
యాంటీడ్రోన్ వ్యవస్థ నమూనా
మానవ రహిత వైమానిక వాహనాలైనా జలసమాధే
అత్యాధునిక యాంటీ డ్రోన్ వ్యవస్థకు హిందూస్థాన్ షిప్ యార్డ్ శ్రీకారం
పెంటగాన్ ఇండియా లిమిటెడ్‌తో ఒప్పందం
యుద్ధ నౌకలపై శత్రు డ్రోన్లని పసిగట్టే సముద్ర భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థ
30 కిలోమీటర్ల దూరంలో ఉన్నా పసిగట్టే రియల్ టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శత్రు దేశాల డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాలు కనిపిస్తే వెంటనే జలసమాధి చేసే వ్యవస్థకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ పదును పెడుతోంది. ఇటీవల దాయాది దేశం పాకిస్థాన్ భారత్‌పై డ్రోనాస్త్రాలు సంధించగా వాటిని తుత్తునియలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఆదర్శంగా తీసుకుని సముద్ర జలాల్లో శత్రుదేశాల మానవ రహిత వైమానిక వాహనాలు దూరంలో ఉన్నప్పుడే పసిగట్టి.. వాటిని జల సమాధి చేసే యాంటీ డ్రోన్ వ్యవస్థని యుద్ధ నౌకల్లో ఏర్పాటుకు హిందూస్థాన్ షిప్‌యార్డు పెంటగాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది. షిప్‌యార్డు సీఎండీ కమొడర్ హేమంత్ ఖత్రీ నేతృత్వంలో పీఆర్‌ఎస్ సంస్థ ఎండీ డాక్టర్ స్వామినాథన్ మణికందన్, షిప్‌యార్డు డైరెక్టర్ వెంకటేశ్వర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
30 కి. మీ దూరంలోనే పసిగట్టేలా..
ప్రస్తుతం కొన్ని యుద్ధ నౌకల్లో షార్ట్ రేంజ్ కమ్యునికేషన్ సిస్టమ్ అమల్లో ఉంది. వీటి ద్వారా నాలుగు లేదా ఐదు కిలోమీటర్ల దూరంలో డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని పసిగట్టి సమాచారాన్ని ప్రధాన కేంద్రానికి అందిస్తుంటాయి. కానీ.. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
యుద్ధ నౌకలకు డ్రోన్ ముప్పు ఉండదిక
సముద్ర జలాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకలకు ఈ ఒప్పందం ద్వారా సమగ్ర రక్షణ లభిస్తుంది. దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్ వ్యవస్థని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నాం. రక్షణ రంగ సాంకేతికతలో షిప్‌యార్డు భాగస్వామ్యం మరింత పెరుగుతోంది. వచ్చే త్రైమాసికంలో ఇంటిగ్రేషన్ ట్రయల్స్‌ని ప్రారంభిస్తాం. తర్వాత తొలి విడతలో ఫ్రంట్‌లైన్ యుద్ధ నౌకల్లో ఈ రియల్ టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తాం. – కమొడర్ హేమంత్ ఖత్రి, సీఎండీ, హెచ్‌ఎస్‌ఎల్
యాంటీ డ్రోన్ వ్యవస్థ ప్రత్యేకతలివీ
⇒ రియల్‌టైమ్ డిటెక్షన్ ట్రాకింగ్ ద్వారా 30 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లనూ సులువుగా గుర్తించవచ్చు.
⇒ ఒక్క అడుగు కూడా కదలనియ్యకుండా ధ్వంసం చేయొచ్చు.
⇒ 400 ఎంహెచ్‌జెడ్ 6గిగా హెడ్జ్ స్పెక్ట్రమ్ పరిధిలో ఉన్న యుద్ధ నౌకలు, నౌకాదళ కేంద్రాలకు ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ శత్రుదేశాల సమాచారాన్ని క్షణాల్లో చేరవేస్తుంది.