సెక్షన్ 41ఏ ఉంది.. జాగ్రత్త!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : చట్టంపై ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని కొందరు పోలీసులు అవకాశంగా తీసుకుంటున్నారు. అరెస్టుల పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అరెస్టులను తగ్గించేందుకు, ఏడేళ లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసు అధికారులు తుంగలో తొక్కుతున్నారు. నోటీసులు జారీ చేసి కోర్టు దృష్టికి తీసుకువెళ్లాల్సిన కేసుల్నీ పక్కదోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘చట్టాలు-మార్పులు-సవరణలు’ తదితర అంశాలపై కిందిస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీయే సిద్ధమయ్యారు. నిబంధనలను ఉల్లంఘించి నిందితులపై కేసులు నమోదు చేయడంపై కొంతకాలంగా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసుల్ని తారుమారు చేయడం, తప్పుడు స్టేట్మెంట్లు రికార్డు చేయడం, పెద్దలకు ఒకలా, పేదలకు మరోలా కేసులు నమోదు చేయడాన్ని తనిఖీల్లో ఆయన గుర్తించారు. అరెస్టుల పేరుతో బెదిరింపు, చట్టం మీకేం తెలుసంటూ చులకనగా మాట్లాడే పోలీస్ అధికారులపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జెడ్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఆర్పీసీసీ సెక్షన్ 41 గురించి వివరించే ప్రయత్నంచేశారు. అరెస్టులు లేకపోతే నిందితులు తమ మాట వినరేమోనని పోలీసులు భావిస్తున్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాకూడదని, నిబంధనలు పాటించాలని, శిక్ష అమలు చేసే అధికారం పోలీసులకు ఉండకూడదని ఎస్పీ చెబుతున్నారు.
అరెస్టు ఎప్పుడంటే...
పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న వివిధ కేసుల్లో ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్టు చేయకుండా నోటీసు జారీచేసి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నిందితుడు మరో నేరం చేసే అవకాశం , సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం, బయట ఉన్నవారిని భయపెట్టడం, ఇతరులను ప్రలోభపెట్టడం, విచారణకు ఆటంకం కలిగించే అవకాశం, తప్పించుకునే మార్గం ఉందని భావిస్తే తగిన ఆధారాలు చూపుతూ విచారణాధికారి లిఖితపూర్వకంగా కోర్టుకు తెలియజేస్తేనే అరెస్టు చేసే అధికారం ఉంటుందని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధన ఉల్లంఘించే అధికారం పోలీసులకు లేదని ఎస్పీ చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ, బీ, సీ, డీ, ఈ అంశాలు ఏం చెబుతున్నాయి, పరిధి దాటితే అరెస్టు చేయాల్సి వస్తే, ఏడేళ్లు పైబడి శిక్ష పడే అవకాశం ఉన్న కేసులేంటి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలేంటి అన్న అంశాలపై ఎప్పటికప్పుడు సిబ్బందికి కౌన్సెలింగ్ చేస్తున్నారు.
నోటీసు జారీచేస్తే సరిపోయినా..
దొమ్మి, కొట్లాట (సెక్షన్ 147), వేగంగా వాహనం నడపడం (304, 279), భార్యను వేధించడం (498ఎ) తదితర కేసుల్లో తమ సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ వాపోతున్నారు. గతంలో ఉన్న 41సెక్షన్ను 41ఏగా సవరించారని, వారెంట్ లేకుండా అరెస్టుచేయాల్సిన సమయాల్లోనూ పోలీసులు చట్టాల్ని, కోర్టుల్నీ గౌరవించాలని చెబుతున్నా కొంతమంది నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్టు ఆయన దృష్టికి వచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విషయంలో పొందూరు పోలీసులు ముందంజలో ఉన్నట్టు అధికారులు ఆరోపిస్తున్నా రు. సెక్షన్ 41ఏలో ఉన్న బీ, సీ, డీ, ఈ అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసులు నమోదు చేయాలని చెబుతున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ట్టు తెలిసింది. ఎస్పీ వద్దకు వస్తున్న బాధితులు ఇదే విషయమై తాము పోరాటాలకు దిగుతామని చెబుతుండడం చూస్తుంటే జిల్లా పోలీసుల వ్యవహారం ఎలా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. 2009నుంచి జరిగిన వివిధ సవరణల్ని పోలీసులు ఒంట బట్టించుకోవడం లేదని మొత్తుకుంటున్నారు. సీఆర్పీసీలో మార్పుల్ని గమనించాలని లా కమిషన్ సూచిస్తోంది.
చర్యలు తప్పవు
తెల్లకాగితంపై ఏమీ రాయకుండానే కొందరు పోలీసులు సంతకాలు తీసుకుంటున్నారు. చాలా కేసుల్లో సెక్షన్ 41ఏ అమలు కావడం లేదు. అరెస్టులను తగ్గించి వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని సాక్షాత్తూ కోర్టులే చెబుతున్నా పోలీసుల్లో మార్పు రావడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను పెడదోవ పట్టిస్తున్నారు. బాధితులు, ఫిర్యాదుదారులకు చట్టాలపై, సెక్షన్ 41ఏఅమలుపై ఎలాంటి సందేహాలున్నా నిర్భయంగా ఎస్పీ కార్యాలయంలో ఉన్న డీసీఆర్బీ, ఎస్బి విభాగాలతోపాటు నేరుగా నన్ను కూడా సంప్రదించవచ్చు. ఎ.ఎస్.ఖాన్, జిల్లా ఎస్పీ