
వాతావరణ మార్పులతో పెరుగుతున్న పాముల ముప్పు
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలకు అతిపెద్ద ముప్పు
నీటి వనరులు మారిపోతుండటమే కారణం
ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తున్న పాముల ఆవాస ప్రాంతాలు
పాము కాట్లతో దేశంలో ఏటా 60 వేల మంది మృత్యువాత
‘బిగ్ ఫోర్’ స్నేక్స్‌తోనే తీవ్ర ప్రమాదం
వాతావరణ మార్పులతో విషపూరిత పాముల హాట్‌స్పాట్లు కూడా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడున్న పాముల హాట్‌స్పాట్లు త్వరలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఏపీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర పాముకాటు మరణాలకు హాట్‌స్పాట్లుగా ఉన్నాయి.
ఈ ప్రాంతాల్లో పాముకాట్ల తీవ్రత చాలా ఎక్కువ. దేశంలో పాముకాటు వల్ల ఏటా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇప్పుడు వాతావరణ మార్పులతో ఈ ముప్పు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపిస్తోందని పీఎల్‌ఓస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, అమరావతి
సాధారణంగా వానాకాలంలో పాముకాటు మరణాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. వర్షాకాలం అయిపోగానే ఇలాంటి కేసులు తగ్గిపోతాయి. అయితే, రానున్న కాలంలో వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో పాముకాటు మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతాన్ని పాముల బెడద వణికించనుందని ‘పీఎల్‌ఓ’స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది.
భూమి వేడెక్కుతుండటంతో..
వేడెక్కుతున్న భూమి, అస్థిర వర్షాలు, వాతావరణ మార్పులతో భూమి మరింతగా వేడెక్కుతోంది. వర్షాలు అస్థిరంగా కురుస్తున్నాయి. దీంతో పాముల జీవన విధానం గందరగోళంగా మారుతోంది. పాములు చల్లని లేదా వెచ్చని ప్రాంతాల్లో జీవించడానికి ఇష్టపడతాయి. భూమి వేడెక్కడంతో ఇప్పటివరకు చల్లగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ తదితర ప్రాంతాలు పాములకు కొత్త ఆవాసాలుగా మారుతున్నాయి.
వర్షాలు ఎక్కువైనా, తక్కువైనా పాములు తమకు ఆహారంగా దొరికే ఎలుకలు, చిన్న జంతువులు ఉన్న చోటికి వెళ్తాయి. అస్థిర వర్షాల వల్ల పొలాలు, అడవులు, నీటి వనరులు మారిపోయి అవి గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. అడవులు నరికివేత, నగరాలు విస్తరించడం, భూమి ఉపయోగంలో మార్పుల వల్ల పాములు తమ సహజ ఆవాసాలను వదిలి మనుషులు ఉండే ప్రాంతాలకు వస్తున్నాయి. దీనివల్ల పాముకాట్ల బెడద పెరుగుతోంది.
‘బిగ్ ఫోర్’ స్నేక్స్‌తోనే బెడద
దేశంలో నాలుగు విషపూరిత పాముల వల్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని ‘బిగ్ ఫోర్’ స్నేక్స్‌గా పిలిచే ఇండియన్ కోబ్రా (నాగుపాము), కామన్ క్రైట్ (కట్లపాము), రస్సెల్స్ వైపర్ (రక్త పింజరి), సా–స్కేల్డ్ వైపర్ (చిన్న పింజరి) వల్లే మన దేశంలో అత్యధిక పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయి.
వీటి కాటువల్ల విషం వేగంగా శరీరంలో వ్యాపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే మరణానికి దారితీస్తుంది. మన రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లోని పొలాల్లో నాగు పాములు, రక్త పింజరి, కట్ల పాములు ఎక్కువ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కింగ్ కోబ్రాలు కనిపిస్తాయి. అయితే.. కోస్తా జిల్లాల్లోనే పాముకాట్ల బెడద తీవ్రంగా ఉంటోంది.
కొత్త ఆవాసాలకు పాములు
వాతావరణం మార్పులతో పాముల ఆవాసాలు చెదిరిపోయి అవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే 50 ఏళ్లలో ఈ పాములు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు మరింతగా విస్తరించే అవకాశాలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వేడెక్కుతున్న అక్కడి వాతావరణం ఆ ప్రాంతాలను పాములకు అనుకూలంగా మారుస్తోంది.
వాతావరణ మార్పులతో పొలాలు, నీటి వనరులు మారుతుండటంతో అక్కడ ఉండే ఎలుకలు, చిన్న పాములను ఆహారంగా తీసుకునేందుకు విషపూరిత పాములు ఇళ్లు, పొలాల సమీపంలోకి వస్తున్నాయి. అందువల్లే పాముకాట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా వ్యవసాయ భూముల వద్ద రైతులు, కూలీలు, పిల్లలు పాముకాట్ల బారినపడుతున్నారు.
ఆస్పత్రులపై ఒత్తిడి
పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ వీనం ఔషధాలు గ్రామీణ ఆస్పత్రుల్లో తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చినా పాముకాటుకు గురైన వారు చనిపోతున్నారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు, శిక్షణ పొందిన వైద్యుల అవసరం ఎక్కువవుతోంది. పాముకాటు గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పీఎల్‌ఓస్ అధ్యయనం స్పష్టం చేస్తోంది.