ఇన్‌పుట్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వ ధనానికి కన్నం
ఫేక్ కంపెనీలతో నకిలీ ఇన్‌వాయిస్‌ల సృష్టి
ఇన్‌పుట్ ట్యాక్స్‌కు దరఖాస్తు చేస్తున్న ఆర్థిక నేరగాళ్లు
పరిశీలించకుండానే క్రెడిట్‌ను జమ చేస్తున్న అధికారులు
తాపీగా దర్యాప్తునకు కదులుతున్న యంత్రాంగం
విశాఖ డివిజన్‌లో అక్రమాలు రూ.352 కోట్లు
సాక్షి,విశాఖపట్నం: నిజానికి అక్కడ ఎలాంటి వ్యాపారం జరగదు. ఏ వస్తువూ కొనుగోలు చేయరు. కానీ, కాగితాల మీద భారీ లావాదేవీలు జరిగినట్లు నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టిస్తారు. ఈ బిల్లులను చూపిస్తూ, తాము ఇప్పటికే ప్రభుత్వానికి పన్ను చెల్లించేశామని, ఆ మొత్తాన్ని ‘ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్’ రూపంలో తిరిగి తమకు చెల్లించాలని జీఎస్టీ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించాల్సిన అధికారులు.. ఆ ఫేక్ ఇన్‌వాయిస్‌లనే ధ్రువీకరించి, కోట్లాది రూపాయల క్రెడిట్‌ను నేరగాళ్ల నకిలీ ఖాతాల్లోకి జమ చేసేస్తున్నారు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో వరుసగా ఇలాంటి దోపిడీదారులు పట్టుబడుతున్నా.. ఈ అడ్డగోలు వ్యవహారానికి అడ్డుకట్ట పడటం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు రూ.352 కోట్ల మేర ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసాలు జరగ్గా.. ఇప్పటివరకూ పది మంది నిందితులను డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీలు ఈ దందాలో భాగస్వాములైనట్లు దర్యాప్తులో తేలింది.
వెలుగుచూసిన ఉదంతాలు ఇవే..
⇒ శ్రీ ప్రోగ్రెసివ్ ప్రాజెక్ట్స్ పేరుతో నకిలీ సంస్థల నెట్‌వర్క్ ఏర్పాటు చేసి.. ఫేక్ ఇన్‌వాయిస్‌లతో రూ.9.62కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన ఓ ముఠాను ఈ నెల 2న డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
⇒ తన సోదరుడి సంస్థను అడ్డం పెట్టుకొని నకిలీ రసీదులతో రూ.19.79 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కొట్టేసిన ఎలియాజ్ భాషా అనే వ్యక్తిని డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
⇒ తమిళనాడుకు చెందిన సిద్ధిక్ సయ్యద్.. దక్షిణాది రాష్ట్రాల్లో కొందరి గుర్తింపు కార్డులను దొంగిలించి, వారి పేర్లతో 302 ఫేక్ కంపెనీలు సృష్టించాడు. ఏకంగా రూ.643 కోట్లకు ఫేక్ ఇన్‌వాయిస్‌లు తయారు చేసి, రూ.115.88 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ దోచుకున్నాడు. ఎట్టకేలకు అతన్ని గతేడాది మేలో డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
నేరగాళ్ల అసలు వ్యూహాలు ఇవే!
మ్యూల్ అకౌంట్స్: నేరగాళ్లు ఎన్నడూ తమ సొంత పేర్లతో కంపెనీలు పెట్టరు. నిరుపేదలు, కూలీలు లేదా అమాయకుల ఆధార్, పాన్ కార్డులను తక్కువ ధరకు సేకరించి, వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు పొందుతారు. స్కామ్ బయటపడ్డాక పోలీసులు వెళ్తే, ఆ అడ్రస్‌లో ఉండేది ఏమీ తెలియని సామాన్యులే. దీని వల్ల అసలు సూత్రధారులు దొరకడం కష్టమవుతోంది.
సర్క్యులర్ ట్రేడింగ్: ఇదొక గొలుసుకట్టు మోసం. ఒక పేరుతో కంపెనీ పెట్టి, కాగితం మీద ఉన్న మరో కంపెనీకి వస్తువులు అమ్మినట్లు చూపిస్తారు. ఆ కంపెనీ నుంచి మరో నకిలీ కంపెనీకి బిల్లు మారుతుంది. ఎక్కడా వస్తువు కదలదు కానీ, ప్రతి దశలోనూ ‘ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్’ను క్లెయిమ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని లాగేస్తుంటారు.
ఐటీ రిటర్న్స్‌లో లొసుగులు
జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు జీఎస్టీఆర్–2ఏ(కొనుగోళ్లు), జీఎస్టీఆర్–3బీ (చెల్లింపులు) మధ్య ఉండే వ్యత్యాసాలను అధికారులు ఎప్పటికప్పుడు సరిచూడాలి. అయితే, డేటా భారీ స్థాయిలో ఉండటం, చిన్న కంపెనీల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వీరికి వరంగా మారుతోంది. ఇదే అదనుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు.
షెల్ కంపెనీల మాయాజాలం:
విశాఖలో పట్టుబడిన చాలా కంపెనీల చిరునామాలు.. ఒకే గదిలో పది కంపెనీలు ఉన్నట్లు లేదా అసలు ఉనికిలోనే లేని అపార్ట్‌మెంట్ నంబర్లతో ఉన్నట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇన్‌స్పెక్టర్లు.. కార్యాలయంలోనే కూర్చుని అన్నీ సవ్యంగా ఉన్నాయి అని నివేదికలు ఇవ్వడం వల్లే ఈ రూ.352 కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డేటా అనలిటిక్స్ సాయంతోనే గుట్టు రట్టు!
ఇటీవల డీజీజీఐ పట్టుకున్న కేసులన్నీ డేటా అనలిటిక్స్ సాంకేతికత ద్వారానే సాధ్యమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ సాంకేతికత ద్వారా భారీ మొత్తంలో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, అందులోని అసాధారణ మార్పులను లేదా అనుమానాస్పద లావాదేవీలను క్షణాల్లో గుర్తిస్తారు. ముఖ్యంగా డీజీజీఐ వాడుతున్న అద్వైత్ వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా.. ఒకే పాన్ కార్డుతో ఎన్ని కంపెనీలున్నాయి? ఒకే అడ్రస్‌తో ఎన్ని రిజి్రస్టేషన్లు అయ్యాయి? కొనుగోలు, అమ్మకాల మధ్య పొంతన ఉందా? అన్నది ఇట్టే పసిగట్టవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాయంతో నెట్‌వర్క్ డయాగ్రమ్స్ సృష్టించి.. ఒక నకిలీ కంపెనీ నుంచి మరో కంపెనీకి నిధులు ఎలా మళ్లుతున్నాయో లింక్ అనలిటిక్స్ ద్వారా గుర్తిస్తూ నేరగాళ్ల గుట్టు రట్టు చేస్తున్నారు.
ముందుగా ఎందుకు గుర్తించరు?
ఇంత అధునాతన సాంకేతికత అందుబాటులో ఉన్నా.. రూ.352 కోట్ల మోసాలు ఎలా జరిగాయన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు ఉనికిలో లేని దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీలు కోట్లు కొల్లగొడుతున్నా.. నిబంధనల ప్రకారం జరగాల్సిన క్షేత్రస్థాయి పరిశీలన ఎందుకు అటకెక్కిందన్నదానిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేరగాళ్లు కోట్లాది రూపాయలు దోచుకున్న తర్వాతే అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారన్నది నగ్న సత్యం. మోసం జరుగుతున్న ప్రారంభ దశలోనే ఫేక్ ఇన్‌వాయిస్‌లను పట్టుకోవడంలో జీఎస్టీ విభాగం విఫలమైందా? లేదా ఉద్దేశపూర్వకంగానే చూసీచూడనట్లు వదిలేస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. వందల కోట్లు రికవరీ చేశామని అధికారులు చెబుతున్నా, కొత్తగా పుట్టుకొస్తున్న నకిలీ కంపెనీలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో నిఘా వ్యవస్థను కఠినతరం చేయకపోతే.. సామాన్యుడు కట్టే పన్నులన్నీ అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది.


