సస్యశ్యామలం.. సిరుల పంటలకు సంగం బ్యారేజీ సిద్ధం

Sangam Barrage In PSR Nellore District To Be Opened - Sakshi

135 ఏళ్ల ఆనకట్ట.. లక్షల ఎకరాల ఆయకట్టు

బ్యారేజీతో రైతు కలలు సాకారం

గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణం పూర్తిచేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం

సీఎం చేతుల మీదుగా త్వరలో జాతికి అంకితం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన సంగం బ్యారేజీ చివరి దశ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పెన్నా డెల్టాకు జీవనాడిగా అభివర్ణించే ఈ బ్యారేజీ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి.. ఈ సీజన్‌లోనే ప్రారంభించేందుకు జలవనరులశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంగం వద్ద పెన్నానదిపై 1882–86 మధ్య బ్రిటిష్‌ సర్కార్‌ బ్యారేజీ నిర్మించింది. ఈ బ్యారేజీ ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లందుతాయి. బ్యారేజీ శిథిలావస్థకు చేరుకోవడంతో నీటినిల్వ సామర్థ్యం కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. జలయజ్ఞంలో భాగంగా కొత్త బ్యారేజీకి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. బ్యారేజీ పనులు చేయడంలో టీడీపీ సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక సంగం బ్యారేజీని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపట్టిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో జాతికి అంకితం చేయనున్నారు. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రైతుల కలల బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. బీడు భూముల్లో సిరుల పంటలు పండనున్నాయి. ఐదున్నర లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు యోగ్యకరం కానుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంకరార్పణ చేస్తే, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణ పనులు పూర్తిచేశారు. శిథిలావస్థలో ఉన్న 135 ఏళ్ల నాటి ఆనకట్ట కమ్‌ బ్యారేజీ సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంది. త్వరలో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది.

బ్రీటీష్‌ కాలంలో సింహపురి ప్రాంత అన్నదాతల కోసం నిర్మించిన సంగం బ్యారేజ్‌ శిథిలావస్థకు చేరుకుంది. సాగునీటి కోసం అన్నదాతలు, తాగునీటి కోసం నెల్లూరు ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో 1999లో అప్పటి ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంగం బ్యారేజీ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. సంగం బ్యారేజీ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చలనం లేకపోయింది. రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా ప్రతిపక్షనేత హోదాలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంగం పర్యటించారు. అన్నదాతల అభ్యర్థన మేరకు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే సంగం వద్ద పెన్నానదిలో నూతన బ్యారేజ్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మాట తప్పని, మడమ తిప్పని దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ.122.50 కోట్ల వ్యయంతో 2006లో నూతన బ్యారేజ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైఎస్సార్‌ అకాల మరణంతో బ్యారేజీ పనులు నత్తనడకన సాగాయి. 


బ్యారేజ్‌పై రాకపోకల కోసం ఏర్పాట్లు   

నిర్మాణం పూర్తి 
సంగం నూతన బ్యారేజ్‌ నిర్మాణ పనులను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిచేసింది. 1,195 మీటర్ల పొడవుతో పెన్నానదిలో బ్యారేజ్‌ నిర్మాణం చేపట్టారు. ఈ బ్యారేజ్‌కి 85 గేట్లు ఏర్పాటుచేసి వాటి నిర్వహణకు మోటార్లు సైతం ఏర్పాటు చేశారు. బ్యారేజ్‌ నుంచి కుడివైపు కనుపూరు కాలువ, నెల్లూరు చెరువుకు నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు, ఎడమ వైపు కనిగిరి రిజర్వాయర్, బెజవాడ పాపిరెడ్డి కాలువలకు నీటిని విడుదల చేసే నిర్మాణాలు పూర్తయ్యాయి. సంగం పాత ఆనకట్ట జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే నూతన బ్యారేజ్‌ నిర్మాణం వల్ల జిల్లాలో 5.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి దూరదృష్టి అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

నిధుల వృథాకు చెక్‌ 
పాత ఆనకట్ట వల్ల కనుపూరు కాలువ, బెజవాడ పాపిరెడ్డి కాలువకు నీరు అందించేందుకు ప్రతి సంవత్సరం రూ.50 లక్షలకు పైగా నిధులతో ఇసుక బస్తాలు ఏర్పాటుచేసి నీరు అందించేవారు. నూతన బ్యారేజ్‌ నిర్మాణం వల్ల ఇసుక బస్తాలతో పనిలేకపోవడంతో ప్రతి సంవత్సరం రూ.50లక్షలకు పైగా ప్రజాధనం వృథా కాకుండా నిలిచిపోతుంది. పైగా సంగం బ్యారేజ్‌ వద్ద 0.45 టీఎంసీల నీరు నిల్వ ఉండనుంది. మరోవైపు భూగర్భజలాలు పెరిగి నీరు మోటార్లకు సైతం అందుతుందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

రాకపోకల సమస్యకు బ్రేక్‌ 
నిత్యం సంగం పాత బ్యారేజ్‌ పైన రాకపోకలు స్తంభించేవి. ప్రజలకు తీవ్ర అసౌకర్యాలు ఉండేది. త్వరలో ఈ సమస్య తీరిపోనుంది. నూతన బ్యారేజ్‌ మీద రాకపోకల కోసం 7.5 మీటర్ల వెడల్పుతో 1,195 మీటర్ల పొడవున రోడ్డు నిర్మించారు. రెండు వైపులా వాహనాలు తిరిగే వీలు ఏర్పడింది. పాదచారులు నడిచేందుకు వీలుగా 1.5 మీటర్ల నడక దారిని సైతం నిర్మించారు. సంగం నుంచి పొదలకూరు, చేజర్ల, రాపూరు, వెంకటగిరి మండలాలకు రాకపోకలు సౌకర్యం మెరుగుపడుతుంది.  

ఆనందంలో అన్నదాతలు 
కలలు కార్యరూపం దాల్చడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి, పనులు పూర్తిచేసిన ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నూతన బ్యారేజ్‌కు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం జగన్‌మోహన్‌రెడ్డి మంచితనానికి నిలువెత్తు నిదర్శనమని అన్నదాతలు, ప్రజలు హర్షాతిరేకాల మధ్య చెబుతున్నారు. 

అపర భగీరథుడు డాక్టర్‌ వైఎస్సార్‌  
సంగం బ్యారేజ్‌ స్థానంలో నూతన బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అపర భగీరథుడు. అన్నదాతల కష్టాలు తెలిసిన నేత నూతన బ్యారేజ్‌తో సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. సాగునీరు పొందిన ప్రతి రైతు ఆ మహానుభావుడి పేరును చిరకాలం గుర్తుంచుకుంటారు. 
– పులగం శంకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌

తండ్రికి మించిన తనయుడు  
తండ్రి శంకుస్థాపన చేసిన సంగం నూతన బ్యారేజ్‌ను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలతో పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రికి మించిన తనయుడు. అన్నదాతల కష్టాలు తీర్చిన తండ్రి, తనయులను ఎప్పుడూ గుర్తించుకుంటారు. 
– కంటాబత్తిన రఘునాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు

గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం  
సంగం నూతన బ్యారేజ్‌కి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టడం శుభపరిణామం. దీని ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను నమ్ముకున్న వారికి ఎంతటి మర్యాదనిస్తారో తెలియచెప్పారు. అంతేకాకుండా తన దగ్గరి వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటారనే విషయం మరోమారు రుజువైంది.  
– ముడి మల్లికార్జునరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, మర్రిపాడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top