మండే ఎండలకు బండి పైలం.. నిర్లక్ష్యం అస్సలు వద్దు! ఈ జాగ్రత్తలు మీకోసమే..

Sunny Days Simple Tips In Telugu For Safety Drive - Sakshi

విశాఖపట్నం: భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం వేళయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎండలో కాలు పెడితే చాలు ఒంట్లోని సత్తువంతా ఆవిరైపోతోంది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం మనం ఎలా జాగ్రత్తలు పాటిస్తామో.. వాహనాలను కూడా అలానే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాహనాలు ఎండలో గంటల సమయం ఉంచడం వల్ల రంగు వెలిసిపోతాయని, పెట్రోల్‌ ఆవిరయ్యే అవకాశం ఉంటుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ట్యాంక్‌ నిండా పెట్రోల్‌ పట్టిస్తే ఒక్కో సారి పేలే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.  
చదవండి👉🏾బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన

పెద్ద వాహనాలకు ఇలా.. 
కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్‌ ఫ్రీజ్‌ అయ్యే ప్రమాదం  ఉంది.  
రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంట్‌ ఆయిల్‌ వాడడం మంచిది. 
వేడికి ఇంజిన్‌ ఆయిల్‌ తగ్గే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. 
పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్‌పీజీ గ్యాస్‌ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాహనదారులు వేసవిలో గ్యాస్‌ కిట్‌ను ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం. 
ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్‌ మ్యాట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 
ఎండాకాలం పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు నూతన టైర్లు వాడితే మేలు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది.  
చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’

ద్విచక్ర వాహనాలకు రక్షణ ఇలా..  
వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్‌ చేయాల్సి వస్తే.. చెట్టు నీడన గానీ, షెడ్లలో గానీ లేదా కవర్లు కప్పి ఉంచాలి. 
అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గిపోతుంది. తరచూ గాలి తనిఖీ చేయించుకోవడం మంచిది. 
బైక్‌లు ఎక్కువ సమయం ఎండలో ఉంచితే పెట్రోల్‌ ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. 
పెట్రోల్‌ ట్యాంకుపై మందపాటి కవర్‌ ఉండేటట్లు చూసుకోవడం వల్ల కొంత మేర పెట్రోల్‌ ఆవిరి   కాకుండా చూడవచ్చు.  
ఎండల వేడికి ఇంజిన్‌ ఆయిల్‌ త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్‌ ఆయిల్‌ మార్చుకోవడం మంచిది.  
వేసవి కాలంలో పెట్రోల్‌ ట్యాంకులో గ్యాస్‌ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బైక్‌ను పార్క్‌ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్‌ మూతను తెరచి మూయాలి.  
గాలి పట్టే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే టైర్ల మన్నిక తగ్గిపోతుంది. తద్వారా పెట్రోల్‌ ఎక్కువ ఖర్చయ్యే ప్రమాదం ఉంది.  
వేసవి కాలంలో ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం చేయడం తగ్గించుకుంటే మేలు. 
దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి, ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్‌ రెండింతలు వేడెక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంజిన్‌ కాసేపు ఆపుకుంటే వాహనం మన్నిక కాలం పెరుగుతుంది. నిర్ణీత  గడువులోపు ఇంజిన్‌ ఆయిల్‌ చెక్‌ చేసుకోవాలి. 

ఫుల్‌ ట్యాంక్‌ చేయించకూడదు  
ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. బైక్‌లకు ఫుల్‌ ట్యాంక్‌ చేయించడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది. రెండు లీటర్లు పెట్రోల్‌ వరకు వేయించుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. ఒక వేళ బైక్‌ ఎండలో పెట్టాల్సిన అవసరం ఏర్పడితే ఏదైనా పొడవాటి క్లాత్‌ను ట్యాంక్‌పై కప్పి ఉంచితే సరిపోతుంది. లేదంటే ఎండలకు ఆయిల్‌ ట్యాంకర్‌ హీటెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది. 
–అక్బర్, బైక్‌ మెకానిక్‌ 

ఎక్కువ దూరం ప్రయాణించొద్దు 
ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బైక్‌ ఆయిల్‌ ట్యాంకులు పేలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెట్రోల్‌ వేయించేటప్పుడు సెల్‌ఫోన్‌ మాట్లాడడం, బైక్‌ను ఎండలో ఉంచడం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్‌ను మధ్యాహ్నం సమయంలో నీడలో పార్కు చేయాలి. ఎండలో ఎక్కువ దూరం కూడా ప్రయాణించకపోవడం మంచిది.   
– త్రినాథరావు, మెకానిక్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top