ఖైరతాబాద్‌ గణనాథునికి తాపేశ్వరం లడ్డూ

Tapeswaram Laddu Begins Its Journey To Khairatabad 2020 - Sakshi

సాక్షి, మండపేట: వినాయక చవితి వేడుకలకు ప్రసిద్ధి చెందిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణనాథునికి తాపేశ్వరం మడత కాజా మాతృసంస్థ సురుచి ఫుడ్స్‌ 100 కిలోల లడ్డూను కానుకగా అందజేసింది. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సురుచి ఫుడ్స్‌ అధినేత పోలిశెట్టి మల్లిబాబు స్వామి వారికి లడ్డూను కానుకగా పంపించారు. ఖైరతాబాద్‌ గణపయ్యకు 2010 నుంచి లడ్డూను కానుకగా మల్లిబాబు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల ప్రారంభానికి పది రోజుల ముందే మల్లిబాబు, సిబ్బంది గణపతి మాలలు ధరించి అత్యంత నియమనిష్టలతో లడ్డూ తయారు చేసేవారు. 2010లో 500 కిలోల లడ్డూ తయారుచేసి పంపగా, విగ్రహ పరిమాణాన్ని బట్టి ఏటా లడ్డూ పరిమాణం పెంచుతూ వచ్చారు. 2011లో 2,400 కిలోల లడ్డూ సమర్పించగా, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోలు, 2014లో 5,200 కిలోలు, 2015లో 6 వేల కిలోల లడ్డూను స్వామి వారికి కానుకగా అందజేశారు. లడ్డూలను గణనాథుని చేతిలో ఉంచి, ఉత్సవాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేసేవారు. (ప్రేక్షకులను ఉర్రూతలుగించిన​ వినాయకుడి పాటలు)

2016లో కమిటీ సూచన మేరకు 500 కిలోల లడ్డూను కానుకగా పంపారు. అయితే ఎంతో నియమనిష్టలతో, తీవ్ర వ్యయప్రయాసాలకోర్చి అందజేసిన లడ్డూ నైవేద్యానికి కమిటీ సరైన రక్షణ కల్పించకపోవడం మల్లిబాబును తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా 2017 ఉత్సవాల నుంచి భారీ లడ్డూ కానుకను నిలిపివేసినా 25 కిలోల లడ్డూ కానుకగా అందజేస్తూ వచ్చారు. కాగా ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ కోరిక మేరకు ఈ ఏడాది ఉత్సవాలకు 100 కిలోల లడ్డూ తయారు చేసి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. కోవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది ఖైరతాబాద్‌లో తొమ్మిది అడుగుల వినాయకుని విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నట్టు మల్లిబాబు తెలిపారు. లడ్డూను శుక్రవారం ప్రత్యేక వాహనంలో ఖైరతాబాద్‌కు తరలించామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top