రైతుల సంక్షేమమే సీఎం జగన్‌ లక్ష్యం 

RBKs As Complete Rythu Seva Kendras MLA Maheedhar Reddy - Sakshi

సంపూర్ణ రైతు సేవా కేంద్రాలుగా ఆర్బీకేలు

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభ సభలో ఎమ్మెల్యే మానుగుంట

కందుకూరు(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): వ్యవసాయ రంగంపై ప్రభుత్వ ఆలోచనా విధానాల ఆధారంగానే రైతుల జీవితాలు మారతాయని, క్షేత్ర స్థాయి నుంచి రైతుల జీవితాలను మెరుగు పర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను సాగులో వినియోగించాలని చెప్పారు. 

గతేడాది చెరువుల నిండా నీరున్నా.. వరి సాగు చేసేందుకు రైతులు ముందు రాలేదని గుర్తు చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టు కింద వరి సాగు చేసేందుకు రైతులు ముందుకు రాలేదన్నారు. ఆర్బీకేలు సంపూర్ణ రైతు సేవా కేంద్రాలుగా మారాయన్నారు. సీహెచ్‌సీ గ్రూపుల ద్వారా రూ.15 లక్షల విలువైన పనిముట్లను అందుబాటులో ఉంచుతుందని, నిరుద్యోగులైన వ్యవసాయ పట్టభద్రులకు రూ.10 లక్షల విలువైన కిసాన్‌ డ్రోన్‌లను సరఫరా చేస్తుందని తెలిపారు. అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన తర్వాత నకిలీ విత్తనాలకు పూర్తిగా చెక్‌ పడిందని, ఎక్కడా కూడా నకిలీ విత్తనం అనే మాట వినిపించడం లేదన్నారు. 

కందుకూరు ప్రాంతంలో వరి, శనగ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు ఏర్పాటు చేశామని, తాజాగా జొన్నల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నంద్యాలలో పండే రకం జొన్నను ఈ ప్రాంత రైతులు సాగు చేసి విజయం సాధించారని తెలిపారు. మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటైందన్నారు. రూ.2,738 మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. దళారీ వ్యవస్థ వల్ల రైతు రూ.1000 నుంచి రూ.1500 వరకు ధాన్యం కొనుగోళ్లలో నష్టపోవాల్సి వచ్చిందని, అటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి జొన్నలు ప్రభుత్వానికి విక్రయించుకోవచ్చునని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ ఎస్‌.పవన్‌కుమార్, వ్యవసాయశాఖ ఏడీఏ శేషగిరి, ఏఓ అబ్దుల్‌రహీం, నాయకులు గణేశం గంగిరెడ్డి, వసంతరావు, ఎం శ్రీనివాసులు, గేరా మనోహర్, కామాక్షినాయుడు తదితరులు పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top