‘సుప్రీం’ తీర్పుతో టీడీపీలో అంతర్మథనం
బీసీ రిజర్వేషన్ చట్రంలో అనవసరంగా ఇరుక్కుపోయామంటున్న నేతలు
తెలిసీ తప్పటడుగు ఎందుకంటూ చంద్రబాబు తీరుపై అసహనం
పొత్తుల లెక్కలపైనా టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
సాక్షి, అమరావతి: బీసీల ఓట్ల కోసం చంద్రబాబు ఆడిన రిజర్వేషన్ల నాటకం సుప్రీంకోర్టు తీర్పుతో బట్టబయలవడంతో టీడీపీ శ్రేణులు తలెత్తుకోలేక లోలోన మథనపడుతున్నాయి. తాజా పరిణామంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీడీపీ పిటిషన్ కోర్టులో నిలవదని న్యాయ నిపుణులు ముందే హెచ్చరించినా పట్టించుకోకుండా ఇప్పుడు గ్రామాల్లో బీసీలకు ముఖం చూపించలేని పరిస్థితి తెచ్చిపెట్టారని సీనియర్ నేతలు వాపోతున్నట్లు సమాచారం. అసాధ్యమని తెలిసీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి అనవసరంగా అభాసుపాలయ్యామన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.
34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామంటూ సభల్లో గొప్పలు చెప్పుకున్న ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జిలు ఇప్పుడు బీసీల దగ్గరకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలని తలపట్టుకుంటున్నారు. 34 శాతం ఇవ్వలేమని తెలిసి కూడా చంద్రబాబు కేవలం రాజకీయ లబ్ధి కోసం జీవోలు ఇచ్చి పార్టీని అభాసుపాల్జేశారని నేతలు మండిపడుతున్నారు. నిజానికి.. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి దాటితే కోర్టులు అంగీకరించవన్నది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. 2020లో 59 శాతం రిజర్వేషన్లతో ఇచ్చిన జీవోనే హైకోర్టు కొట్టేసింది.
సుప్రీంకోర్టులోనూ అప్పట్లో ఊరట దక్కలేదు. గతేడాది తెలంగాణ పెట్టిన బీసీ కోటాకు ‘సుప్రీం’లో పట్టిన గతి ఆయన కళ్ల ముందే ఉంది. అలాగే, గత పదిహేనేళ్లలో కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌లలోనూ ఇదే కారణంతో బీసీ కోటాలు కోర్టుల్లో వీగిపోయాయి. ఇవన్నీ తెలిసీ 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని బాబు ఎలా ప్రకటించారని పార్టీ సీనియర్ నేతలే ప్రశ్నిస్తున్నారు.
రాజ్యాంగ సవరణకు అడగని బాబు..
బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా ఆ సవరణ కోసం కనీసం అడగలేకపోవడం చంద్రబాబు బలహీనతను బయటపెట్టిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. మోదీని అడిగే ధైర్యంలేక చెల్లుబాటు కాని జీవోలతో నాటకాలు ఆడామన్న విషయం బహిర్గతమైందని, బీసీల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోందని వారు అంటున్నారు. శాశ్వత పరిష్కారం ఢిల్లీలో ఉంటే, ఓడిపోయే కేసు కోసం ‘సుప్రీం’ మెట్లెక్కడం వెనుక ఉద్దేశం కేవలం ఎన్నికల ముందు హడావుడి చేయడమేనని మనమే బయటపెట్టుకున్నామని వారు చెబుతున్నారు.
మరోవైపు.. పార్టీలో ఇంత అసహనం వ్యక్తమవుతున్నా చంద్రబాబు మాత్రం తన తప్పు ఒప్పుకోవడంలేదు. హైకోర్టు తీర్పు రాగానే ప్రతిపక్షమే కోర్టుకెళ్లి అడ్డుకుందంటూ నెపాన్ని వైఎస్సార్‌సీపీ పైకి నెట్టేశారు. అదే మాట అందరూ చెప్పాలంటూ పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. కోర్టులో నిలవని హామీ ఇచ్చాక ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లిస్తామంటే ప్రజలు నమ్ముతారా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు.
పొత్తులపైనా ఆందోళన..
ఇక కూటమిలో పొత్తుల లెక్కలపైనా టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఏ కార్పొరేషన్ ఎవరికి, ఏ మున్సిపాలిటీ ఎవరికి అన్నది ఇప్పటికీ తేల్చకపోతే క్షేత్రస్థాయిలో తామెలా పనిచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. అధినేతల స్థాయిలో ఇంకా భేటీలు, సమాలోచనల గందరగోళం కొనసాగుతుండగానే వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచి నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అధికారంలో ఉండి కూడా ఇంతవరకూ ఏమీ తేల్చుకోలేక సతమతమవుతుంటే, వైఎస్సార్‌సీపీ మాత్రం స్థానిక ఎన్నికల వ్యూహాలను వేగంగా అమలుచేస్తుండడం టీడీపీ నేతలకు మింగుడుపడటంలేదు.


