నవీన మోసాలపై అప్రమత్తం 

SS Rawat Comments That Alert on latest scams - Sakshi

నకిలీ చిట్‌ ఫండ్స్, డిజిటల్‌ లెండింగ్‌ మోసాలపై నిఘా ఉంచాలి 

ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలి 

మోసగాళ్లపై సకాలంలో  చర్యలు తీసుకోవాలి 

ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌ 

సాక్షి, అమరావతి: నకిలీ చిట్‌ ఫండ్‌ కంపెనీల మోసాలు, ఆన్‌లైన్‌ లెండింగ్‌ ప్లాట్‌ ఫారం మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌  సూచించారు. బుధవారం సచివాలయంలో జరిగిన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా 23వ రాష్ట్రస్థాయి కో–ఆర్డినేషన్‌ కమిటీ సమావేశానికి రావత్‌ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకూ ఆన్‌లైన్, నకిలీ చిట్‌ ఫండ్‌ కంపెనీలు, డిజిటల్‌ లెండింగ్‌ కంపెనీల మోసాలు అధికమవుతున్నాయని అన్నారు.

అలాంటి మోసాలను నియంత్రించేందుకు సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీలు సకాలంలో కేసులు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ విధమైన మోసాలపై వారికి పెద్దఎత్తున అవగాహన పెంపొందించాలని సూచించారు. అనేక రకాల కొత్త యాప్‌లు పుట్టుకొచ్చి ఆర్థికపరమైన మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. బిట్‌ కాయిన్, క్రిప్టో కరెన్సీ పేరిట పెద్దఎత్తున ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోకుండా జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈవి ధమైన  మోసాలను నియంత్రించేందుకు వివిధ కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటరీ అథారిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రీజనల్‌ డైరెక్టర్‌ కె.నిఖిల మాట్లాడుతూ..వివిధ ఆర్థిక పరమైన మోసాలు,  డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ ఫారమ్‌ మోసాలు, నకిలీ కంపెనీల మోసాలపై చర్చించి నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న అత్యున్నత బాడీ ఎస్‌ఎల్సీసీ ఉందని పేర్కొన్నారు.   ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ బాడీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వచ్చే త్రైమాసిక సమావేశాన్ని ఫిబ్రవరి ఆఖరి వారంలో నిర్వహించేలా చూడాలని సూచించారు.

రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జనరల్‌ మేనేజర్‌ వై.జయకుమార్‌ అజెండా అంశాలను వివరాలను సమావేశంలో చర్చకు పెట్టారు. వివిధ చిట్‌ ఫండ్‌ కంపెనీలు అగ్రిగోల్డ్, అక్షయ గోల్డు, హీరా గ్రూప్‌ తదితర మోసాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. అలాగే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వివిధ లోన్‌ యాప్‌ల ద్వారా వేధింపుల ఫిర్యాదులు, ముద్రా అగ్రికల్చర్‌–స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మల్టీ స్టేట్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ, వర్థన్‌ బ్యాంకు స్కాం తదితర సంస్థలపై మోసాలు ఇప్పటి వరకు నమోదైన కేసుల ప్రగతి తదితర అంశాలను  సమీక్షించారు. అదే విధంగా బానింగ్‌ ఆఫ్‌ అన్‌ రెగ్యులేటెడ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ (బడ్స్‌)చట్టం 2019పై చర్చించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, న్యాయశాఖ కార్యదర్శి సునీత, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో–ఆపరేటివ్స్‌ బాబు ఏ, సీఐడీ డిఐజీ సునీల్‌ కుమార్‌నాయక్‌ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top