మండేకాలం..  జాగ్రత్త సుమా..! | Sakshi
Sakshi News home page

మండేకాలం..  జాగ్రత్త సుమా..!

Published Wed, Apr 13 2022 12:29 PM

Sunny Weather Prakasam District Official Warns People Take Precautions - Sakshi

ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఉష్ణతాపం మొదలైంది. రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం మరింత తీవ్రతరం కానుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. మున్ముందు వడగాల్పులకు ప్రజలు ఇబ్బందులు పడకుండా, ప్రాణనష్టం వాటిల్లకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు సిద్ధమైంది. ఒక వైపు ప్రజలను అప్రమత్తం చేస్తూనే వారికి అవసరమైన అత్యవసర ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధ ప్రాతిపదికన చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు ప్రారంభమయ్యాయి. అత్యవసర వైద్యసేవలు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  

ఒంగోలు అర్బన్‌: వేసవికాలం ఎండ తీవ్రత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో వడగాల్పులకు, వడదెబ్బలకు ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు జిల్లాలో ముందస్తు జాగ్రత్త చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు శాఖలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఒంగోలు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ శాఖల ద్వారా భారీ ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే చలివేంద్రాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యూనియన్‌లు, ప్రజా సంఘాలు కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసేలా యంత్రాంగం కృషి చేస్తోంది. వడగాల్పులు, వడదెబ్బ, డీ హైడ్రేషన్‌ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే ప్రజలకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లలో అవసరమైన ఔషధాలు సిద్ధం చేస్తున్నారు.  

గ్రామ స్థాయిలో డీ హైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండేందుకు విరివిగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా యంత్రాంగం చర్యలు తీసుకోంటోంది.  అంతేకాకుండా వడగాల్పులకు తిరిగి వడదెబ్బకు గురయ్యేకంటే ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించేలా ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేదుకు ప్రణాళిక సిద్ధమైంది. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రజలు కూడా ఎండ, వేడి తీవ్రత ఉన్న మధ్యాహ్నం సమయంలో పనులను సడలింపు చేసుకోవాలని అత్యవసరమై బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలతో బయట తిరగాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రజలకు సూచించారు.  

తాగునీటి సమస్యపై దృష్టి 
జిల్లాలో కొన్ని గ్రామాల్లో నీటి కొరత ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో నీటి వనరులను గుర్తించేందుకు యుద్ధ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలతో నీటి సరఫరాకు సంబంధించిన పైపులైన్‌ మరమ్మతులు చేపట్టారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో అవకాశం మేరకు బోర్లు వేయడం, పైప్‌లైన్‌ అవకాశం లేని గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసేలా రంగం సిద్ధమైంది.  

ప్రైవేటు పాఠశాలలు, కళాశాల యాజమాన్యలకు విద్యార్థులకు వడదెబ్బ సోకుండా పాటించాల్సి విధివిధానాలను విద్యాశాఖ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాఠశాల, కళాశాలల్లో తప్పనిసరిగా విద్యార్థులకు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. వేసవి తీవ్రత, వడగాల్పుల దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రవాణా శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ డిపోలు, నగరంతో పాటు జిల్లాలో రహదారుల వద్ద ఉన్న బస్టాండ్‌లలతో ప్రయాణికులకు అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

గ్రామ, పట్టణ స్థాయిల్లో గృహాలు, పరిశ్రమలు ఇతర ప్రాంతాల్లో వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది నీటిని నింపుకున్న వాహనాలతో నిరంతరం సిద్ధంగా ఉండాలని, ఎక్కడైనా అగ్నిప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేలా అప్రమత్తంగా ఉండేలా సంబంధిత అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.  

వడగాల్పులకు ఇబ్బందులు లేకుండా అన్నీ తీసుకున్నాం.. 
పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడగాల్పులకు ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అందుబాటులో ఉంచడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు వంటి వాటితో మరిన్ని చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ప్రజలు కూడా వడగాల్పుల పట్ల అవగాహనతో వడదెబ్బల పాలవకుండా, మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ పరంగా కూడా ప్రజలకు వడగాల్పులకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకున్నాం. ప్రజలు సహకరించి వేసవిలో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్త వహించాలి. 
– ఏఎస్‌ దినేష్‌ కుమార్, కలెక్టర్‌  

Advertisement
Advertisement