టీడీపీ ఇక ఎప్పుడూ విపక్షంలో ఉండదు
గత మూడుసార్లు కంటే ఇప్పుడే వేగంగా పనిచేస్తున్నా
భారీ ఈవెంట్లు, భారీ పెట్టుబడులతో రాష్ట్రం దూసుకెళ్తోంది
మీడియాతో సీఎం చంద్రబాబు
పార్టీ కార్యాలయంలో వినతుల స్వీకారం
సాక్షి, అమరావతి: టీడీపీ ఇకపై ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని.. శాశ్వతంగా అధికారంలో ఉంటూ సుదీర్ఘకాలం కొనసాగుతామని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తానని వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి రోజంతా ఉంటానని చెప్పారు. పార్టీ కార్యాలయానికి వస్తేనే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. లోకేశ్ కూడా వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయంలో ఉంటారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని గాడిలో పెట్టామన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికంటే ఇప్పుడే ఇంకా వేగంగా పనిచేస్తున్నా. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో పరిపాలనలో వేగం పెరిగి పాలన సులభంగా మారింది. ప్రజా సమస్యలు ఎందుకు పరిష్కారం కావడంలేదో వినతులు ఇచ్చిన వారికి అర్ధమయ్యేలా తెలిపే విధానం తీసుకొస్తాం. వాటికున్న అడ్డంకుల గురించి బాధితులకు తెలియాలి.
కిందిస్థాయిలో ఉన్న అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. ముందు పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. 22ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ప్రజాదర్బార్‌లు నిర్వహించాలి. పార్టీ కమిటీలను ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తాం.
నిర్మాణాత్మకంగా పెట్టుబడుల సదస్సు..
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సును నిర్మాణాత్మకంగా నిర్వహిస్తాం. ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఎగ్జిబిషన్, ఒప్పందాలు ఇలా వివిధ రూపాల్లో సదస్సు జరుగుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది. షిప్‌మెంట్ మాత్రమే మిగిలి ఉంది. అనుకున్న సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చూస్తున్నాం. ఇక తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దాదాపు రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది.
పింఛన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. పింఛన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీలో 48 మంది ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషించిన ఆయన ఈ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వారి వివరణ తీసుకున్న తర్వాత చర్యలు తీసుకుందామని ఆయనన్నట్లు తెలిసింది.
ఏడు ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం భూమి పూజ..
మరోవైపు.. అమరావతి నుంచి వర్చువల్ విధానంలో కుప్పంలో ఏడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హిందాల్కో, శ్రీజ డెయిరీ, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డెయిరీ, ఇ–రాయస్ ఈవీ, అలీప్ కుప్పంలో పరిశ్రమలు పెట్టనున్నాయి.
ఈ ఏడు సంస్థలకు 241 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. పరిశ్రమల శంకుస్థాపన సందర్భంగా స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో ఆన్‌లైన్ ద్వారా సీఎం మాట్లాడారు. త్వరలో కుప్పం నియోజకవర్గానికి మరో ఎనిమిది సంస్థలు రాబోతున్నాయని చెప్పారు. వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్, వన్ ఫ్యామిలీ–వన్ ఏఐ నిపుణుడు అనే పాలసీలు విస్తృత అవకాశాలు కల్పిస్తాయన్నారు.


