సమృద్ధిగా ఎరువులు

Senior officers to supervise fertilizer distribution - Sakshi

రబీలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు

ఫిబ్రవరికి 3,72,104 ఎంటీలు అవసరం కాగా,  అందుబాటులో 5,14,160 ఎంటీలు

రాష్ట్రానికి అదనంగా 49,736 మెట్రిక్‌ టన్నుల ఇంపోర్టెడ్‌ యూరియా

సీఎం జగన్‌ అభ్యర్థన మేరకు రాష్ట్రానికి కేటాయించిన కేంద్రం

గంగవరం, కాకినాడ పోర్టులకు చేరుకున్న నౌకలు

రెండ్రోజుల్లో జిల్లాలకు సరఫరా

ఎరువుల పంపిణీ పర్యవేక్షణకు సీనియర్‌ అధికారులు

సాక్షి, అమరావతి: రబీ సాగు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 80 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఖరీఫ్‌లోలానే రబీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంది. సమృద్ధిగా ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచింది. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ద్వారా పారదర్శకంగా పంపిణీ చేపట్టింది. కొన్ని జిల్లాల్లో ఎరువుల్లేవంటూ వస్తున్న వార్తలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరం మేరకు ఎరువులు ఉన్నాయని, ఆందోళన వద్దని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎరువుల నిల్వలు, అమ్మకాలపై మంగళవారం ప్రకటన చేసింది. 

ఆర్బీకేల ద్వారా 1.50 లక్షల ఎంటీల విక్రయం 
2021–22 రబీ సీజన్‌ కోసం 23.44 లక్షల ఎంటీల ఎరువులు అవసరం కాగా, అక్టోబర్‌ నాటికి 6.97 లక్షల ఎంటీల నిల్వలున్నాయి. అదనంగా జనవరి 31 నాటికి రాష్ట్రానికి 11.94 లక్షల ఎంటీలు కేంద్రం  కేటాయించింది. మొత్తం 18.91 లక్షల ఎంటీలు అందుబాటులో ఉండగా, అక్టోబర్‌ నుంచి జనవరి 31 వరకు 13.77 లక్షల ఎంటీల విక్రయాలు జరిగాయి. రబీ సీజన్‌లో ఆర్బీకేలకు 1.95 లక్షల ఎంటీల ఎరువుల సరఫరా లక్ష్యం కాగా ఇప్పటికే 1.80 లక్షల ఎంటీలు సరఫరా చేశారు. ఇప్పటివరకు ఆర్బీకేల ద్వారా 1.50 లక్షల ఎంటీల విక్రయాలు జరిగాయి. మరో 30 వేల ఎంటీలు ఆర్బీకేల్లో అందుబాటులో ఉన్నాయి. 

రాష్ట్రంలో 5.14లక్షల టన్నుల ఎరువు నిల్వలు 
ఫిబ్రవరి నెలకు రాష్ట్రంలో 3,72,104 ఎంటీల ఎరువులు అవసరం కాగా, ప్రస్తుతం సుమారు 5,14,160 ఎంటీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో.. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఎరువుల సరఫరా, పంపిణీ పర్యవేక్షణకు జిల్లాకు ఓ సీనియర్‌ అధికారిని నియమించింది. 

సీఎం జగన్‌ అభ్యర్థన మేరకు 
కేంద్రం రాష్ట్రానికి 49,736 మెట్రిక్‌ టన్నుల ఇంపోర్టెడ్‌ యూరియాను కేటాయించింది. ఈ యూరియా రెండు నౌకల్లో కాకినాడ, గంగవరం పోర్టులకు చేరుకుంది. దీనిని ఒకట్రెండు రోజుల్లో డిమాండ్‌ ఎక్కువగా ఉన్న  జిల్లాలకు సరఫరా చేస్తారు. 

ఎరువుల కొరత లేదు 
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. రబీ సీజన్‌లో ఏ ఒక్క రైతుకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థన మేరకు కేంద్రం రాష్ట్రానికి యూరియా కేటాయించింది. దీనిని జిల్లాలకు సరఫరా చేస్తాం. 
–కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top