ఫోర్‌ స్టార్‌ నగరాలుగా విశాఖ, బెజవాడ

SmartCity 2020 Ranks Released By Central Govt - Sakshi

స్మార్ట్‌ సిటీ–2020 ర్యాంకులు విడుదల చేసిన కేంద్రం 

మూడు అంశాల్లో విశాఖకు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

ఐదు అవార్డులు అందుకున్న తిరుపతి

సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం/తిరుపతి తుడా: స్మార్ట్‌ సిటీల్లో విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ దక్కింది. క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం నుంచి ఈ రెండు నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 120 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఇందులో రాష్ట్రం నుంచి విశాఖపట్నం, విజయవాడ నగరాలకు ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ దక్కింది. పట్టణ ప్రణాళిక, జీవ వైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్‌ బిల్డింగ్, ఎయిర్‌ క్వాలిటీ, వాటర్‌ మేనేజ్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై 2019–2020 నుంచి ర్యాంకింగ్స్‌ ఇస్తున్నారు. 

తిరునగరికి ఐదు అవార్డులు
స్మార్ట్‌ తిరుపతి జాతీయ స్థాయిలో కీర్తి పతాకాన్ని ఎగురవేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్, లివింగ్‌ సిటీ, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌లో తిరుపతి నగరానికి జాతీయ గుర్తింపు లభించింది. సోషల్‌ యాస్పెక్ట్‌లో తిరుపతి తొలి స్థానం దక్కించుకుంది. అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో మూడో స్థానంలో నిలిచింది. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తి విభాగంలో ఈ స్థానం దక్కింది. శానిటేషన్‌ విభాగంలో ఇండోర్‌తో కలిపి తిరుపతి తొలి స్థానంలో నిలిచింది. ఎకానమీ అంశంలో బూస్ట్‌ లోకల్‌ ఐడెంటిటీ, డిజైన్‌ స్టూడియోలో ఎకానమీ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. సిటీల విభాగంలో రెండో రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. తిరుపతి నగరం మొత్తం ఐదు జాతీయ అవార్డులను దక్కించుకున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్‌ పి.ఎస్‌.గిరీష, మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ వెల్లడించారు. 

కాకినాడ, అమరావతి ఇలా..
డాటా మెచ్యూరిటీ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌ వర్క్‌ సైకిల్‌–2 డ్యాష్‌బోర్డు ఫలితాల ప్రకారం 80 పాయింట్లకు గానూ 56 పాయింట్లతో 14 వ స్థానంలో విశాఖపట్నం, 53 పాయింట్లతో కాకినాడ 19వ స్థానంలో, 41 పాయింట్లతో 27వ స్థానంలో అమరావతి, 14 పాయింట్లతో 84వ స్థానంలో తిరుపతి నిలిచాయి. 

అర్బన్‌ ప్లానింగ్, గ్రీన్‌ కవర్‌లో విశాఖకు ‘ఫైవ్‌స్టార్‌’
అర్బన్‌ ప్లానింగ్, గ్రీన్‌ కవర్‌ అండ్‌ బయో డైవర్సిటీ విభాగంలో దేశవ్యాప్తంగా కేవలం 3 నగరాలకు మాత్రమే ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఇందులోనూ విశాఖపట్నం సత్తా చాటింది. ఇండోర్, సూరత్‌తో కలిసి వైజాగ్‌ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలోనూ విశాఖ సత్తా చాటింది. ఈ విభాగంలోనూ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సొంతం చేసుకుంది. ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ విభాగంలో త్రీ స్టార్‌ రేటింగ్‌ని విశాఖ దక్కించుకుంది. మొబిలిటీ అండ్‌ ఎయిర్‌ క్వాలిటీ విభాగంలోనూ త్రీ స్టార్‌ రేటింగ్‌ సాధించింది. మురుగు నీటి నిర్వహణ విభాగంలో త్రీ స్టార్‌ రేటింగ్‌లో నిలిచింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top