కలలో కూడా ఊహించలేదు

Sakshi Interview With Deputy CM Dharmana Krishna Das

ఉప ముఖ్యమంత్రి పదవి రావడం సిక్కోలు, ఉత్తరాంధ్రకు దక్కిన గౌరవం

పార్టీ కోసం చేసే ప్రతి త్యాగం మనకు ప్లస్స

నిజాయితీ, నిబద్ధతతో ముందుకెళ్తే గుర్తింపు గ్యారంటీ 

నాపై నమ్మకం, భరోసా ఉంచిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞుడిని

జిల్లాకు, రాష్ట్రానికి మేలు జరిగేలా పనిచేస్తా

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌   

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఉప ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఏనాడూ పదవుల్ని ఆశించలేదు. కానీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే కచ్చితంగా ఒక మంచి రోజు వస్తుందని భావించే వ్యక్తిని. పార్టీ కోసం మనం చేసే ప్రతి త్యాగం కౌంట్‌ అవుతుంది. వాటికి మన విశ్వసనీయత, విధేయత, నిజాయితీ, నిబద్ధత తోడైతే అదనపు బలం. నాకు ఈ పదవి వచ్చిందంటే ఇవన్నీ దోహదపడ్డాయని భావిస్తున్నాను. కీలకమైన రెవెన్యూ, స్టాంపుల శాఖ బాధ్యతలు త్వరలోనే స్వీకరించనున్నాను. ఉప ముఖ్యమంత్రిగా నాకు దక్కిన గౌరవం శ్రీకాకుళానికి, ఉత్తరాంధ్రకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. కొత్త జిల్లాల విభజన, మూడు రాజధానుల ఏర్పాటు పూర్తయిన తర్వాత అన్ని ప్రాంతాలకు అభివృద్ధి, వికేంద్రీకరణ ఫలాలు సమానంగా అందుతాయ’ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తన మనసులోని భావాలను ‘సాక్షి’ ముందు ఉంచారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ‘సాక్షి’కి తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు.  

సాక్షి : డిప్యూటీ సీఎం కావడాన్ని ఎలా ఫీలవుతున్నారు?  
కృష్ణదాస్‌ : ఎమ్మెల్యేగా 2004లో మొదలైన నా ప్రజా జీవితం ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరింది. అప్పుడు నా అవసరం ఉందని నాకు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి రాజకీయ అరంగేట్రం చేయించిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిని చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాను. నేను, నా కుటుంబం చివరి శ్వాస వరకూ ఆయన వెంటే నడుస్తాం. జిల్లా ప్రజలు, నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారితోపాటు నేను కూడా. కృష్ణదాస్‌ ఏనాడూ పదవి ఆశించలేదు. అయినా వ్యక్తిత్వాన్ని గౌరవించి, నా మనసు గుర్తించి నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లారు. అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి అభిమానంతోనే నాకీ ఉన్నతమైన పదవి లభించింది.  

సాక్షి :  మీకే ఆ పదవి ఇవ్వాలని జగన్‌మోహన్‌రెడ్డికి ఎందుకు అనిపించింది?  
కృష్ణదాస్‌ : పార్టీకి నమ్మకంగా పనిచేసే వారికి కచ్చితంగా ఒక మంచి రోజు వస్తుంది. కొంచెం ముందో.. తర్వాత కచ్చితంగా ఉన్నతమైన స్థాయి దక్కుతుంది. పార్టీ కోసం మనం ఏం త్యాగం చేసామన్నది కూడా కౌంట్‌ అవుతుంది. వీటికి తోడు విధేయత, విశ్వసనీయత, నమ్మకం, భరోసా, నిజాయితీ ఇవన్నీ అదనపు అర్హత లు. అవన్నీ నాలో ఉన్నాయని నేను భావిస్తున్నా. ఆయ న కూడా నాలో ఇవన్నీ చూసి ఉంటారు. అందుకే నాకీ స్థానం, స్థాయి కల్పించారని భావిస్తున్నాను.  

సాక్షి : రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మీరు సంతృప్తి చెందారా? 
కృష్ణదాస్‌:  సరిగ్గా ఏడాది కాలమవుతుంది. జిల్లాలో అత్యధి క మెజార్టీతో గెలవడం, మంత్రిగా ప్రమాణం చేయ డం, అతి ముఖ్యమైన రోడ్లు, భవనాల శాఖ నాకు అప్పగించడం చకాచకా జరిగిపోయాయి. ఐదేళ్లలో రూ. 6వేల కోట్లతో నా శాఖకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం. అవన్నీ ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాకు సంబంధించి నా శాఖ పరిధిలో రూ. 300 కోట్ల వరకు పనులు చేసేందుకు వచ్చే ఏడాదిని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అవన్నీ టెండర్ల ప్రక్రియ దశలో ఉన్నాయి. శాఖను సమర్థంగా నడిపించామనే సంతృప్తి ఉంది.  

సాక్షి : కొత్తగా నిర్వహించబోయే రెవెన్యూ శాఖపై మీ అభిప్రాయం ఏమిటి?  
కృష్ణదాస్‌: రాష్ట్రాభివృద్ధిలో రెవెన్యూ శాఖదే కీలకం. అన్ని మంత్రిత్వ శాఖల కంటే ఇది చాలెంజింగ్‌ జాబ్‌. పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను. జగన్‌ గారి ప్రతిష్ట , ప్రభు త్వం గౌరవం పెంచేలా పనిచేస్తాను. మిగిలిన వాళ్ల కంటే దాసన్నే గొప్పగా పనిచేశారనుకునేలా శాఖను నిర్వహిస్తా. నిజంగా ఇదొక చాలెంజ్‌. రెవెన్యూ మంత్రిగా కృష్ణదాసే మంచి చాయిస్‌ అనేలా పనిచేస్తాను. శాఖలో ఉన్న సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాను.  

సాక్షి : చాలెంజ్‌గా తీసుకోబోయే అంశాలు ఏమిటి?  
కృష్ణదాస్‌ : ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటి కి నూరు శాతం అమలు చేయాలి. కొత్త జిల్లాల ఏర్పా టు అనేది ఇప్పుడు మా ముందు ఉన్న పెద్ద టాస్క్‌. 2017లోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై మా పార్టీ ఒక నిర్ణయం ప్రకటించి మేనిఫెస్టోలో చేర్చింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది లక్ష్యం. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇంకా పేదలందరికీ ఇళ్ల అంశంలో మా శాఖ కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇంకా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను కూడా నా పరిధిలో వస్తుంది. రాష్ట్ర రెవెన్యూలో ఈ శాఖ వాటాయే ఎక్కువ. ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తా. ఈ శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా పనిచేస్తాం.  

సాక్షి : కీలకమైన ఈ పోస్టు రావడంపై మీ అభిప్రాయం? 
కృష్ణదాస్‌ : రాజకీయాల్లో శిఖరాలకు చేరాలంటే మూడు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. అందులో ఒకటి విశ్వసనీయత, రెండు నిజాయితీ, మూడు నిబద్ధత. అవే నాకు ఈ పదవి రావడానికి దోహదపడ్డాయని నమ్ముతున్నా. ఒక నాయకుడికి మన మీద నమ్మకం ఉండటమే విశ్వసనీయత. అది మనపై ప్రజలు కూడా ఉంచాలి. మనకిచ్చిన పనిని పూర్తి చేయడం నిబద్ధత. కలలో కూడా నేను ఉపముఖ్యమంత్రిని అవుతానని ఊహించలేదు. జగన్‌మోహన్‌రెడ్డి నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను.  

సాక్షి : రెవెన్యూ మంత్రిగా జిల్లా కోసం మీరేం చేస్తారు ? 
కృష్ణదాస్‌ : శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేసి, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రా జెక్టు వంశధారను చూడాలని ఉంది. ఇప్పటికీ అక్కడ భూసేకరణతో సహా రెవెన్యూ పరిధిలో చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్న అడ్డంకులను తొలగించి త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేస్తాము. కీలకమైన భావనపాడు పోర్టు నిర్మాణంలో ఏ ఒక్కరూ నష్టపోకుండా చూడాలి. ఏ ప్రాజెక్టుకైనా భూసేకరణ ఇతర వ్యవహారాలు రెవెన్యూ పరిధిలోకి వస్తాయి. భూమిని ఇచ్చే వారు ప్రభుత్వం ఇచ్చే పరిహారం చూసి సంతోషంగా, స్వచ్ఛందంగా ఇచ్చేలా వ్యవస్థను రూపొందిస్తాం.  

సాక్షి : స్పీకర్, డిప్యూటీ సీఎం, మరొక మంత్రి పదవి శ్రీకాకుళం జిల్లాకే ఇవ్వడంపై మీ కామెంట్‌? 
కృష్ణదాస్‌ : 80శాతానికి పైగా బీసీలు ఉన్న జిల్లా మనది. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన జిల్లాగా పేరు పడ్డది.  అలాంటి జిల్లాకు ఇంతటి ముఖ్యమైన, గౌరవ ప్రదమైన పదవులు రావడం నిజంగా శ్రీకాకుళం జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలి. కీలకమైన పదవుల్లో ఉన్న మేమంతా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి మా శాఖలు దోహదపడతాయి.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top