ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అద్భుతం
చనిపోయిన వారిని కళ్లముందు నిలుపుతున్న ఏఐ
డిజిటల్ పునరుత్థానం, ‘గ్రీఫ్ టెక్’ పేరుతో ప్రాచుర్యం
ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లే ఆధారం
సాక్షి, అమరావతి: వివాహం జరుగుతున్నప్పుడు వ«ధూవరుల తల్లిదండ్రుల్లో ఎవరైనా లేకపోతే.. శుభకార్యానికి వచ్చిన వారంతా ‘ఇలాంటి సమయంలో మీ నాన్న, అమ్మ ఉంటే ఎంత సంతోషించేవారో.. వారులేని లోటు కనిపిస్తోంది’ అంటుంటారు. ఇప్పుడు ఆ లోటును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తీరుస్తోంది. ఎప్పుడో భౌతికంగా దూరమైన వారిని సజీవ చిత్రాలుగా మలిచి కళ్లముందు సాక్షాత్కరింపజేస్తోంది. దీనిని సాంకేతిక యుగంలో ఓ అద్భుతంగా అభివర్ణించవచ్చు. చనిపోయిన వ్యక్తులను బతికున్నవారిలా చూపించే ఏఐ సాంకేతికతను ‘డిజిటల్ పునరుత్థానం’ ‘గ్రీఫ్ టెక్’ అని పిలుస్తున్నారు. ఈ సాంకేతికత చనిపోయినవారి ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు, మెసేజ్‌లు వంటి వాటిని ఉపయోగించుకుని వారి రూపాన్ని, స్వరాన్ని, ప్రవర్తనను పునఃసృష్టిస్తోంది. ఇప్పుడు ప్రతి వేడుకలోనూ ఈ విజ్ఞానం భావోద్వేగాలను పంచుతోంది.
ఎలా పనిచేస్తుంది?
ముందుగా ఏఐ టూల్‌కు చనిపోయిన వ్యక్తికి సంబంధించిన డేటాను ఇస్తారు. ఇందులో టెక్టŠస్ మెసేజ్‌లు, ఈ–మెయిల్‌లు, ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్ లు ఉంటాయి. ఈ డేటాను ఏఐ విశ్లేషించి.. చనిపోయిన వ్యక్తి ముఖం, కదలికలు, హావభావాలు, గొంతుతో ఒక డిజిటల్ అవతార్‌ను సృష్టిస్తుంది. ఈ అవతార్‌తో మనం చాట్‌బాట్ రూపంలో మాట్లాడవచ్చు. కొన్ని ఆధునిక వ్యవస్థలు వీడియో కాల్స్ ద్వారా కూడా సంభాషించే సౌలభ్యాన్ని కల్పిస్తాయి.
ఎన్నో యాప్‌లు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో ఇలాంటి వీడియోలను సృష్టించేందుకు అనేక యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టోరీఫైల్ వంటి కంపెనీలు చనిపోయినవారు అంత్యక్రియల సమయంలో మాట్లాడేలా ఏఐని వినియోగిస్తున్నాయి. చనిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలు, వాటికి ఏఐ ప్రశ్నలు, సమాధానాలు జతచేసి బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా చేస్తుంది. మైహెరిటేజ్ అనే సంస్థ ‘డీప్ నాస్టాల్జియా’ అనే ఫీచర్‌తో పాత ఫొటోలను కదిలే వీడియోలుగా (యానిమేటెడ్) మారుస్తోంది. ఈ ఫీచర్ చనిపోయినవారి ఫొటోలను యానిమేట్ కూడా చేస్తుంది. డీప్‌బ్రెయిన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ‘రీ మెమరీ 2’ అనే సేవ ద్వారా చనిపోయినవారి వాస్తవిక ఏఐ అవతార్‌లను తయారు చేస్తోంది.
భావోద్వేగంతో ఆందోళన
చనిపోయినవారిని ఏఐతో పునఃసృష్టించడం వల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చనిపోయిన వ్యక్తి సమ్మతి లేకుండా వారి డేటాను ఉపయోగించడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏఐ అవతార్‌తో మాట్లాడినప్పుడు.. కుటుంబ సభ్యులు అది నిజమైన వ్యక్తి కాదని తెలుసుకోలేకపోవడం వల్ల భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ సాంకేతికత దుఃఖాన్ని తగ్గించడానికి బదులుగా, కొంతమందిని చనిపోయినవారితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. బాధను మరింతగా పెంచుతుంది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చు. అలాగే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేసి ప్రజలను మోసం చేసే ప్రమాదం కూడా పొంచి ఉంది.


