
గ్రామ పంచాయతీ కార్యదర్శుల నెత్తిన సర్కారు పిడుగు
సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టి చిరుద్యోగులకు బెదిరింపులు
2029 నాటికి పేదరిక నిర్మూలన అంటూ మభ్యపెట్టే ప్రకటనలు
నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఉన్న పథకాలను ఎందుకు ఆపినట్లు?
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలపై చేతులెత్తేసి పీ–4 పేరుతో వంచిస్తున్న కూటమి సర్కారు ఆ బాధ్యత నుంచి సైతం తప్పుకుంటోంది! ‘జీరో పావర్టీ పీ–4’ కార్యక్రమం మార్గదర్శులను గుర్తించే బాధ్యతను గ్రామస్థాయిలో చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శుల నెత్తిన పెట్టి చేతులు దులుపుకొంటోంది. లేదంటే జీతాలు కట్ అంటూ బెదిరిస్తోంది. రాష్ట్రంలో 20 శాతం పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చి 2029 నాటికి జీరో పేదరికం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగాది రోజు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
పేదలకు సాయం చేసేవారిని మార్గదర్శులుగా, లబ్ధి పొందే వారిని బంగారు కుటుంబాలుగా ప్రకటించారు. ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులైన పంచాయతీ కార్యదర్శులపై పెట్టారు. ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో ఇద్దరు మార్గదర్శులను గుర్తించని పక్షంలో పంచాయతీ కార్యదర్శి జీతాలను నిలిపివేస్తామంటూ పలు జిల్లాల్లో అధికారులు హెచ్చరిక నోటీసులు జారీ చేస్తున్నారు. ఎంపీడీవోలు జారీ చేస్తున్న ఈ నోటీసులతో ఉద్యోగులు విస్తుపోతున్నారు. ప్రభుత్వం తాను నిర్వర్తించాల్సిన బాధ్యతను చిరుద్యోగులపై మోపడం ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక సాయంతో కూడుకున్న వ్యవహారాలపై పంచాయతీ కార్యదర్శి చెబితే దాతలు ముందుకొస్తారా అని మండిపడుతున్నారు.

రెండు నెలలు సర్వే హడావుడి..
పీ–4 కార్యక్రమం పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో జనవరి–ఫిబ్రవరిలో రెండు నెలలు పాటు ఇంటింటి సర్వేలంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. ఇక మార్చి ఉగాది రోజున అమరావతిలో బహిరంగ సభ నిర్వహించి అన్ని నియోజకవర్గాల నుంచి పొదుపు మహిళలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ప్రత్యేక బస్సుల్లో తరలించింది. మరోవైపు ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున పీ–4 సమన్వయకర్తలను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఖజానా నుంచి ఏడాదికి రూ.12.60 కోట్లు వారికి వేతనాల రూపంలో చెల్లించేందుకు సిద్ధమైంది.
హామీలపై మభ్యపుచ్చేందుకే..
పీ–4 కార్యక్రమం ద్వారా 30 లక్షల పేద కుటుంబాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా ఐదు లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. నిజంగానే పేదరికాన్ని రూపుమాపాలంటే పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వారి జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రభుత్వం కృషి చేయాలి. ఒకవైపు ఇప్పటికే అమలవుతున్న పథకాలను నిలిపివేసి పేదల పొట్టగొడుతూ మరోవైపు పీ–4 పేరుతో మభ్యపుచ్చే యత్నాలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల దత్తత పేరిట హడావుడి చేయడం మినహా ఒరగబెట్టిందేమీ లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.