
ట్రయల్ రన్‌కే పరిమితమైన సీ ప్లేన్
విజయవాడ టూ శ్రీశైలానికి ప్రయాణమంటూ సీఎం గొప్పలు
పది నెలలు గడుస్తున్నాసిద్ధం కాని డీపీఆర్
ఇరిగేషన్, అటవీశాఖల అనుమతులపై అనుమానం..?
శ్రీశైలంటెంపుల్: ‘దట్టమైన నల్లమల అటవీ మధ్యలో ప్రవహించే కృష్ణమ్మ పరవళ్లపై ప్లేన్‌లో ప్రయాణించి మధురానుభూతి పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా విజయవాడ నుంచి శ్రీశైలానికి తక్కువ సమయంలో వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీని టూరిజం హబ్‌గా మారుస్తాం’ అంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీశైలంలో సీ ప్లేన్ ట్రయరల్ రన్ వేళ అన్న మాటలు. ఇక సీన్ కట్ చేస్తే.. సీప్లేన్ ట్రయల్‌రన్ చేపట్టి ఇప్పటికి పది నెలలు గడుస్తోంది.
ఇంకా సర్వేలు, సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాకపోవడంతో సీప్లేన్ ప్రయాణం మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. సీఎం ప్రచార ఆర్భాటానికే సీప్లేన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ట్రయల్‌రన్ చేసి వదిలేశారని, ఆచరణ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లన్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా శ్రీశైలానికి గతేడాది నవంబరు 9న సీప్లేన్ ట్రయల్‌రన్ చేపట్టారు.
రాష్ట్ర సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, టూరిజం శాఖ మంత్రి దుర్గేశ్ తదితరులు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్‌లో శ్రీశైలం పాతాళగంగకు చేరుకున్నారు. సీప్లేన్ ప్రారంభమైతే విజయవాడ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగ ళూర్ తదితర రాష్ట్రాల నుంచి సైతం సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉందని అప్పట్లో పాలకులు, పర్యాటక అధికారులు ప్రకటించారు.
భక్తులు, పర్యాటకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారాంతపు సెలవులు ఉంటే ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా సీప్లేన్ ద్వారా త్వరగా వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని త్వరగా వెళ్లే అవకాశం ఉండేదని భావించారు. అయితే పది నెలలుగా గడుస్తున్నా ట్రయల్ రన్‌కు పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వానికి ప్రారంభంలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం సర్వ సాధారణమేనని పలువురు విమర్శిస్తున్నారు.
ఇరిగేషన్, అటవీశాఖ అనుమతులు లభించేనా..?
సీప్లేన్ నిర్వహించే ప్రదేశంలో శ్రీశైలం పూర్తిగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఇది పూర్తిగా వన్యప్రాణులు, చిరుతలు, పెద్దపులులు అవాసానికి అనువైన ప్రదేశం. ఇక్కడ సీప్లేన్ సేవలు నిర్వహించాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే సీప్లేన్ టేక్ ఆఫ్, ల్యాండింగ్‌కు డ్యామ్ పరిధిలో ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అలాగే ఏవియేషన్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. కూటమి ప్రభుత్వం విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన అనుమతులు అన్ని తీసుకుని సేవలను అందుబాటులోకి తేవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు.
సర్వేలు, సమీక్షలకే పరిమితం
విజయవాడ నుంచి శ్రీశైలానికి వచ్చే సీప్లేన్ ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీ) అధికారులు డిటేల్డ్ ప్రాజెక్టు రిపొర్టు తయారు చేస్తున్నారు. శ్రీశైలంతో పాటు అరకు, లంబసింగి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, గండికోట, నర్సాపూర్, తిరుపతి, ప్రకాశం బ్యారేజ్ మొత్తం 10 ప్రదేశాలలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ కన్పల్టెన్సీకి నియమించారు. వారు మే నెల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు పనులు ప్రారంభించారు.
ఏపీఐడీసీ అధికారులు వారానికి ఒకసారి సర్వేలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీపీఆర్‌లో సీప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం, సీప్లేన్ టేక్‌ఆఫ్, టేక్ ఆన్‌కు నీటిలో సుమారు 1.16 కిలోమీటర్ల పోడవు, 120 మీటర్ల వెడల్పు ఉండే ప్రదేశం, పర్యాటకులు సీప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీల ఏర్పాటు, టికెట్టు ధరలు, ఎన్ని ప్లేన్ సర్వీసులను తిప్పాలి, రోజుకు ఎన్ని ట్రిప్పులు, సీప్లేన్ ల్యాండింగ్ వద్ద పర్యాటకులకు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, టికెట్టు కౌంటర్, సిబ్బంది తదితర పూర్తి వివరాలను డీపీఆర్‌లో పొందుపరుచనున్నారు. వచ్చే జనవరి నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని కన్సల్టెన్సీకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.