వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు: సుప్రీం | Supreme Court On Providing Lands For Journalists Bureaucrats, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు సరికాదు: సుప్రీం

Nov 26 2024 6:03 AM | Updated on Nov 26 2024 8:04 AM

Supreme Court On Providing Lands for journalists bureaucrats

జీహెచ్‌ఎంసీ పరిధిలో జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, జడ్జీలు, ప్రజా ప్రతినిధులకు స్థలాలివ్వడంపై సుప్రీం తీర్పు

వారేమీ వెనుకబడిన వర్గాలు కాదు 

వారు చెల్లించిన సొమ్మును వడ్డీతో వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశం

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు, జర్నలిస్టుల హౌసింగ్‌ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను సుప్రీం కోర్టు రద్దు చేసింది. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు మార్గదర్శకాలపై 2005లో జారీ చేసిన జీవోలను సైతం రద్దు చేసింది. 

సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, జర్నలిస్టులను ‘ప్రత్యేక వర్గం’గా పేర్కొంటూ వారి హౌసింగ్‌ సొసైటీలకు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు విరుద్ధమని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్‌ సొసైటీలు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టేసింది. హౌసింగ్‌ సొసైటీలు చెల్లించిన సొమ్మును రిజిస్ట్రేషన్‌ ఫీజు, స్టాంపు డ్యూటీతో సహా వడ్డీతో కలిపి వెనక్కి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఆ సొసైటీలకు అనుకూలంగా లీజు డీడ్‌లు ఏవైనా ఇచ్చి ఉంటే అవన్నీ రద్దు అవుతాయని తెలిపింది. అలాగే సొసైటీలు చెల్లించిన డెవలప్‌మెంట్‌ చార్జీలను కూడా వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్‌ పి.సంజయ్‌ కుమార్‌ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిల సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ 2008లో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలను కొట్టేస్తూ 2010లో హైకోర్టు తీర్పునిచ్చింది. ఒకవేళ ప్రభుత్వం ఆ సొసైటీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకుంటే వాటి సభ్యులకు అర్హతలు నిర్ణయించాలని ఆదేశించింది. 

ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, హౌసింగ్‌ సొసైటీలతో పాటు ఇళ్ల స్థలాల కేటాయింపును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వీబీ చెలికాని తదితరులు సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై సుదీర్ఘ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పలు తరగతులతో పోలీస్తే ఎంపీలు, శాసన సభ్యులు, ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులు, జడ్జిలు మంచి స్థానంలో ఉన్నారని సుప్రీంకోర్టు తెలిపింది. 

ఈ వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని స్పష్టం చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సామాన్యులకు ఒకే రకమైన హక్కులను తిరస్కరించడం ఎంత మాత్రం సహేతుకం కాదంది. తాము ఎన్నో త్యాగాలు చేశామని, అందువల్ల తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు పొందే హక్కు ఉందన్న అఖిల భారత సర్వీసు ఉద్యోగుల వాదనను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, చట్టసభలకు ఎన్నికైన వారు, సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ జర్నలిస్టులు ‘వెనుకబడిన వర్గాల’కిందకు రారని స్పష్టం చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement