నీ ముక్కెర ... కాళ్ళ పట్టాలు కూడా మెరుస్తాయి లక్ష్మి | Special Story On Anakapalle District Nilabandha Village | Sakshi
Sakshi News home page

నీ ముక్కెర ... కాళ్ళ పట్టాలు కూడా మెరుస్తాయి లక్ష్మి

Feb 3 2025 2:59 PM | Updated on Feb 3 2025 3:09 PM

Special Story On Anakapalle District Nilabandha Village

స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత అనకాపల్లి జిల్లా కొండశిఖర గ్రామమైన నీలబంధకు ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం రావడంతో ఆనందంతో ఇంటి ముందు ధింసా నృత్యం చేసిన ఓ గిరిజన కుటుంబం.

చీకటిపడుతున్నవేళ చిన్నగా ఈలవేస్తూ.. లచ్మీ ఇదిగో.. మన పొలం కాడ గుమ్మిలో దొరికింది పట్టేశాను.. బుర్రా తోకలు పులిసెట్టు.. నడు మ్ముక్కలు ఇగురు చెయ్యవే.. అంటూ కళ్ళు కడుక్కోడానికి గోలేం కాడికి వెళ్ళాడు.. మత్స్య రాజు... తిక్కనా సన్నాసికి ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తాడు..ఈడి జిమ్మకు ఒకటి చాలదు .. రెండు రకాలుండాలి..  ఈ చీకట్లో ఇదేటి దరిద్రం.. సన్నగా గొణుక్కుంది లచ్మి  .. ఒసేయ్... ఇన్నావా.. వాటిని తియ్యు.. లేపోతే పిళ్లెత్తుకెళ్ళిపోద్ది.. అప్పుడు నీకు దరువులు పడతాయి అన్నాడు కొంటెగా..

ఈ రాత్తిరిపూట వాటిని పెరట్లోకి వెళ్లి రాయిమీద పొయ్యి బుగ్గేసి పామి.. కడిగి.. పులు సెట్టి ఈడీకి కూడెట్టాలి.. మొగుడిమీద ప్రేమగా విసుక్కుంది లచ్మి.. ఏందే  నీ సణుగుడు... కేకేశాడు.. రాజు.. ఈడీకి పనికొచ్చినముక్క చెప్తే ఒక్కటీ ఇనబడదు కానీ. ఇలాంటివి మాత్రం టక్కున చెవిలోపడతాయి.. సచ్చోనోడివి పాము చెవ్వులు.. అంటూనే వంటి పూర్తి చేసేసింది .. చీకట్లో సరిగ్గా చూసుకుని తిను.. లేపోతే ముల్లుదిగిపోద్ది.. జాగ్రత్త చెప్పింది.. పోన్లేయే.. ఇదొక్కటే చీకటి భోజనం.. ఎల్లుండినుంచి అదిగో.. అక్కడ కూకుని తిందాం.. నువ్వు నేను.. మన బుడ్డి  సాంబిగాడు అన్నాడు..

సీకట్లో కూకుని ఆ సెట్టుకింద తింతావా .. నువ్వేమైనా గబ్బిలానివా మామ.. అంటూ నవ్వింది లచ్చ్మి.. లేదే.. మనూరికి కరెంటొచ్చింది.. అదిగో మన గొర్రిల పాక పక్కనే స్థంభం వచ్చింది.. ఇక మనకు ప్రతోరోజూ.. పగలే... రేత్తిరి అనేది ఉండదు అన్నాడు.. రేత్తిరి లేకపోతే నువ్వు ఊరుకుంటావా మామ .. నర్మగర్భంగా పంచ్ వేసింది.. ఐనా కరెంటొస్తే మనకేటి మామ.. లాభం అంటూ డోకితో కాసింత పులుసు పోసింది..  అదేటి అలాగంటావు. కరెంటొస్తే ఊరికే కాదే మన బతుకుల్లోకి కూడా వెలుగొచ్చినట్లే అన్నాడు .. అదెలా అంది..చేప తలకాయ ను రాజు పళ్లెంలో వేస్తూ..

ఒసేయ్ లచ్చిమి.. కరెంట్ వచ్చిందనుకో.. మనం ఇంటికి ఒక కరెంట్ బుడ్డి వేసుకోవచ్చు.. మన  బుడ్డి గాడు మన ఇంట్లోనే పెట్టి మీద కూకుని సదూకుంటాడు.. మనం కొర్రలు... సామలు.. గట్రా ఇంట్లోనే మరాడించుకోవచ్చు.. కరెంట్ కుక్కర్ కొనుక్కోవచ్చు.. ఇక నువ్వు చీకటిపడ్డాక కూడా ఉడుకుడుగ్గా వండొచ్చు.. మనం కూడా వేడివేడిగా తిని.. అన్నాడు.. సాల్సాల్లే నీకు తిపారం ఎక్కువైంది.. అన్నది లచ్చ్మి . ఒసేయ్.. ఈ చీకట్లో కనబళ్ళేదు కానీ... కరెంట్ వచ్చాక.. ఆ వెల్తుర్లో నీ నత్తు .. కాళ్ళ పట్టీలు కూడా భలే మెరుస్తాయి లచ్చిమి అన్నాడు.. ఆమె చుబుకం మీద చెయ్యేస్తూ.. ఈడీకి పనికి వెళ్ళడానికి ఒల్లొంగదుకానీ ఇలాంటీటీకి మాత్రం రద్దీగా ఉంటాడు 

మురిపెంగా విసుక్కుంది లచ్చిమి.. ఒసేయ్ ఇంకెన్ని లాభాలున్నాయో తెలుసా.. మనఇంటి ముందు లైట్ ఉంటుంది కదా.. అక్కడే మనమంతా రాత్రి పూత కబుర్లు చెప్పుకుని పడుకోవచ్చు.. ఇక ఆముదం. కిరసనాయిలు దీపాలు అక్కర్లేదు.. చుట్టాలు వచ్చినా ఇక ఇంటిముందున్న రాళ్లు తన్నుకుని పడిపోయేది ఉండదు.. ఒసేయ్ లచ్మి కరెంట్ ఎల్తురులో నువ్ మరింత మెరిసిపోతావే అన్నాడు.. రాజు.. ఈడికిపోయేకాలం రాను.. అంటూ గిన్నెలు తీసి.. సర్లే.. అవతల పెయ్యి అరుస్తుంది దాన్ని పాకలో కట్టేసి రా.. అంటూ గదిమింది..

అనకాపల్లి జిల్లా గిరిశిఖర గ్రామం నీలబంధకు తొలిసారిగా కరెంట్ వచ్చింది.. ఈ సందర్భంగా ఓ గిరిజన కుటుంబంలో కలిగే మార్పులపై చిన్న కథ.. కథనం.. మీ కోసం... 
-- సిమ్మాదిరప్పన్న

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement