
విశాఖపట్నం: ఏపీలోని ప్రతిష్టాత్మక ఏయూ(ఆంధ్రా యూనివర్శిటీ)లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఈడీ విద్యార్థి మణికంఠ మృతికి నిరసనగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం అస్వస్థతకు గురైన మణికంఠ.. సరైన వైద్యం అందక చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు.

ఏయూలో కనీసం వైద్య సదుపాయం అందకే విద్యార్థి చనిపోయాడని, అక్కడ ఆక్సిజన్ సదుపాయం కూడా లేకపోయిన కారణంగానే బీఈడీ విద్యార్థి మణికంఠ ప్రాణాలు కోల్పోయాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైస్ చాన్సలర్(వీసీ)ను చుట్టుముట్టి విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసుల్ని మోహరించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

