హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్‌నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు.
ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడగా, 27 మంది ప్రాణాలతో బతికిబయటపడ్డారు. అయితే బస్సులు అగ్ని ప్రమాదాలకు గురైన సమయంలో అత్యధికంగా ప్రాణానష్టమే కన్పిస్తుంది. ప్రధానంగా ప్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందంటే ప్రాణనష్టం అనేది భారీగా ఉంటుంది. పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటనేది ఒక్కసారి చూస్తే..!
డ్రైవర్లకు అలసట.. నిద్రమత్తు
సుమారు 250 కిలోమీటర్ల నుంచి 1,000 కి.మీ దాటే వరకూ కూడా ఎక్కువగా ప్రయాణికులు స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లకు అలసట అనేది కీలకంగా మారుతుంది. డ్రైవర్లు అలసట బారిన పడి, నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో.. తాము డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తుకు లోనవుతున్నట్లు 25 శాతం మంది డ్రైవర్లు ఏడేళ్ల నాడు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు.
డిజైన్ సురక్షితమేనా?
స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డిజైన్ లోపం కూడా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. బస్సులో పడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, బస్సులో బెర్త్‌లు, సీట్ల మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సింగిల్ మనిషి మాత్రమే వెళ్లేలా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకర్ని తోసుకుంటూ ఇంకొకరు వెళ్లడం మరింత గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు కూడా కారణమయ్యే చాన్స్‌లు కూడా అత్యధికంగా అనేది నిపుణులు అభిప్రాయం.
సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఎత్తు కూడా మరొక సమస్య. వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను చేరడం కష్టంగా ఉంటుంది.
రెండు-మూడు నిమిషాల్లో బయట పడితేనే..
బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలా స్వల్ప సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెండు, మూడు నిమిషాల్లో తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారు. లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. స్లీపర్ బస్సులు సాధారంగా ఏసీ బస్సులే అధికంగా ఉంటాయి. ఏసీ బస్సుల్లో ప్రమాదం జరిగితే డోర్స్ ఓపెన్ కావడం కూడా కష్టమే. ఏమైనా అద్దాలు బ్రేక్ చేయాలంటే కూడా ఎంతో కొంత సమయం ఉండాలి. అంటే ఇక్కడ మేల్కొని ఉన్న ప్రయాణికులే ఎంతో కొంత ప్రతిఘటించి బయటకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఆ కంగారు, తొందరలో మిగతా వారిని నిద్ర లేపే చాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. నిద్ర నుంచి ప్రయాణికులు మేల్కొనే సరికి వారు ప్రమాదంలో చిక్కుకుని కొట్టుమిట్లాడుతున్న ఘటనలే మనకు తరచు కనిపిస్తూ ఉన్నాయి.

చైనాలో అందుకే నిషేధించారా?
చైనా స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు రక్షణ లేకపోవడం, సురక్షితంగా బయటపడే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులపై నిషేధం విధించగా, భారత్‌లో మాత్రం ఇంకా కఠిన చర్యలు తీసుకోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
కర్నూలు శివారులో ఘోరం..


