పచ్చ దౌర్జన్యాలు

TDP Activists Attack On YSRCP Leaders In Kadapa - Sakshi

అధికారంలో ఉన్నప్పుడు హత్యలు

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు

ఇప్పుడు తగదునమ్మా అంటూ అధికార పార్టీపై ఆరోపణలు

బీసీ కార్డుతో రాద్ధాంతం

సాక్షి ప్రతినిధి కడప: అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌ సీపీ నేతలను హత్య చేయడమే కాకుండా ఆ పార్టీ  శ్రేణులపై దౌర్జన్యాలు, దాడులే అజెండాగా పాలన సాగించిన ప్రతిపక్ష టీడీపీ ప్రస్తుతం వ్యక్తిగత గొడవలను తెరపైకి తెచ్చి రాజకీయ రగడ సృష్టించి రాద్ధాంతం చేసే ప్రయత్నాలకు దిగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల అధికారంలో జిల్లాలో టీడీపీ  రాక్షస పాలనకు తెర తీసింది. ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేసింది. దీనిని ప్రశ్నించే ప్రయత్నం చేసిన అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడ్డారు. కొందరిని దారుణంగా హత్య చేశారు. మరికొందరిని కిడ్నాప్‌ చేశారు. కొందరిని బెదిరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేశారు. ఇక కొందరు అధికారులనూ వదల్లేదు. అప్పట్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అధికారులపై దౌర్జన్యాలు చేసిన సంఘటనలు కోకొల్లలు.

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండల వైస్‌ ప్రెసిడెంట్, అలవలపాడుకు చెందిన గజ్జెల రామిరెడ్డిని అప్పట్లో టీడీపీ నేతలు దారి కాపుకాచి దారుణంగా హతమార్చారు. ఆధిపత్యం కోసమే టీడీపీ నేతలు ఈ హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ హత్యోదంతంపై అప్పట్లో కేసు నమోదైంది. ఇదే మండలం కుప్పాలపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు బంకా నాగభూషణ్‌రెడ్డిని సైతం అధికార పార్టీ నేతలు హత్య చేసి పొట్టన పెట్టుకున్నారు. 2018లో కడపలో అప్పటి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాకా సురేష్‌పై టీడీపీ నేతలు శ్రీనివాసులరెడ్డి, బీటెక్‌ రవి అనుచరులు కార్పొరేషన్‌ కార్యాలయం సమీపాన దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పాకా సురేష్‌కు తల పగిలింది. తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాసులురెడ్డి, బీటెక్‌ రవి పలువురిపై ఫిర్యాదు చేసినా అప్పట్లో పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

కడప నగరం బ్రాహ్మణవీధికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ కార్పొరేటర్‌ ఎంఎల్‌ఎన్‌ సురేష్‌ను అప్పట్లో టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేసి దాడి  చేశారు. శంకరాపురం 8వ డివిజన్‌కు చెందిన మాజీ కార్పొరేటర్‌ జమ్మిరెడ్డిని టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేశారు. అతని భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆ తర్వాత విడిపించారు. 1వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ చైతన్యపైన టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టించారు. దీంతో ఆయన కొంతకాలం ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చింది. దీనిపైన అప్పట్లో చైతన్య సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ  ఎన్నికల సమయంలో పోరుమామిళ్లకు చెందిన వైద్యులు మహబూబ్‌పీరా కుమారుడు ముర్తుజాను టీడీపీ నేతలు కిడ్నాప్‌ చేసి ఐదు రోజులపాటు నిర్బంధంలో ఉంచారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వైఎస్సార్‌ సీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు.

2014 ఎన్నికలలో ఏజెంటుగా కూర్చొన్నాడని కమలాపురం మండలం జీవంపేటకు చెందిన పుత్తా దస్తగిరిరెడ్డిని టీడీపీ నేతలు 2014 నవంబరు 7న కమలాపురం–చెప్పలి రహదారిలోని జంగంపల్లె సమీపంలో దాడి చేసి రెండు కాళ్లు, చేతులు విరిచారు. ఈ కేసు నుంచి బయట పడేందుకు దస్తగిరిరెడ్డిపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు. 2018లో పాలెంపల్లెకు చెందిన మాజీ సర్పంచ్‌పైన టీడీపీ నేతలు దాడి చేశారు. ప్రొద్దుటూరు పెన్నానగర్‌కు చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకుడు, అప్పటి జెడ్పీ కో ఆప్షన్‌ మెంబర్‌ అక్బర్‌పై 2017లో టీడీపీ నాయకులు తప్పుడు కిడ్నాప్‌ కేసును నమోదు చేసి తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ప్రొద్దుటూరులోని వైఎస్సార్‌ సీపీ నాయకులు అచ్చుకట్ల మహబూబ్‌బాషా, గోపిరెడ్డి రమణ, కృష్ణారెడ్డి, అక్బర్, ఆయిల్‌మిల్‌ ఖాజా, కుండా రవి తదితరులపై వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో 2016లో టీడీపీ నాయకులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు.  

ఐదేళ్ల పాలనలో అప్పటి టీడీపీ నేతల దౌర్జన్యాలు, అక్రమాలు కోకొల్లలు. తాజాగా ప్రొద్దుటూరుకు చెందిన టీడీపీ నాయకుడు నందం సుబ్బయ్య హత్యకు గురయ్యారు. ఈ సంఘటనలో అధికార పార్టీ నేతలు బీసీ నాయకుడిని అంతమొందించారంటూ ప్రతిపక్ష టీడీపీ నేతలు రాద్ధాంతానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యక్తిగత కక్షలను రాజకీయ కక్షలుగా చిత్రీకరించి టీడీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ అధినేత ఏనాడూ బీసీలపై ప్రేమ చూపించింది లేదు. పేరుకు బీసీ కార్డు వాడుకుంటూ ఏరోజు చంద్రబాబు తన పాలనలో బీసీలకు న్యాయం చేసింది లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక బీసీ వర్గాలకు పెద్దపీట వేశారు.

కార్పొరేషన్‌ చైర్మన్ల పదవులు కట్టబెట్టారు. బీసీలకు నామినేటెడ్‌ పదవులతోపాటు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులుగా ఎంపికయ్యేలా చేశారు. దీంతో జగన్‌ ప్రభుత్వాన్ని బీసీలు కొనియాడుతున్నారు. దీన్ని చంద్రబాబు, లోకేష్‌ తదితర  టీడీపీ నేతలు జీర్ణించుకోలేకనే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేకే ప్రతిపక్ష టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారని జిల్లాకు చెందిన ఆ పార్టీ బీసీ నేత పాకా సురేష్‌ ఆరోపించారు. జిల్లాలో బీసీలందరిదీ ఇదే అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు మానుకుని ప్రజలకు ఉపయోగపడేలా వ్యవహరించాలని జిల్లా ప్రజలు సూచిస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top