
ఇరుకు రోడ్లతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ‘ఈనాడు’ యజమాని ఓ సంఘ సంస్కర్తలా వార్తలు అచ్చేస్తుంటారు!
...విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్‌లో రహదారి విస్తరణను ఇదే రామోజీరావు 20 ఏళ్లు అడ్డుకున్నారు.
ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కబ్జా చేస్తున్నారు..! సామాన్యులు హడలిపోతున్నారంటూ.. ఈనాడు ఎక్కడలేని ఆవేదన వెళ్లగక్కుతుంది..
.. బెజవాడ బెంజ్ సర్కిల్ వద్ద అత్యంత విలువైన మూడెకరాల భూమిని లీజు ముగిసినా ఖాళీ చేయకుండా స్థలం యజమానిని రామోజీ తీవ్రంగా వేధించారు.
ఒకరికి దక్కాల్సిన నష్ట పరిహారాన్ని మరొకరు కాజేస్తున్నారంటూ ఈనాడు వాపోతుంది!
..రహదారి విస్తరణకు ప్రభుత్వం భూమి తీసుకుంటే అందుకు నష్టపరిహారంగా ఇచ్చే టీడీఆర్ బాండ్లను భూ యజమానికి కాకుండా తనకే ఇవ్వాలంటూ రామోజీ కోర్టుకెక్కారు.ప్రశ్నించిన వారిపై పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారంటూ ఎదురుతిరిగారు. చివరకు న్యాయం గెలిచింది. ధర్మం నిలిచింది. రామోజీ ఓడారు.
ఓ పత్రికాధిపతి ఎలా ఉండకూడదో... ఒక లీజుదారుడు ఎలా ఉండకూడదో... ఒక వ్యాపారి ఎలా ఉండకూడదో... అన్నిటికీ మించి ఒక మనిషి ఎలా ఉండకూడదో చెప్పడానికి రామోజీరావు ప్రత్యక్ష ఉదాహరణ. కాకపోతే.. న్యాయం ఆలస్యమైనా గెలుస్తుంది. కొన్నేళ్ల కిందట విశాఖలో అదే జరిగింది. ఇపుడు విజయవాడలోనూ రామోజీ విషయంలో అదే జరిగింది. ఆయనకు మానవత్వం, బంధుత్వాలకు అర్థం తెలియదని.. ఇతరుల సొమ్మును అప్పనంగా కాజేస్తాడని... రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే సైంధవుడని మరోసారి నిరూపితమయింది. ఫలితం... కొన్నేళ్ల క్రితం తన కబ్జాలో ఉన్న విశాఖ ఈనాడు కార్యాలయం భూమిని అసలు యజమానికి అప్పగించిన ఈ గురివింద గింజ... ఇప్పుడు విజయవాడలోని స్థలాన్ని కూడా భూ యజమానికి అప్పగించి చిత్తగించారు. ఆ స్థలాన్ని ఖాళీ చేస్తున్నట్లు బోర్డు ఏర్పాటు చేసి మరీ బయటకు వెళ్లారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న సత్యం మరోసారి రుజువైంది.
– సాక్షి, అమరావతి
( ఫైల్ ఫోటో )
లీజు స్థలాన్ని కబ్జా చేసి..
విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ సమీపంలో దాదాపు 3 ఎకరాల్లో ఉన్న భవనం అది. చూడగానే అరె.. ఇది ఈనాడు ఆఫీసే కదా అనుకోవడం సహజం! ఎందుకంటే 40 ఏళ్లకుపైగా అది అలాగే చలామణి అవుతోంది మరి. ఈనాడు కార్యాలయంగా, రామోజీరావు ఆస్తిగా ముద్ర పడిపోయింది. కానీ వాస్తవం ఏమిటంటే... ఇప్పుడే కాదు అది ఎప్పుడూ ఈనాడు సొంత స్థలం కాదు. కబ్జా ముసుగులో చెరుకూరి రామోజీ చెరబట్టిన స్థలం అది. దాదాపు 3 ఎకరాల్లో ఉన్న ఆ భూమి అసలైన యజమాని వల్లూరి రామకృష్ణ. ఆయన ఆ భూమిని రెండు భాగాలుగా 1980లో రామోజీకి లీజుకిచ్చారు.
రామోజీ తన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు ద్వారా వల్లూరి రామకృష్ణను సంప్రదించి ఆ భూమిని 33 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. ప్రస్తుతం రూ.వందల కోట్ల మార్కెట్ విలువ ఉన్న భూమిని కేవలం వందల రూపాయలకే లీజుకు దక్కించుకున్నారు. అందులో 1.80 ఎకరాల విస్తీర్ణంలో ఈనాడు కార్యాలయ భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ విధంగా ఆ భూమిని గుప్పిట పట్టిన తరువాత రామోజీ తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించారు. లీజు గడువు ముగిసినా ఖాళీ చేయకుండా భూ యజమానులను ముప్పు తిప్పలు పెట్టారు. విజయవాడ అభివృద్ధికి అడ్డంకిగా నిలిచారు.
లీజు ముగిసినా గబ్బిలంలా..
బెంజ్ సర్కిల్ సమీపంలోని ఖరీదైన భూమిని హస్తగతం చేసుకోవాలనే దుర్బుద్ధితో భూ యజమానిని రామోజీ ముప్పుతిప్పలు పెట్టారు. లీజుకు తీసుకున్న కొద్ది రోజులకే వివాదం పెట్టుకున్నారు. తన పలుకుబడితో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. బెదిరింపులకు పాల్పడ్డారు. కనీసం లీజు గడువు ముగిసిన తరువాతైనా తన భూమి తనకు దక్కుతుందని వల్లూరి రామకృష్ణ ఆశించారు. 33 ఏళ్ల లీజు గడువు 2013తో ముగిసింది. అయినా సరే భూమిని ఖాళీ చేయకపోవడంతో రామోజీరావుతో సుదీర్ఘంగా వల్లూరి రామకృష్ణ, డాల్ఫిన్ అప్పారావుల న్యాయ పోరాటం సాగింది. ఏకంగా పదేళ్లపాటు తమ భూమి కోసం భూ యజమానులు పోరాడాల్సి వచ్చింది. ఎట్టకేలకు న్యాయం గెలిచింది. కోర్టు ఆదేశాలతో రామోజీ ఖాళీ చేశారు.
రోడ్డు విస్తరణను అడ్డుకుని..
విజయవాడ బాగా విస్తరించడం, ట్రాఫిక్ పెరగడంతో బెంజ్ సర్కిల్ సమీపంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీనిపై ప్రజల నుంచి అందిన వినతులను పరిశీలించిన తరువాత 2004లో విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ ఆ రహదారిని విస్తరించాలని భావించారు. కానీ రోడ్డు విస్తరణ కోసం ‘ఈనాడు’ ప్రహరీని తొలగించేందుకు రామోజీ సమ్మతించలేదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రహదారి వెంబడి ఇరువైపులా డ్రెయిన్లు నిర్మించే ప్రయత్నం చేసినా రామోజీ అడ్డుకున్నారు. ఆ వరుసలో ఉన్న పలు వ్యాపార సంస్థలు, ఇతర కార్యాలయాల ప్రహరీలను తొలగించి రహదారిని విస్తరించినా ఈనాడు వద్దకు వచ్చేసరికి ఆగిపోయింది.
ఎన్‌హెచ్‌ఏఐకి బ్రేకులు
కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) సైతం ఏమీ చేయలేకపోయింది. బందరు– పుణె జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ 2018లో కార్యాచరణకు ఉపక్రమించింది. బందరు నుంచి విజయవాడ వరకు రహదారిని విస్తరించినా బెంజ్ సర్కిల్ సమీపంలోకి వచ్చేసరికి ఎన్‌హెచ్‌ఏఐకి బ్రేకులు పడ్డాయి. ఈనాడు ప్రహరీని తొలగించేందుకు రామోజీ ససేమిరా అనడంతో రహదారి విస్తరణ నిలిచిపోయింది. ఈ పరిణామాలతో 20 ఏళ్లుగా బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారమే లభించలేదు. మరోవైపు రహదారులు విస్తరించకపోవడంతో రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ తన కర పత్రికలో నీతులు వల్లిస్తూనే ఉన్నారు.
పుట్టుక నుంచే కుట్ర..!
ఈనాడు కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో రామోజీ భూ అక్రమాలు అక్కడ కొనసాగాయి. ఈనాడు నెలకొల్పిన విశాఖలో కూడా భూ యజమానిని అదేవిధంగా మోసగించి ముప్పుతిప్పలు పెట్టారు. విశాఖలోని సీతమ్మధారలో మంతెన ఆదిత్య ఈశ్వరకుమార్ వర్మ కుటుంబానికి చెందిన 2.70 ఎకరాల భూమిలో ఈనాడు కార్యాలయాన్ని 1974లో ఏర్పాటు చేశారు. 33 ఏళ్ల లీజు గడువు ముగిసిన తరువాత ఆ భూమిని ఖాళీ చేసేందుకు రామోజీ మొండికేశారు. అంతేకాకుండా రహదారి విస్తరణ కోసం అందులో517 చ.మీటర్ల భూమిని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా మరోచోట 872 చ.మీటర్ల భూమిని పొందారు.
అసలు యజమాని అయిన వర్మ కుటుంబానికి దాన్ని అప్పగించకుండా రామోజీ దర్జాగా తమ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. ఆ భూమి మార్కెట్ విలువ రూ.3 కోట్లు కావడం గమనార్హం. ఇక మార్కెట్ విలువ ప్రకారం రూ.32.5 లక్షల లీజు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తూ ఆ భూమిని గుప్పిట పట్టారు. లీజు ముగిసినా ఖాళీ చేయకపోవడంతో భూమి యజమాని వర్మ 2007లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో న్యాయస్థానాన్ని మోసగించేందుకు రామోజీ ఏకంగా ఫోర్జరీకి పాల్పడ్డారు.
విశాఖ జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను ఫోర్జరీ చేశారని వర్మ ఆధారాలతో నిరూపించడంతో రామోజీ కుట్ర బెడిసికొట్టింది. కుట్ర, ఫోర్జరీ కింద రామోజీపై కేసు కూడా నమోదు చేశారు. దీనిపై వర్మ సుప్రీం కోర్టు వరకు సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి ధర్మమే గెలిచింది. సీతమ్మధారలో ఈనాడు కార్యాలయం ఉన్న భూమిని ఖాళీ చేసి భూ యజమానికి అప్పగించాలని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించింది. దాంతో రామోజీ తోక ముడిచి ఆ భూమిని ఖాళీ చేసి ఈనాడు కార్యాలయాన్ని నగర శివారులో పెందుర్తి సమీపంలోకి తరలించారు.
బాండ్లు తనకే ఇవ్వాలంటూ..
బెజవాడ ఈనాడు కార్యాలయం భూమిని కాజేసేందుకు రామోజీ మడత పేచీ పెట్టారు. రహదారి విస్తరణ కోసం సేకరించే భూమికి పరిహారంగా భూ, భవన యజమానులకు జారీ చేసే ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లను తనకే ఇవ్వాలంటూ విజయవాడ కార్పొరేషన్‌కు నోటీసు పంపించారు. భూ యజమాని అయిన రామకృష్ణకు కాకుండా తనకే ఇవ్వాలని రామోజీ వాదించడంతో మున్సిపల్ అధికారులు షాక్ తిన్నారు. దీనిపై న్యాయ వివాదంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. రామోజీ కోరుకుంది కూడా అదే! రహదారి విస్తరణ నిలిచిపోవాలన్నదే ఆయన ఉద్దేశం. అదే జరిగింది కూడా.
అంతిమ విజయం ధర్మానిదే...
న్యాయస్థానం ఆదేశాల తరువాత కూడా తాను ఆక్రమించిన భూమిని ఖాళీ చేసేందుకు రామోజీరావు ఏడాది సమయం తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన గడువు ఇటీవల 2023 డిసెంబర్ 31తో ముగిసింది. దీంతో దారులన్నీ మూసుకుపోవడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బెంజ్ సర్కిల్ సమీపంలోని ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేశారు. అక్కడి యంత్రాలు, ఫర్నీచర్ తదితరాలను ఆటోనగర్‌లోని కార్యాలయానికి తరలించారు. ఎట్టకేలకు రామోజీ అక్రమ భూబాగోతానికి తెరపడింది. అసలైన యజమానులకు వారి భూమి దక్కింది. ఆ భూమిని తాజాగా ఓ వాణిజ్య సంస్థకు లీజుకు ఇచ్చారు. ఆలస్యమైనా సరే చివరికి న్యాయమే గెలుస్తుందని మరోసారి రుజువైంది.