పట్టించుకోని కూటమి సర్కార్
ప్రాజెక్టు పూర్తికి రూ.7,280 కోట్లు అవసరం
ముందుకు కదలని ప్రాజెక్టు పనులు
జగన్ హయాంలో లబ్ధిదారులకు లక్ష ఇళ్ల వరకూ పంపిణీ..
కూటమి సర్కార్ 18 నెలల పాలనలో ఒక్కరికీ లభించని ఇల్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని లబ్ధిదారులు అందరికీ 2026 జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు అందజేస్తామని ఇటీవల మున్సిపల్‌శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. అయితే ‘ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.7,280 కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. మరో ఏడు నెలల్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారుకు కూడా ఇల్లు ఇచ్చింది లేదు.
జగన్ పూర్తి చేసిన ఇళ్లే దిక్కు..
పేదలకు ఇళ్ల విషయంలో పూర్తి వైఫల్యం నేపథ్యంలో పరువు కాపాడుకునేందుకు బాబు సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 90 – 95 శాతం పనులు పూర్తయిన 6 వేల ఇళ్లకు హంగులు అద్ది ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలంటే తమకు నిధులు ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థలు పట్టుబట్టడంతో చేసేది లేక రాజీవ్ స్వగృహ నిధుల నుంచి రూ.200 కోట్లు తీసుకుని కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా బాబు ప్రభుత్వ పాలనకు భిన్నంగా జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లింది.
ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరుశాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించడం జరిగింది. మొత్తం 2,62,212 ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లను జగన్ సర్కార్ లబ్ధిదారులకు అందించిన విషయాన్ని మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు. జగన్ హయాంలోనే మరో 77,546 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
లబ్ధిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా అక్రమాలకు జగన్ సర్కారు చెక్...
ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించి రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించింది.
⇒ చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించి రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. తద్వారా ఈ ప్రయోజనాన్ని పేదలకు అందించింది.
⇒ నిరుపేదలకు కేటాయించిన 300 చదరపు అడుగుల ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండాపోయింది.
⇒ 365 చదరపు అడుగుల ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. దాంతో రెండు, మూడు కేటగిరీల లబ్ధిదారులకు టీడీపీ లెక్కల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది.
⇒ అలాగే గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని సైతం జగన్ ప్రభుత్వం తగ్గించింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే 1,43,600 ఇళ్లలో ఒక్కోఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా నిరుపేదలకు పూర్తి ఉచితంగా అందించారు.
⇒ 365 చదరపు అడుగుల ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు భరించి లబ్ధిదారులకు వారి వాటాగా చెల్లించాల్సిన సొమ్ముకు సంబంధించి రూ.3.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది.
⇒ అలాగే రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అడుగుల ఇంటికి జగన్ ప్రభుత్వం రూ.4.15 లక్షలు చెల్లించి లబ్ధిదారు వాటాగా రూ.4.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది.
బాబు పాలనలో రూ. 8,929.81 కోట్ల దోపిడీ
గత టీడీపీ ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. అన్ని మున్సిపాలిటీల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేయగా, చాలా మున్సిపాలిటీల పరిధిలో స్థలం లభించలేదు. అయితే, భూములు దొరికిన చోట నాడు చదరపు అడుగు నిర్మాణ ధర రూ.1,000 కంటే తక్కువే. అయితే బాబు ప్రభుత్వం మాత్రం కంపెనీలు ఇచ్చిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59 వరకూ నిర్ణయించి కాంట్రాక్టులు కట్టబెట్టింది. సగటున చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,203.45గా చెల్లించారు.
అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా ఇచ్చారు. పైగా ఎక్కడా నూరు శాతం ఇళ్లు ఇచ్చింది లేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరులో ఇళ్లు పూర్తవకపోయినా రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2019 మే నాటికి 77,350 ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇందులో 20 వేల వరకు మాత్రమే 60 శాతం పూర్తి చేశారు.


