అరెస్ట్‌.. రిమాండ్‌.. ఇష్టా‘రాజ్యం’కాదు | Supreme Court Clear Guidelines For Magistrates And Police Over Arrests And Remand, Read Story For Complete Details | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌.. రిమాండ్‌.. ఇష్టా‘రాజ్యం’కాదు

Jul 24 2025 7:20 AM | Updated on Jul 24 2025 12:21 PM

Supreme Court Clear Guidelines For Magistrates And Police

మేజిస్ట్రేట్లు, పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు 

అర్నేశ్‌ కుమార్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ 2014 తీర్పు నిర్దేశాలు

అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది.  జీవితాంతం అరెస్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది.  ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు – పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది.

కానీ పోలీస్‌ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్ప­టికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు. పోలీస్‌ వ్యవస్థను ఇంకా ప్రజలకు మిత్రుడిగా కాకుండా వేధింపులకు, అణచివేతకు హేతువుగా భావిస్తున్నారు.  అరెస్టు అనే తీవ్రమైన అధికారా­న్ని వినియోగించడంలో జాగ్రత్త అవసరమని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా, అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.

అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్‌ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్‌ అవినీతికి ఒక లాభదాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది.  మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్‌ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.

లా కమిషన్లు, పోలీసు కమిషన్లు, ఈ కోర్టు ఎన్నో తీర్పుల్లో అరెస్టు అధికారాన్ని వినియోగించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ– సమాజ శాంతి మధ్య సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తుచేశాయి. పోలీసు అధికారులు తాము అరెస్టు చేసే అధికారాన్ని కలిగి ఉన్నామని భావిస్తూ అరెస్టు చేస్తుంటారు. అరెస్టు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంది. అవమానాన్ని కలిగిస్తుంది.  కనుక మేము దీనిని భిన్నంగా భావిస్తాం. కేవలం ఒక నాన్‌–బెయిలబుల్‌ అలాగే గుర్తింపు ఇవ్వదగిన నేరం (నాన్‌–బెయిల­బుల్‌ అండ్‌ కాగ్నిజబుల్‌– తీవ్రమైన)  జరిగిందని పోలీసులు నమ్మడమే ఆధారంగా అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయగల అధికారాన్ని కలిగి ఉండటం ఒక విషయం. అయితే, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయసమ్మతమైన కారణం కలిగి ఉండటం ఇంకొక విషయం.

పోలీస్‌ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు. ఆరోపణల ప్రామాణికతపై కొంత విచారణ చేసిన తర్వాత పోలీసు అధికారికి న్యాయమైన సంతృప్తి వచ్చినపుడే అరెస్టు చేయడం సమంజసం,  ఇది ఒక సరైన, సముచిత నిర్ణయం అవుతుంది. ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అరెస్టుల విషయంలో పరిపక్వత కనబడడంలేదు. అరెస్టుల సంఖ్య తక్కువ కావడంలేదు.

చివరకు పార్లమెంట్‌ రంగంలోకి దిగి, లా కమిషన్‌ 2001లో సమర్పించిన 177వ నివేదిక సిఫార్సులకు అనుగుణంగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లోని సెక్షన్‌ 41ను ప్రస్తుత రూపంలో అమలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే లా కమిషన్‌ ఇదే సిఫార్సును 1994లో ఇచ్చిన 152,154వ నివేదికల­లోనూ చేసింది. అరెస్టు చేసే విషయంలో చట్టంలో చేసిన సవరణలను పూర్తి పారదర్శకత (ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ ప్రపోర్షనాలిటీ) ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే చిన్న నేరం చేశారన్న కారణంతోనే ఒకరిని వెంటనే అరెస్టు చేయకూడదు. నేరం తీవ్రత, వ్యక్తి నుంచి వచ్చే ముప్పు, విచారణకు సహకరిస్తాడా లేదా వంటి అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.

వారెంటు లేకుండా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22(2) అలాగే సీఆర్‌పీసీ సెక్షన్‌ 57 ప్రకారం అవసర­మైన ప్రయాణ సమయాన్ని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల లోపల మేజి­స్ట్రేట్‌ ముందు హాజరు పరచాలి. ఇది నిందితుని హక్కు.  ఒక కేసు దర్యాప్తు సమయంలో 24 గంటల కంటే ఎక్కువగా నిందితుడిని పోలీసు కస్టడీలో ఉంచాలంటే, అది సీఆర్‌పీసీ సెక్షన్‌ 167 ప్రకారం మేజిస్ట్రేట్‌ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కస్టడీ అనుమతిని మంజూరు చేయడం అనేది చాలా బాధ్యతగల, సున్ని­తమైన న్యాయపరమైన కార్యం. ఇది వ్యక్తి­గత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని అత్యంత జాగ్రత్తతో ఉపయోగించాలి. అయితే అనుభవంలో చూస్తుంటే, పలుమార్లు మేజిస్ట్రే­ట్లు ఈ అనుమతిని నిర్లక్ష్యంగా, మామూలుగా, అషామాషీగా మంజూరు చేస్తున్నారు.

మేజిస్ట్రేట్‌ సీఆర్‌పీసీ సెక్షన్‌ 167 ప్రకారం నిందితుడిని రిమాండు చేయాలంటే ముందుగా ఆ అరెస్ట్‌ చట్టబద్ధమైనదా? రాజ్యాంగ హక్కులను పాటించడం జరిగిందా? అనే విషయాలపై సంతృప్తి చెందాలి. పోలీసు అధికారి చేసిన అరెస్ట్‌ సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, మేజిస్ట్రేట్‌ అతనికి రిమాండు విధించకుండా విడుదల చేయాలి. అంటే, ఒక నిందితుడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర­చిన­ప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్‌ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్‌కు వివరించాలి. మేజిస్ట్రేట్‌ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్‌ అనుమతించాలి. మేజిస్ట్రేట్‌ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్‌ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.

ఉదాహరణకు, ఒక నిందితుడిని మరో నేరాన్ని చేయకుండా అడ్డుకోవ­డాని­కి, సాక్ష్యాలను ధ్వంసం చేయ­కుండా నిలువరించడానికి లేదా ఇతరులను బెదిరించకుండా  నివారించడానికి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్‌ భావిస్తే, అలాంటి నిర్దిష్ట కారణాలు, ఆ ఆధారాలను మేజిస్ట్రేట్‌ ముందు సమ­ర్పించాలి. మేజిస్ట్రేట్‌ వాటిని పరిశీలించి, తాను ఆయా అంశాల పట్ల సంతృప్తి పొందుతు­న్నట్లు లిఖితపూర్వకంగా నమో­దు చేసిన తరువాత మాత్రమే రిమాండ్‌ విధించాలి.

దోషిగా ఆరోపణలు ఉన్న  వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని  (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు  జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేసాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన,  అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయ కూడదు. అలాంటి సందర్భాల్లో, పోలీసు అధికారి అరెస్టు అవసరమనే విషయంలో మరింత సంతృప్తి పొందాలి. అంటే..

  • ఆ వ్యక్తి మరిన్ని నేరాలు చేయకుండా నివారించడానికి,

  • కేసు సమగ్రంగా దర్యాప్తు చేయడానికి,

  • నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకోవడానికి,

  • సాక్ష్యులను మోసం చేయకుండా నిరోధించడానికి

  • నిజాలు చెప్పదలచిన సాక్షులను భయపెట్టి, ప్రలోభ పెట్టి లేదా బెదిరించి నిజాలు బయటపెట్టకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి,

  • లేదా అతన్ని అరెస్టు చేయకపోతే కోర్టులో అవసరమైనప్పుడు అతని హాజరు విషయంలో విఫలమవుతామని భావించినప్పుడు.. మాత్రమే.. అరెస్టు చేయవచ్చు. 

అయితే పోలీసు అధికారి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. అంతే కాదు, అరెస్టు చేయకపోతే కూడా, ఎందుకు అరెస్టు చేయలేదన్న కారణాలను కూడా లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. మరింత వివరంగా చెప్పాలంటే, పోలీసు అధికారి తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి:

ఎందుకు అరెస్టు?    

నిజంగా అరెస్టు అవసరమా?  

అది ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది?   

 ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని, పైన పేర్కొన్న నిబంధనల్లో కనీసం ఒక నిబంధన విషయంలో సంతృప్తి పొందినప్పుడే అరెస్టు అధికారం వినియోగించాలి. ఇందుకు సంబంధించిన సమాచారం, సాక్ష్యాలకు ప్రామాణికత ఉండాలి.  పోలీసులు ఎవ్వరినైనా అరెస్ట్‌ చేయాలంటే, కేవలం ఆ వ్యక్తి నేరం చేశారని అనిపిస్తే చాలదు. సీఆర్‌పీసీ 41 (ఏ)లో సబ్‌–క్లాజ్‌ (ఏ) నుండి (ఈ) వరకూ పేర్కొన్న పరిస్థితులు (అంశాల్లో) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో సంతృప్తి పొందుతున్నామా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకుని, అరెస్ట్‌ అవసరం అని తార్కికంగా తేల్చుకున్నప్పుడే అరెస్ట్‌ జరగాలి.

ఇంకొక ముఖ్యమైన నిబంధనగా భావించదగిన సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ.. అనవసరమైన అరెస్టులను నివారించేందుకు, అరెస్ట్‌కు గురవుతాయన్న భయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినది.  ఈ నిబంధనను చైతన్యవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.  క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సవరణ చట్టం, 2008 (యాక్ట్‌ 5 ఆఫ్‌ 2009) ద్వారా సెక్షన్‌ 6 కింద అనుసంధానమైన ఈ కీలక సెక్షన్‌ 41ఏ ఏమి చెబుతోందో ఈ సందర్భంగా చర్చించుకోవడం సందర్భోచితం.

41ఏ. పోలీసు అధికారి ముందు హాజరు కావాలనే నోటీసు :–
(1) సెక్షన్‌ 41(1) ప్రకారం ఒక సమంజసమైన ఫిర్యాదు లేదా విశ్వసనీయ సమా­చారం అందిన మీదట,  ఆ వ్యక్తి కాగ్నిజబుల్‌ అఫెన్స్‌ (గుర్తింపదగిన తీవ్ర నేరం) చేశాడనే సమంజసమైన అనుమానం ఉండి, సంబంధిత వ్యక్తిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేని ప్రతి సందర్భంలో పోలీసు అధికారి ఆ వ్యక్తిని తాను పేర్కొన్న స్థలానికి హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయాలి. ఈ నోటీసులో  హాజరు కావాల్సిన తేదీ, సమయం, స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఈ విధంగా, పోలీసు అధికారికి అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో నేరుగా అరెస్ట్‌ చేయకుండా, ముందుగా వ్యక్తికి హాజరు కావాలనే నోటీసు జారీ చేయడం తప్పనిసరి.

(2)    అలాంటి నోటీసు ఎవరైనా వ్యక్తికి జారీ అయినప్పుడు, ఆ వ్యక్తి ఆ నోటీసులో పేర్కొన్న నిబంధనలకు లోబడిన విధంగా సహకరించాలి. దీనిని ఒక బాధ్యతగా పరిగణించాలి.

(3) అట్టి వ్యక్తి నోటీసులో అంశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, ఇదే విధానాన్ని కొనసాగిస్తే,  ఆ నోటీసులో పేర్కొ­న్న నేరానికి సంబంధించి అతడిని అరెస్టు చేయరా­దు. అయితే, ఆ వ్యక్తిని అరెస్టు చేయవల­సిన అవస­రం ఉందన్న అభిప్రాయం పోలీసు అధికారి కలిగి ఉంటే, దానికి సంబంధించిన కారణాల­ను లిఖితపూ­ర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లిఖిత­పూ­ర్వక కారణాల ప్రాతిపదికనే అతడిని అరెస్టు చేయవచ్చు.

(4) ఒక వ్యక్తి నోటీసులో పేర్కొన్న నిబంధనలను ఎప్పుడైనా పాటించకపోతే లేదా అతను తనకు తాను పోలీసుల ముందు హాజరుకావడానికి ఇష్టపడ­క­పోతే, అటువంటి సందర్భాల్లో, సంబంధిత నోటీ­సు­లో పేర్కొన్న నేరానికి సంబంధించి, ఒక అర్హత కలిగిన న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు లోబడే, పోలీసులు అతడిని అరెస్టు చేయవచ్చు. పై విధానాన్ని బట్టి, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేయడం అవసరం లేని అన్ని సందర్భాల్లో, పోలీసు అధికారి తప్పనిసరిగా నిందితుడి­కి ఒక నోటీసు జారీ చేయాలి. అందులో పోలీసు అధికారిని ఎక్కడ, ఎప్పుడు కలవాలో స్పష్టంగా పేర్కొనాలి. చట్టం ప్రకారం, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటించి పోలీసు అధికారిని కలవాలి. ఇకపోతే, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటి­స్తే, సాధారణంగా అతన్ని అరెస్ట్‌ చేయకూడదు.  అయితే, అరెస్టు అవసర­మని పోలీసులు భావిస్తే, దానికి కారణాలు రాసి ఉంచాలి. ఈ దశలో కూడా, అరెస్టు చేయడానికి ముందు, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41 లో పేర్కొన్న షరతులను పాటించాలి.  న్యాయ­మూర్తి సమీక్షకు అది తప్పనిసరిగా లోబడి ఉండాలి.

మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు లేకుండా అలాగే వారెంట్‌ లేకుండా నిందితుడిని అరెస్ట్‌ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్‌ ప్రొసీజ­ర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) సెక్షన్‌ 41 లోని నిబంధనలు నిజాయితీ­గా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ముందస్తు బెయిల్‌ కోసం కోర్టుకు వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. మేము ప్రత్యేకంగా చెప్పదలచుకున్న విష­యం ఏమిటంటే, సీఆర్‌పీసీ సెక్షన్‌ 41లో పేర్కొన్న కార­ణా­లను కేసు డైరీలో యాంత్రికంగా పునరావృతం చేయడం అనే ఆచారాన్ని నిరుత్సాహ పర్చాలి. విడనాడాలి.

ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్‌ చేయకుండా, మేజిస్ట్రేట్‌లు కూడా అనా
లోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా 
అంశాల అమలుకు మేము కింద సూచనలు ఇస్తున్నాము.  

ప్రతి పోలీస్‌ అధికారికి, సెక్షన్‌ 41(1)(బీ)(ఐఐ) కింద పేర్కొన్న నిర్దిష్ట ఉపఖండాలతో కూడిన తనిఖీ జాబితా (చెక్‌లిస్ట్‌) అందించాలి. ఈ చర్య, అరెస్టు చేసే సమయంలో అవసరమైన ప్రమాణాలను పోలీసులు గుర్తించేందుకు దోహదపడుతుంది. 

పోలీసు అధికారి నిందితుడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజ­రు­పరుస్తున్నప్పుడు లేదా  రిమాండ్‌ను కోరుతు­న్న­ప్పుడు అరెస్ట్‌ అవసరం అయిన కారణాలు అలాగే ఆధా­రాలను స్పష్టంగా వివరించాలి. అంతేకాకుండా, తనిఖీ జాబితాను సమర్పించి, దాన్ని సరిగ్గా నింపినట్టు చూపించాలి.

నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు అనుమతి ఇచ్చే ముందు ‘పై విధంగా’ పోలీసు అధికారి సమర్పించిన నివేదికను మేజిస్ట్రేట్‌ పరిశీలించాలి. ఆ నివేదిక ఆధారంగా తగిన సంతృప్తిని వ్యక్తపరచి, లిఖితపూర్వకంగా నమోదు­చేసిన తరువాత మాత్రమే, నిందితునికి రిమాండ్‌ విధించాలి. 

నిందితుడిని అరెస్ట్‌ చేయకూడదని తీసుకున్న నిర్ణయం, కేసు దాఖలైన తేదీ నుంచి రెండు వారాల్లోగా మేజిస్ట్రేట్‌కు పంపించాలి. అలాగే, ఒక నకలును మేజిస్ట్రేట్‌కి అందించాలి. అవసరమైతే, జిల్లాకు చెందిన పోలీసు సూపరింటెండెంట్‌ లిఖిత రూపంలో కారణాలు నమోదు చేసి, ఆ గడువును పొడిగించవచ్చు.

కేసు దాఖలు చేసిన తేదీ నుంచి రెండు వారాల వ్యవధి­లోగా నిందితుడికి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ ప్రకారం హాజరుకై నోటీసు జారీ చేయాలి. ఈ గడువును, అవసరమైతే, జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌పీ) లిఖిత­పూర్వకంగా కారణాలు నమోదు చేసి పొడిగించవచ్చు.

పై సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్‌డిక్షన్‌) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది.

సంబంధిత కారణాలను రికార్డు చేయకుండా నిందితునికి రిమాండ్‌ విధిస్తే, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ద్వారా సంబంధిత జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కూడా శాఖాపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. 

ఈ తీర్పు  ప్రతిని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే 
కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్‌ డైరెక్టర్‌ జనర­ల్స్‌­కు, అలాగే అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్‌కు పంపించాలని  మేము ఆదేశిస్తున్నాము. తద్వారా వారు దీన్ని ఇతరులకు పంపించి, అమలులోకి తీసుకురాగలుగుతారు.

1. అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది.  జీవితాంతం అరెస్ట్‌కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది.  ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు– పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది. కానీ పోలీస్‌ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు.

2. అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్‌ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్‌ అవినీతికి ఒక లాభ దాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది.  మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్‌ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.

3. పోలీస్‌ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు.

4. దోషిగా ఆరోపణలు ఉన్న  వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని  (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు  జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేశాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన,  అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయకూడదు.  

5. ఒక నిందితుడిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర­చిన­ప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్‌ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్‌కు వివరించాలి. మేజిస్ట్రేట్‌ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్‌ అనుమతించాలి. మేజిస్ట్రేట్‌ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్‌ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.

6. మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు లేకుండా, అలాగే వారెంట్‌ లేకుండా నిందితుడిని అరెస్ట్‌ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్‌ ప్రొసీజ­ర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) సెక్షన్‌ 41 లోని నిబంధనలు నిజాయితీ­గా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.

7. ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్‌ చేయకుండా, మేజిస్ట్రేట్‌లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా  శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు కింద సూచనలు ఇస్తున్నాము.

8. మా సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్‌డిక్షన్‌) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది. 
– సుప్రీం కోర్టు ఆఫ్‌ ఇండియా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement