Fact Check: కళ్లుండీ కబోదిలా | Soil health card for every farmer at RBK level | Sakshi
Sakshi News home page

Fact Check: కళ్లుండీ కబోదిలా

Jun 21 2023 5:41 AM | Updated on Jun 21 2023 3:15 PM

Soil health card for every farmer at RBK level - Sakshi

సాక్షి, అమరావతి :తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సామూహిక భూసార పరీక్షలు నిర్వహిస్తోంది. ఆర్బీకే స్థాయిలో మట్టి నమూనాలను తీసుకుంటూ  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కచ్చితమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వాటి ఫలితాలను నేరుగా రైతుల మొబైల్‌కు పంపిస్తున్నారు. మరోవైపు ప్రతి రైతుకు భూసార కార్డు జారీకి శ్రీకారంచుట్టారు. కళ్లెదుట ఈ  వాస్తవాలు కనిపిస్తున్నప్పటికీ కళ్లుండీ కబోదిలా తయారైన రామోజీ వాస్తవాలకు ముసుగేసి బురద రాతలతో ప్రభుత్వంపై తన అక్కసును  వెళ్లగక్కుతున్నాడు. 

ఆరోపణ: గతంలో పెద్ద ఎత్తున పరీక్షలు..
వాస్తవం: భూసార పరీక్షలు పూర్వం గ్రిడ్‌ పద్ధతిలో జరిగేవి. 25 ఎకరాల విస్తీర్ణానికో మట్టి నమూనా తీసుకుని దాన్ని విశ్లేషించి గ్రామంలో ఉన్న ప్రతి  ఒక్కరికి అదే ఫలితాలతో కూడిన కార్డులిచ్చేవారు. ఇలా సేకరించిన మట్టి నమూనాలతో సంబంధం లేకుండా అశాస్త్రీయ పద్ధ­తుల్లో ఇష్టానుసారం  కార్డులు జారీ­చేశారు.

వీటివల్ల తమకు ఎలాంటి ప్రయో­జనం లేదని రైతులు వాపోయేవారు. తమ పొలాల్లో మట్టినమూనాలు సేకరించి విశ్లేషిస్తే..  ఎలాంటి లోపాలున్నాయో తెలుస్తుందిగానీ, గ్రామంలో ఏదో ఒక మూల నమూనా తీసి విశ్లేషిస్తే ప్రయోజనమేమిటంటూ ఆందోళన చెందేవారు. ఈ విధానంపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. 

ఆరోపణ: మూడేళ్లుగా భూసార పరీక్షలు  అటకెక్కించేశారు
వాస్తవం: 25 ఎకరాలకు ఒక నమూనా సేకరణపై రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2.5 ఎకరాలకు ఒక మట్టి నమూనా తీసుకొని శాస్త్రీయంగా విశ్లేషించాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు 2019–20లో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని పైలెట్‌ ప్రాజెక్టుగా మట్టి నమూనాల పరీక్షలకు శ్రీకారం చుట్టారు.

ఆ ఏడాది ఏకంగా 2.26 లక్షల మట్టినమూనాలను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషించి ఫలితాలను రైతులకు తెలియజేశారు. తదనుగుణంగా సూక్ష్మపోషకాలు అందించారు. పైలెట్‌ ప్రాజెక్టులో మెరుగైన ఫలితాలు రావడంతో 2020–21లో సామూహికంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంతలో కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడడంతో రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వాదేశాల మేరకు భూసార పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. 

ఆరోపణ: పరికరాలు, సిబ్బంది కొరత..
వాస్తవం: కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మేరకు 2023–24లో ప్రతి గ్రామంలో ప్రతి రైతుక్షేత్రంలో మట్టినమూనాలు సేకరించి, విశ్లేషించడమే కాకుండా.. ప్రతి రైతుకు భూసార కార్డు జారీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రైతులను భాగస్వాములను చేస్తూ మూడేళ్లలో 25 లక్షల నమూనాలు పరీక్షించి 25 లక్షల మందికి భూసార కార్డుల జారీ లక్ష్యంతో సామూహిక భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను కూడా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఉన్న భూసార పరీక్ష కేంద్రాలను ఆధునికీకరించారు. అవసరమైన పరికరాలను సమకూర్చారు. సిబ్బందిని నియమించారు.

ఆరోపణ: సాగు మొదలయ్యాక నమూనాల సేకరణ?
వాస్తవం: 2023–24 సీజన్‌లో రూ.19.82 కోట్ల అంచనా వ్యయంతో 6,37,453 మట్టి నమూనాలు విశ్లేషించి రైతులకు భూసార కార్డులివ్వాలని నిర్ణయించారు. ఆర్బీకే స్థాయిలో అధికారులకు విడతల వారీగా శిక్షణ కూడా ఇచ్చారు. మట్టి నమూనాల సేకరణ కోసం ఏప్రిల్‌లో భూసార వారోత్సవాలు నిర్వహించారు. ఏప్రిల్, మే నెలల్లో మట్టినమూనాలు సేకరించారు.

ఆరోపణ: అంతా మొక్కుబడిగా..
వాస్తవం: వారోత్సవాల్లో 2.60 లక్షల మట్టి నమూనాలను రైతుల సమక్షంలోనే మొబైల్‌ యాప్‌ ద్వారా జియో కో ఆర్డినేట్‌లను పొందుపరిచి మరీ సేకరించారు. క్యూఆర్‌ కోడ్‌ టెక్నాలజీని ఉపయోగించి సేకరించిన మట్టి నమూనాల స్థితిని అక్కడికక్కడే తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. కచ్చితమైన జియో కో ఆర్డినేట్‌లను నమోదు చేయడం ద్వారా మట్టి నమూనాలు ఎక్కడ నుంచి సేకరించారో రాష్ట్ర మ్యాప్‌ ద్వారా స్పష్టంగా తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. నేల ఆరోగ్యస్థితిని తెలుసుకునేందుకు వీలుగా సాయిల్‌ ఫెర్టిలిటీ మ్యాప్‌లను రూపొందించారు. ఫలితాలను మొబైల్‌ యాప్‌ ద్వారా రైతులకు అందిస్తున్నారు. జియో కో ఆర్డినేట్స్‌తో రైతుల వారీగా భూసార పరీక్ష ఫలితాలను సాయిల్‌ హెల్త్‌కార్డ్‌ పోర్టల్‌లో కూడా పొందుపరుస్తున్నారు. 

ఆరోపణ: సున్నా నుంచి మొదలు పెట్టా ల్సిందే?
వాస్తవం: మట్టి నమూనాలను సేకరించడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రతి సీజన్‌లో ఖరీఫ్‌–రబీ పంటకాలాలకు ముందు సామూహికంగా మట్టి నమూనాలను సేకరించి భూసార కేంద్రాల్లో విశ్లేషించి కనీసం మూడేళ్లపాటు వర్తించేలా రైతులకు భూసార కార్డులను జారీచేయాలని నిర్ణయించారు. ఈ ఫలితాలు ఆధారంగా.. రసాయనిక ఎరువుల అనవసర, విచక్షణారహిత వినియోగానికి అడ్డుకట్ట వేయడం ద్వారా పెట్టుబడి ఖర్చు తగ్గించి, నాణ్యమైన పంట దిగుబడి పెంచేలా ఆర్బీకేల ద్వారా అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement