జిల్లా ఎస్పీగా నియామకం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top