గ్రామ స్థాయిలోనే మద్దతు ధర

Support Price At Village Level To Farmers In AP - Sakshi

రూ.1,582 కోట్ల విలువ చేసే ధాన్యం సేకరణ

ఇప్పటికే రైతుల ఖాతాకు రూ.831.75 కోట్లు జమ 

ధాన్యం అమ్ముకునేందుకు ఆందోళనొద్దు

సాక్షి, అమరావతి : ధాన్యాన్ని ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే కొనుగోలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు తగ్గిపోవడంతో పాటు రైతులకు మద్దతు ధర దక్కుతోంది. ధాన్యం విక్రయించేందుకు రైతులు ఎలాంటి ఆందోళనకు గురవ్వకుండా ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఖరీఫ్‌ ధాన్యానికి సంబంధించి ఏ–గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ.1,888, సాధారణ రకం క్వింటాల్‌కు రూ.1,868 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వం గ్రామాల్లోనే తగిన ఏర్పాట్లు చేయటం వల్ల దళారులు, వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఇటీవల తుపానుకు తడిసిపోయి రంగు మారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిబంధనలను సడలిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపింది. ఈ మేరకు ఈ–క్రాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తారు. ఈ–క్రాప్‌ నమోదుకు సంబంధించి సందేహాలు ఉంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అగ్రికల్చరల్‌ అసిస్టెంట్ల ద్వారా అనుమానాలను నివృత్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు. రైతులు నష్టపోకుండా తేమ శాతం కొలిచే, ధాన్యం ఆరబెట్టేందుకు అవసరమైన యంత్రాలు, జల్లెడ వంటి వాటిని అందుబాటులోకి తెచ్చారు. మద్దతు ధర కంటే ఎక్కువ ధర వస్తుందనుకుంటే ధాన్యాన్ని బయట మార్కెట్లో కూడా విక్రయించుకోవచ్చు.

8.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
► ఈ సీజన్‌లో 62 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించగా ఇప్పటి వరకు రూ.1,582 కోట్ల విలువ చేసే 8.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో రూ.831.75 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశారు.
► రైతు భరోసా కేంద్రాలు, కొనుగోలు కేంద్రాల వద్ద హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో రైతులకు సరైన సమాధానం రాకపోతే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల కమిషనర్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ (18004251903)ను అందుబాటులోకి తెచ్చారు.
► ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 3.56 లక్షల మెట్రిక్‌ టన్నులు, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 173 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన 10 రోజుల్లోగా అందుకయ్యే మొత్తాన్ని జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top