
సీజేఐ ఎన్‌వీ రమణకు పంచగవ్య ఉత్పత్తులను అందజేస్తున్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
తిరుమల/తిరుపతి కల్చరల్/చంద్రగిరి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ శనివారం రాత్రి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ రమణ దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ దంపతులు శ్రీ వరాహ స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు తిరుమలకు చేరుకున్న జస్టిస్ రమణ దంపతులకు శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్, ఈవోతో పాటు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఏర్పాటు చేసిన పంచగవ్య ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో ఆకర్షణీయంగా తయారుచేసిన శ్రీవారి ఫొటోలు, ఇతర వస్తువుల స్టాల్‌ను జస్టిస్ రమణ సందర్శించారు.
గో తులాభారంతో మొక్కు చెల్లింపు
శనివారం సాయంత్రం అలిపిరి వద్దనున్న ఎస్వీ సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని జస్టిస్ రమణ దంపతులు సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి గో ప్రదక్షిణ చేసి వేణుగోపాల స్వామి వారిని దర్శించుకున్నారు. గోమాతకు సరిపడా తులాభారంతో మొక్కు చెల్లించుకున్నారు.
అమ్మవారి సేవలో
జస్టిస్ రమణ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.