
ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.. మేజిస్ట్రేట్‌లకు హైకోర్టు సంచలన ఆదేశాలు
శాఖాపరమైన విచారణలతో పాటు కోర్టు ధిక్కార చర్యలు చేపడతాం.. స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ
సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి.. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలు తప్పవ్
సోషల్ మీడియా కేసుల్లో కూడా యాంత్రికంగా వ్యవహరించొద్దు
ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే నేరాల్లో ఎలాపడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు..
సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్‌పై స్పష్టమైన ఆదేశాలు
రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి
పోలీసులు చట్టాన్ని పాటించారా? లేదా? చూడాలి
చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు
ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది
అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించి తీరాల్సిందే
ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు
చేయొద్దు.. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి.. 14 రోజుల్లోనే విచారణను పూర్తి చేయాలి
రిమాండ్ విషయంలో మేజిస్ట్రేట్‌లు సంతృప్తి చెందాలి
సర్క్యులర్‌ను మేజిస్ట్రేట్‌లు కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మేజిస్ట్రేట్‌లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేస్టేట్‌లకు పరిపాలనాపరంగా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది.
ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే నేరాల్లో ఎలాపడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని.. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తు.చ. తప్పక అనుసరించాలని తేల్చిచెప్పింది. అలాగే, ఇమ్రాన్‌ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.
⇒ రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని.. పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారా? లేదా..? చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తుండడంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది.
⇒ ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణలకు సంబంధించి (3–7 ఏళ్లు శిక్షపడే నేరాలు) పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేముందు డీఎస్పీ ఆమోదంతో.. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని, 14 రోజుల్లో దానిని ముగించాలని ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నదని... దీనిప్రకారం రాష్ట్రంలోని మేజిస్ట్రేస్టేట్‌లందరూ రిమాండ్ విధించే ముందు ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు అధికారి... అర్నేష్‌కుమార్, ఇమ్రాన్‌ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అన్నది చూడాలని హైకోర్టు తేల్చిచెప్పింది.
⇒ నిందితులు పదేపదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకని పోలీసు కస్టోడియల్ విచారణ అవసరమని మేజిస్ట్రేస్టేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మేజిస్ట్రేస్టేట్‌లందరూ పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మేజిస్ట్రేస్టేట్‌లకు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు శనివారం సర్క్యులర్ జారీ చేసింది.
చంద్రబాబు సర్కారుకు ఝలక్..! పోలీసు రాజ్యానికి చెక్!
ఏడాది కాలంగా తీవ్ర నిర్బంధంతో... తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టులాంటివే. రెడ్‌బుక్ రాజ్యాంగంతో.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, లెక్కలేనితనంతో చెలరేగుతున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట పడనుంది. కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడుతున్న ఖాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారు. హైకోర్టు తాజా మార్గదర్శకాలతో ఇకపై అడ్డగోలు అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్‌లు కుదరదని వివరిస్తున్నారు.
⇒ కూటమి సర్కారు వచ్చాక తమ పనితీరును, వారి నేతలను విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు పెట్టినవారిపై.. మరీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అడ్డగోలుగా కేసు నమోదు చేస్తోంది. వ్యంగ్య ప్రదర్శన ఇచ్చినా సహించలేక కేసులు పెట్టింది. సోషల్‌మీడియా పోస్టులను అత్యంత కఠినమైన వ్యవస్థీకృత నేరం పరిధిలోకి తీసుకొచ్చింది.
పెద్దసంఖ్యలో అరెస్ట్‌లు చేసి జైలుకు కూడా పంపింది. బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే, హైకోర్టు పలు సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టులకు వ్యవస్థీకృత నేరం కింద ఎలా కేసు పెడతారంటూ నిలదీసింది. అవి ఆ నేరం కిందకు రావని సైతం తెలిపింది. అయినా కూడా పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.
⇒ ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్‌ల ఎదుట ప్రవేశపెట్టగా చాలామంది యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా సహేతుక కారణాలను వెల్లడించకుండానే రిమాండ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో పలువురు నిందితులు తమ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మొన్నటిదాక కూడా రిమాండ్ ఉత్తర్వులపై ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతూనే వచ్చాయి.
హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని మేజిస్ట్రేట్‌లు
ఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు.. మేజిస్ట్రేట్‌ల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదని హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి తీరాలని చెప్పినా ప్రయోజనం లేకపోయింది.
అయినా, యాంత్రికంగా, సహేతుక కారణాలను తెలియజేయకుండా రిమాండ్‌లు విధించడం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు చివరకు మేజిస్ట్రేట్లకు పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో అర్నేష్‌కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని మేజిస్ట్రేట్లకు తేల్చి చెప్పింది.
ఇదీ అర్నేష్‌కుమార్ కేసు...
బిహార్ కు చెందిన అర్నేష్ కుమార్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. అర్నేష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం అరెస్టుల విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసి వాటిని పాటించాల్సిందేనని కింది కోర్టులు, పోలీసులను ఆదేశించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పు ఇది. అందులోని మార్గదర్శకాలు..
1. సాధారణంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే.. ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాగే వారి హక్కుల గురించి వివరించాలి.
2. అరెస్టు చేయడానికి కారణాలను తప్పకుండా రికార్డు చేయాలి.
3. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించాలి.
4. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైతే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి.