అడవి ఒడిలోకి.. పులి పిల్లలు | Sakshi
Sakshi News home page

అడవి ఒడిలోకి.. పులి పిల్లలు

Published Sun, May 14 2023 5:16 AM

Tiger Babies Into Atmakuru Forest Area Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో రెండునెలల క్రితం తల్లి నుంచి వేరుపడి దొరికిన పులి పిల్లల్ని తిరిగి అడవిలో వదిలేందుకు రాష్ట్ర అటవీ శాఖ భారీ ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జూపార్క్‌లో ఆ నాలుగు పులి పిల్లల్ని ఉంచి సంరక్షిస్తున్నారు. ఎన్‌టీసీఏ (నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ) మార్గదర్శకాల ప్రకారం.. ప్రస్తుతం వాటికి ఆహారం అందించడంతోపాటు శిక్షణ ఇస్తున్నారు. వాటిని ఏడాదిన్నరలోపు తిరిగి అడవిలోకి పంపాల్సి వుంది. దీనికిముందు వాటిని అడవిలో సహజంగా జీవించే పులుల్లా తయారుచేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది.

ఇలా అడవి నుంచి బయటకు వచ్చిన పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపిన అనుభవం ఉన్న మధ్యప్రదేశ్‌లోని కన్హా, బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వులను తిరుపతి జూ క్యూరేటర్‌ సెల్వం, ఎన్‌ఎస్‌టీఆర్‌ (నాగార్జున్‌సాగర్‌–శ్రీశైలం టైగర్‌ రిజర్వు ప్రాజెక్టు) ఆత్మకూరు డివిజన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విఘ్నేష్‌ మరికొందరు అధికారుల బృందం పరిశీలించి వచ్చింది.

కన్హా రిజర్వులో 36 హెక్టార్లు, బాంధవ్‌గఢ్‌ రిజర్వులో 26 హెక్టార్లలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లు ఏర్పాటుచేసి తప్పిపోయి దొరికిన పులి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. ఆత్మకూరు ప్రాంతంలోని నల్లమల అడవిలోనే ఇలాంటి ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్‌క్లోజర్‌ ఎలా వేశారు, ఎలా నిర్వహించారు, ఎంత ఖర్చయింది, అలాంటి ఎన్‌క్లోజర్‌ను ఇక్కడ ఏర్పాటుచేయడానికి ఏం చేయాలనే దానిపై ఈ బృందం ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. దాన్నిబట్టి త్వరలో ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేయనున్నారు. 

50 జంతువుల్ని వేటాడి తింటేనే పూర్తిగా అడవిలోకి.. 
ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వంద హెక్టార్లలో నాలుగు పులి పిల్లల కోసం ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేయనున్నారు. నీటి వసతి బాగా ఉండి, వేటాడేందుకు అనువైన జంతువులున్న చోటును అన్వేషిస్తున్నారు. ఆ చోటును గుర్తించిన తర్వాత అక్కడ ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేసి 2, 3 నెలల్లో వాటిని అందులోకి వదిలిపెట్టాలని భావిస్తున్నారు. ఎన్‌క్లోజర్‌ను మూడు భాగాలుగా ఏర్పాటుచేయాలని చూస్తున్నారు. మొదట నర్సరీ ఎన్‌క్లోజర్‌లో ఉంచి చిన్న జంతువుల్ని వేటాడే అవకాశం కల్పించాలని, ఆ తర్వాత దశల్లో చిన్న, పెద్ద ఎన్‌క్లోజర్లలో కొద్దిగా పెద్ద జంతువుల్ని వేటాడేలా చేయాలనేది ప్రణాళిక.

అదే సమయంలో అడవిలో ఎలుగుబంట్లు, ఇతర జంతువుల బారిన అవి పడకుండా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. పులి పిల్లలు ఏడాదిన్నరలో ఈ ఎన్‌క్లోజర్లలో కనీసం 50 జంతువుల్ని చంపి తింటే వాటికి వేట వచ్చినట్లు నిర్ధారించుకుని అడవిలోకి వదిలేస్తారు. జంతువుల్ని చంపలేకపోతే వాటిని తిరిగి జూకి తరలిస్తారు. సాధారణంగా ఈ వేటను తల్లి పులులు పిల్లలకి నేర్పుతాయి. కానీ, ఆ పనిని ఇప్పుడు అటవీ శాఖ చేస్తోంది. ఈ పనిని బాంధవ్‌గఢ్‌ టైగర్‌ రిజర్వులో విజయవంతంగా చేయడంతో అక్కడికెళ్లి అధ్యయనం చేశారు.

అక్కడిలాగే నల్లమలలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లు తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చయ్యే పరిస్థితి ఉండడంతో అందుకోసం ఓ దాతను ఒప్పించారు. ఈ ఖర్చును భరించేందుకు ఆ దాత ముందుకు రావడంతో త్వరలో ఎస్‌వీ జూపార్క్‌లో పెరుగుతున్న పులి పిల్లలు నల్లమలలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌లోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. జూపార్క్‌లోని నాలుగు ఆడ పులి పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయి. మూడు కేజీల బరువు ఉన్నప్పుడు దొరికిన వాటి బరువు ఇప్పుడు 14–15 కేజీలకు పెరిగినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు.

అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం 
పులి పిల్లల్ని తిరిగి అడవిలోకి పంపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాం. త్వరలో ఇన్‌సిటు ఎన్‌క్లోజర్‌ ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందులో పులి పిల్లలు వేటాడితే అడవిలో వదులుతాం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతోపాటు మనం ఇంతకుముందు ఎప్పుడూ చేయని పని. అందుకే అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. 
– మధుసూదన్‌రెడ్డి, పీసీసీఎఫ్, ఏపీ అటవీ శాఖ 

Advertisement

తప్పక చదవండి

Advertisement